ఈసారీ వైసీపీ స్పీడ్ కు బ్రేక్ వేస్తారా..?
కడప జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ కి బ్రేకులు వేసిన నియోజకవర్గం రాజంపేట. జిల్లాలోని 10 సీట్లలో తొమ్మిది నియోజకవర్గాలు వైసీపీ గెలిచినా [more]
కడప జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ కి బ్రేకులు వేసిన నియోజకవర్గం రాజంపేట. జిల్లాలోని 10 సీట్లలో తొమ్మిది నియోజకవర్గాలు వైసీపీ గెలిచినా [more]
కడప జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ కి బ్రేకులు వేసిన నియోజకవర్గం రాజంపేట. జిల్లాలోని 10 సీట్లలో తొమ్మిది నియోజకవర్గాలు వైసీపీ గెలిచినా రాజంపేటలో మాత్రం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన మేడా మల్లిఖార్జునరెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆకేపాటి అమర్నాధ్ రెడ్డిపై ఆయన 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత ఆయనకు విప్ పదవి కూడా దక్కింది. కానీ, ఎన్నికల వేళ ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వైసీపీ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న అమర్నాధ్ రెడ్డికి మొండిచెయ్యే మిగిలింది. కానీ, జగన్ బుజ్జగింపుతో ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇక, తెలుగుదేశం ఈసారి కొత్త అభ్యర్థి చెంగల్రాయుడును ఇక్కడి నుంచి పోటీకి దింపింది.
ఏకతాటిపైకి వైసీపీ నేతలు
కడప జిల్లాలో ఈసారి కచ్చితంగా గెలుస్తామని టీడీపీ లెక్కలేసుకుంటున్న స్థానాల్లో రాజంపేట ఒకటి. గత ఎన్నికల్లో గెలిచినందున ఈసారి కూడా ఇక్కడ విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. గత ఎన్నికల్లో ఓడినా ఈసారి తిరిగి ఈ స్థానాన్ని దక్కించుకోవాలని వైసీపీ భావిస్తోంది. మేడా మల్లిఖార్జునరెడ్డి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నందున, అందునా జగన్ స్వంత జిల్లా కడపలో టీడీపీకి ఏకైక ఎమ్మెల్యే అయినందున పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఇక, నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న అమర్నాథ్ రెడ్డి మల్లిఖార్జునరెడ్డి విజయానికి పూర్తిగా సహకరించి ప్రచారం చేయడం ఆయనకు కలిసివచ్చింది. సౌమ్యుడిగా పేరున్న ఆయనపై ఎటువంటి ఆరోపణలు లేవు. ఇక, పోలింగ్ సరళి తర్వాత ఇక్కడ వైసీపీ విజయంపై ఆ పార్టీలో ధీమా మరింత పెరిగింది.
అభ్యర్థి స్థానికేతరుడే అయినా…
టీడీపీ అభ్యర్థి చెంగల్రాయుడు రెండేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన వారైనా ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ కావడం, రాజంపేటలో ఆయన స్వంత సామాజకవర్గమైన బలిజలు ఎక్కువగా ఉండటంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వడంతో ఈ టిక్కెట్ ఆశించిన మరికొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారు అభ్యర్థి విజయానికి మనస్ఫూర్తిగా సహకరించలేదు. ఆర్థికంగానూ చెంగల్రాయుడు బలహీనంగా ఉండగా.. మల్లిఖార్జునరెడ్డి బలంగా ఉండటం వైసీపీకి కలిసొచ్చింది. ఇక, ఇద్దరు అభ్యర్థి సామాజకవర్గ ఓటర్లు సమానంగా ఉన్నాయి. బీసీలు, ఎస్సీలు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఎస్సీల్లో వైసీపీ వైపు కొంత మొగ్గు ఉండగా టీడీపీ బీసీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. అయితే, జగన్ స్వంత జిల్లా కావడం, బలమైన అభ్యర్థిని పోటీలో నిలపడం ద్వారా ఈ సీటు ఈసారి తమ ఖాతాలో పడటం ఖాయమని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు కూడా వైసీపీ అంచనాలకు తగ్గట్లుగానే కనిపిస్తున్నాయి.