రాజమండ్రి వేడెక్కిపొతుందిగా …?

కరోనా మహమ్మారి ఒక పక్క వణికిస్తోంది. మరోపక్క మండే ఎండలు. ఈ రెండిటికి తోడు రాజమండ్రిలో ఇప్పుడు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. ప్రతిష్టాకరమైన రాజమండ్రి [more]

Update: 2021-06-08 14:30 GMT

కరోనా మహమ్మారి ఒక పక్క వణికిస్తోంది. మరోపక్క మండే ఎండలు. ఈ రెండిటికి తోడు రాజమండ్రిలో ఇప్పుడు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. ప్రతిష్టాకరమైన రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు కోర్ట్ వ్యవహారాల కారణంగాను, గ్రామాల విలీనం కారణంగా మొన్నటి స్థానిక ఎన్నికలతో పూర్తికాలేదు. ఇప్పుడు విలీనం సమస్యలు తీరిపోయాయి. అయితే ఫైనల్ గా కోర్ట్ తీర్పు ఈ అంశంపై వెలువడాలిసి ఉంది. అయితే సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్ తో 21 గ్రామాలకు బదులు 10 గ్రామాలను విలీనం చేసి ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు గత రెండు నెలలుగా వేగంగా సాగిస్తుంది. తాజాగా డివిజన్ల వారీ రిజర్వేషన్ లను సైతం ఖరారు చేసి 52 డివిజన్లలో ఒక్కసారి వేడి పుట్టించింది కార్పొరేషన్ యంత్రాంగం.

పోటాపోటీ సేవలు …

మొదటి వేవ్ నుంచి రెండోవేవ్ వరకు రాజమండ్రిలో సేవా కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలు పోటాపోటీగా చేస్తున్నాయి. వీటిలో అధికారపార్టీలో అన్ని గ్రూప్ లు పైచేయిగానే ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రధానపక్షం తెలుగుదేశం కన్నా వైసిపి లోని గ్రూప్ లు నడుమే ప్రజా సేవలో పోటీ సాగుతుంది. వైసిపి లోని ఎంపి మార్గాని భరత్ రామ్, సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ, రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా ఆయన సోదరుడు జక్కంపూడి గణేష్ లు సేవాకార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను నిత్యం తన లైవ్ లతో జనంలోకి తీసుకువెళుతు వారికి అందుబాటులో ఉంటూ భరత్ సాగిపోతున్నారు. ఇక డాక్టర్ ఆకుల సత్యనారాయణ తన సొంత డబ్బుతో అంత్యక్రియలకు ఉచిత వాహనాలను ఏర్పాటు చేశారు. రూపాయి ఖర్చు లేకుండా పేదల అంత్యక్రియలకు ఆయన కృషి చేస్తున్నారు. అదేవిధంగా నిత్యం వందలాదిమంది వైద్యులు, రోగులు వారిబంధువులకు అన్నదాన యజ్ఞం చేస్తున్నారు. తనవద్దకు విద్యా వైద్యం కోసం వచ్చేవారికి ఖర్చుకు వెనకాడకుండా ఆదుకుంటున్నారు డాక్టర్. మరోపక్క ఇదే రీతిలో జక్కంపూడి రాజా తన తండ్రి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్ ద్వారా ఉచిత అంత్యక్రియల వాహనాలు, ఆసుపత్రుల్లో బెడ్ లను సమకూర్చిపెట్టడం వంటి చర్యలతో ముందుకు సాగుతున్నారు. అలాగే రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ సైతం కరోనా సోకిన వారికి మందుల కిట్ లను అందిస్తూ సేవ చేస్తున్నారు.

టిడిపి లో ఆదిరెడ్డి మాత్రమే …

తెలుగుదేశం అర్బన్ బాధ్యతలు ఇప్పుడు ఎమ్యెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి వాసు మోస్తున్నారు. ఆయన వైసిపి గ్రూప్ లకు ధీటుగా సేవలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఒక్కరే అయిపోయారు. ఆక్సిజన్ సిలిండర్లు వంటివి ఏర్పాటు చేస్తూ సేవ చేసే స్వచ్ఛంద సంస్థలకు సహకారాన్ని అందిస్తూ ప్రజల్లో ఉండే ప్రయత్నం ఎంతోకొంత చేస్తూనే ఉన్నారు. ఆయనకు భార్య భవాని, తన తండ్రి మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు లు సహకారం మాత్రమే అందుతుంది. మరోపక్క టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికే ఎక్కువ పరిమితం అయ్యారు. అర్బన్ వ్యవహారాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. దీనికి తోడు ఆయన వర్గంగా గట్టిగా ముద్ర పడిన మాజీ కార్పొరేటర్లు కురగంటి సతీష్, పాలిక శ్రీనివాస్, బెజవాడ రాజ్ కుమార్ వంటి ప్రధాన అనుచరగణం గోడ దూకేశారు. ఇలాంటి స్థితిలో అర్బన్ లో గోరంట్ల వాయిస్ గట్టిగా వినిపించే వారు దాదాపు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో అర్బన్ టిడిపి రాజకీయం మొత్తం ఆదిరెడ్డి చుట్టూనే తిరుగుతూ వుంది.

అంతా ఎన్నికల కోసమేనా …?

త్వరలో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండటంతోనే అన్ని పార్టీలు సేవల్లో పోటీగా నడుస్తున్నట్లు జనం భావిస్తున్నారు. ఆందోళనకర రీతిలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నా కార్పొరేటర్ టికెట్ల కోసం తమ టికెట్ పైకి పోతుందన్న భయాన్ని సైతం పక్కన పెట్టి నేతలు దూసుకు పోతున్నారు. ఎపి లో టిడిపి ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో బలహీనపడిన నేపథ్యంలో జగన్ ఏ సమయంలో అయినా రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకు గంట కొట్టేస్తారనే అధికార విపక్ష పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. చిన్నపాటి కోర్ట్ అడ్డంకి తొలగిపోవడం కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పడితే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల వార్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చేందుకే రంగం సిద్ధమై ఉంది. ఇక్కడి కార్పొరేషన్ ఏర్పడిన నాటినుంచి ఇప్పటికి మూడు సార్లు టిడిపి మేయర్ స్థానాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ రికార్డ్ ను తిరగరాయడానికి వైసిపి నేతలు కట్టుకున్న కంకణం, కంటున్న కలలు ఏ మేరకు ఫలిస్తాయో త్వరలో తేలనుంది.

Tags:    

Similar News