ఫేస్ వాల్యూ ఇంకా ఇంత ఉందా?

వైసీపీ అస‌మ్మతి నాయ‌కుడు, న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌ కృష్ణంరాజు.. ఇటీవ‌ల కాలంలో పార్టీపైనా.. సీఎం జ‌గ‌న్‌పైనా.. ఆ పార్టీ నేత‌ల‌పైనా ఒంటికాలిపై లేస్తున్న విష‌యం తెలిసిందే. [more]

Update: 2020-09-25 05:00 GMT

వైసీపీ అస‌మ్మతి నాయ‌కుడు, న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌ కృష్ణంరాజు.. ఇటీవ‌ల కాలంలో పార్టీపైనా.. సీఎం జ‌గ‌న్‌పైనా.. ఆ పార్టీ నేత‌ల‌పైనా ఒంటికాలిపై లేస్తున్న విష‌యం తెలిసిందే. ప్రభుత్వంపై నిత్యం ఏదో కార‌ణం చూపుతూ.. ప్రతిప‌క్షాన్ని మించిపోయిన రీతిలో దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ర‌ఘురామ‌ కృష్ణంరాజుపై వైసీపీ నాయ‌కులు కొన్నాళ్లు కౌంట‌ర్ వ్యాఖ్యలు చేశారు. త‌ర్వాత ఆయ‌న మానాన ఆయ‌నను వ‌దిలేశారు. అయినా కూడా ర‌ఘురామ‌ కృష్ణంరాజు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇక‌, ఇన్ని మాట‌లు అనేబ‌దులు .. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నే డిమాండ్ వైసీపీ నుంచి వ‌చ్చింది.

ఇటీవల సవాల్ విసిరి…

రెండు రోజుల కింద‌ట విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్యనారాయ‌ణ కూడా వైసీపీలో ఏ ఎంపీ అయినా.. జ‌గ‌న్ పెట్టిన భిక్షేన‌ని… ర‌ఘురామ‌ కృష్ణంరాజుకు అంత ధైర్యం ఉంటే.. రాజీనామా చేసి గెల‌వాల‌ని స‌వాల్ విసిరారు. ఈ క్రమంలో చాలా మంది నాయ‌కులు ఇప్పటికే ఈ డిమాండ్ చేశారు. ఇక‌, ఈ డిమాండ్‌పై మొద‌ట్లో రాజీనామా చేసేదే లేద‌న్న ర‌ఘురామ‌.. ఇటీవ‌ల ఓ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. రాజ‌ధాని అజెండాతో ఎన్నిక‌లు నిర్వహిస్తే.. తాను రాజీనామా చేస్తాన‌ని.. ల‌క్ష ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధిస్తాన‌ని అన్నారు. ఇది నిజంగా వైసీపీలోను, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ కూడా చ‌ర్చనీయాంశంగా మారింది.

కేవలం 28 వేల ఓట్లు మాత్రమే….

ఈ క్రమంలో ర‌ఘురామ‌ కృష్ణంరాజు ఉద్దేశం ఏంటి? ఆయ‌న ధీమా ఏంటి? అనే అంశాల‌పై న‌ర‌సాపురంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ర‌ఘురామ‌ కృష్ణంరాజు వైసీపీ టికెట్ పై గెలుపు గుర్రం ఎక్కారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు వ‌చ్చిన మెజారిటీ.. కేవ‌లం 28 వేల ఓట్లు మాత్రమే. ఇక‌, జ‌న‌సేన నుంచి పోటీ చేసిన నాగ‌బాబుకు 2.50 ల‌క్షల ఓట్లు వ‌చ్చాయి. నిజానికి నాగ‌బాబు ఓడిపోయినా.. మంచి ఓటు బ్యాంకు సాధించారు. ఇక‌, టీడీపీ నుంచి పోటీ చేసిన ఉండి మాజీ ఎమ్మెల్యే క‌లువపూడి శివ‌.. కేవ‌లం పాతిక వేల ఓట్లతో ఓట‌మి పాల‌యినా.. ట‌ఫ్ ఫైట్ ఇచ్చారు.

బీజేపీ నుంచి పోటీ చేసినా….

ఈ క్రమంలో ఇప్పుడు ర‌ఘురామ‌ కృష్ణంరాజు రాజీనామా చేసి.. అక్కడ నుంచి బ‌రిలోకి దిగితే.. ఆయ‌న ఖ‌చ్చితంగా ఇప్పుడున్న ప‌రిస్థితిలో బీజేపీ నుంచే రంగంలోకి దిగే అవ‌కాశం ఉంటుంది. ర‌ఘురామ ఇప్పటికే బీజేపీకి ద‌గ్గర‌గా ఉంటున్నారు. పైగా ఆయ‌న గ‌త ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీలో యాక్టివ్‌గా ఉంటూ ఆ పార్టీ కేంద్ర నాయ‌కుల‌తో స‌న్నిహితంగా ఉండ‌డంతో పాటు మంచి ప‌రిచ‌యాలు పెంచుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌లు వ‌స్తే ర‌ఘురామ‌ కృష్ణంరాజు బీజేపీ గుర్తుపై పోటీ చేయ‌డం ఖ‌రారైన‌ట్టే..!

వీరు అండగా నిలిస్తే…..

ఈ నేప‌థ్యంలో బీజేపీ మిత్ర ప‌క్షం జ‌న‌సేన ఆయ‌న‌కు మ‌ద్దతుగా నిలుస్తుంది. దీంతో జ‌న‌సేన ఓటు బ్యాంకు ర‌ఘురామ‌ కృష్ణంరాజుకి ప‌డే ఛాన్స్ ఉంటుంద‌ని అంచ‌నా. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తి అజెండాతో రంగంలోకి దిగితే.. టీడీపీ అస‌లు పోటీ కూడా పెట్టే అవ‌కాశం లేదని తెలుస్తోంది. పైగా ర‌ఘురామ‌ కృష్ణంరాజుకు-బాబుకు మ‌ధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ దూరంగా ఉంటే.. ఆ ఓటు బ్యాంకు కూడా ర‌ఘుకు క‌లిసి రానుంది. ఇక‌, మంత్రి చెరుకువాడ రంగ‌నాథ‌రాజుపై ఆగ్రహంతో ఉన్న ఉండి.. పాల‌కొల్లు, భీమ‌వ‌రంలో రాజులు ఇప్పుడు ర‌ఘురామ‌ కృష్ణంరాజుకు అండ‌గా నిలిచే అవ‌కాశం ఉంది. ఈ ప‌రిణామాల‌ను అంచ‌నా వేసుకునే ర‌ఘురామ‌ కృష్ణంరాజు అంత ధీమాగా త‌న రాజీనామాకు రెడీ అవుతున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. అందుకే తాను తన ఫేస్ తోనే గెలిచానాని పదే పదే చెబుతున్నారు. ఏ పార్టీలో చేరకుండా రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిస్తే రాజుగారి ఫేస్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News