రాజుగారి కిరిటాలు ఒక్కొక్కటిగా తీసేస్తారా?

అవును మరి అల్లరి చేస్తే ఉన్న‌‌ది లేనిదీ అన్నీ గోల్ మాల్ అవుతాయి. ఇది అందరికీ తెలిసిన సత్యం. మరి గోదావ‌రి జిల్లాలకు చెందిన రఘురామ కృష‌్ణంరాజు [more]

Update: 2020-07-13 02:00 GMT

అవును మరి అల్లరి చేస్తే ఉన్న‌‌ది లేనిదీ అన్నీ గోల్ మాల్ అవుతాయి. ఇది అందరికీ తెలిసిన సత్యం. మరి గోదావ‌రి జిల్లాలకు చెందిన రఘురామ కృష‌్ణంరాజు గారికి ఈ సంగతి ఎందుకు తెలియడంలేదో. ఆయన తన కలల పదవిగా ఎంపీ సీటుని పెట్టుకున్నారు. వైఎస్సార్ టైమ్ నుంచి ప్రయత్నం చేస్తే చివరికి జగన్ రూపంలో అది సాకారం అయింది. సరే పదవి వచ్చిన సరదా అయినా పూర్తిగా తీరకుండానే ఉన్న చోటును, ఉంటున్న పార్టీని బేఖాతర్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇపుడు రరఘురామ కృష‌్ణంరాజు పడుతున్న అగచాట్లు లాగానే ఉంటుంది మరి అంటున్నారు.

అది టార్గెట్…..

రఘురామ కృష‌్ణంరాజుకి ప్రస్తుతం ఉన్న కిరీటాలు అన్నీ ఒక్కోటిగా తీసేందుకు వైసీపీ హై కమాండ్ కసిగా పనిచేస్తోంది. ఆయన తొలిసారి ఎంపీగా గెలిచినా కూడా జగన్ ఆయన మీద అభిమానంతో పార్లమెంట్ సబార్డినేట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవిని ఇప్పించారు. అలాగే అనేక ఇతర పదవులు కూడా వివిధ స్టాండింగ్ కమిటీల ద్వారా రఘురామ కృష‌్ణంరాజుకి దక్కాయి. ఇపుడు వాటి మీద వైసీపీ పెద్దల కన్ను పడింది. ముందు ఆ పదవులు ఊడగొట్టాలని అనుకుంటున్నారు. దాని మీద లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు కూడా.

పోతాయటగా…….

ఇక ఓం బిర్లా సైతం దీని మీద వైసీపీ వాదనతో ఏకీభవించినట్లుగా చెబుతున్నారు. పార్లమెంట్ పదవులు ఏవి ఇవ్వాలన్నా కూడా ఆయా పార్టీల అధినాయకత్వాలు నుంచి అనుమతి వస్తేనే ఇస్తామని అంటున్నారు. ఆ విధంగా అఫీషియల్ గా వైసీపీ నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్ తో పాటు మా పార్టీ ఆయనకి ఈ పదవి ఇవ్వండి అని కవరింగ్ లెటర్ తోనే పదవులు దక్కుతాయి. ఇపుడు మా పార్టీ మనిషే కాదు, పైగా ఆయన లోక్ సభ సీటును ఖాళీ చేయించాలని వైసీపీ హై కమాండ్ కోరుతున్నపుడు ఈ పార్లమెంటరీ పదవులు ఏ మూలకు వస్తాయి. వాటికి ఉన్న ఉనికి ఏంటి అన్న ప్రశ్న కూడా వస్తోంది. దాంతో ఆటోమెటిక్ గా రఘురామ కృష‌్ణంరాజుకి అవి పోతాయి అంటున్నారు. దానిమీద వైసీపీ పట్టుపడుతోంది కాబట్టి తొలగించడానికి ఓం బిర్లా అంగీకరించారని అంటున్నారు.

ఉత్త రాజుగా…..

రాజులంటే రాజ్యాలు ఉండాలి. ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యంలో పదవులు ఉన్న వారే మహారాజులు. మరి రఘురామ కృష‌్ణంరాజు ఏ పదవులను చూసి వైసీపీ హై కమాండ్ ని తోసిరాజని పొమ్మంటున్నారో ఆ పదవులకు కత్తెర వేయడం ద్వారా ఉత్త రాజుని చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అంటే ఆయన ఎంపీ పదవి కంటే ముందే ఈ పదవులు పోతాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆ తరువాత నెమ్మదిగా అనర్హత పిటిషన్ మీద కూడా తమ డిమాండ్ ముందు పెట్టి తొందరలోనే రాజావారిని మాజీ చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. మరి ఓం బిర్లా ఎంతవరకూ సహకరిస్తారో . ఆయన వెనక ఉన్న కమలం పార్టీ పెద్దలు ఎంత మేరకు ఆయనకు స్వేచ్చ ఇస్తారో చూడాలి మరి.

Tags:    

Similar News