రాజారెడ్డి ని మర్చిపోలేక పోతున్నారా. ?

వైఎస్ రాజారెడ్డి పేరు ఈ తరానికి తెలియదు. ఆ మధ్యన యాత్ర మూవీ వస్తే అందులో వైఎస్సార్ తండ్రి పాత్రలో రాజారెడ్డిని చూసి కొంత మంది గుర్తుంచుకుంటారేమో. [more]

Update: 2021-05-26 13:30 GMT

వైఎస్ రాజారెడ్డి పేరు ఈ తరానికి తెలియదు. ఆ మధ్యన యాత్ర మూవీ వస్తే అందులో వైఎస్సార్ తండ్రి పాత్రలో రాజారెడ్డిని చూసి కొంత మంది గుర్తుంచుకుంటారేమో. రాజారెడ్డి పేరు మాత్రం ఇపుడు టీడీపీ పెద్దల నోట మారుమోగుతోంది. గత రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ కనిపెట్టిన పేరు ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడంలేదని తన తాత రాజ్యాంగాన్ని జగన్ అమలు చేస్తున్నారు అంటూ ఘాటు కామెంట్స్ అదే పనిగా చేస్తూ వస్తున్నారు. ఇక్కడ విశేషమేంటి అంటే జగన్ ఏనాడూ తన నోట రాజారెడ్డి పేరు కూడా ప్రస్తావించి ఎరగరు.

వర్ధంతి వేళ….?

రాజారెడ్డి పులివెందుల సర్పంచ్ గా మాత్రమే పనిచేశారు. ఆయన వైఎస్సార్ ని ఉన్నత పదవుల్లో చూడాలనుకున్నారు. ఆయన్ని ఫ్రాక్షనిస్ట్ అని తెలుగుదేశం నాయకులు అంటారు కానీ ఆయన మాత్రం ఫ్రాక్షన్ కక్షలకు బలి అయ్యారు. అది 1998 సంవత్సరం మే నెల 23వ తేదీ. రాజారెడ్డి తన పొలానికి సొంత జీపులో వెళ్ళి తిరిగివస్తూండంగా మిట్ట మధ్యాహ్నం వేసవి ఎండలలో మాటు వేసిన ప్రత్యర్ధులు వెంటాడి నరికి చంపారు. అప్పటికి వైఎస్సార్ పీసీసీ చీఫ్ గా ఎంపీగా మాత్రమే ఉన్నారు. అది జరిగిన ఆరేళ్ళకు ఆయన సీఎం అయ్యారు. ఇక జగన్ కి నాటికి పాతికేళ్ల వయసు ఉంటుందేమో. ఇక రాజారెడ్డి వర్ధంతి వేళ కుటుంబ సభ్యులు పులివెందులలో ఆయన సమాధుల వద్ద వైఎస్సార్ ఫ్యామిలీ సభ్యులు నివాళి అర్పించారు. మరో వైపు టీడీపీ నేతలు యధా ప్రకారం ఆ రోజున కూడా రాజారెడ్డి పేరుని మనసారా తలచుకున్నారు. జగన్ మాత్రం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దాటి కడప వెళ్లకపోవడం విశేషం.

పేదల మనిషిగా…..

ఇదిలా ఉంటే కడపలో కొన్ని చోట్ల వైసీపీ నేతలు మాత్రం ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. పేదల మనిషి రాజారెడ్డి అని కొనియాడారు. ఇక రాజారెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అయితే ఆయన నిరంతరం పేదల కోసం తపన పడేవారు అని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయనతో పరిచయం ఉన్న వారు కమ్యూనిస్ట్ అంటారు. ఆయన భావాలు అలాగే ఉండేవని కూడా చెబుతారు. మరి వర్గ పోరాటం అన్నది సీమ జిల్లాల్లో అప్పట్లో ఎక్కువగా ఉండేది. అనంతపురంలో ఇదే రకంగా కొందరు నేతలు చేస్తే వారిని నవతరం ప్రతినిధులు అన్నారు. అభ్యుదయగాములు అని కూడా కీర్తించారు. వారి జీవిత చరిత్రల మీద సినిమాలు కూడా తీశారు. కానీ రాజారెడ్డి మాత్రం అచ్చమైన ఫ్రాక్షనిస్ట్ గా ప్రత్యర్ధులు ఇప్పటికీ చిత్రీకరిస్తూంటారు.

ఆ బాధ్యత ఉందిగా…?

తన తండ్రి విషయంలో జగన్ ఎపుడూ గౌరవభావంతో ఉంటారు. ప్రభుత్వ పధకాలకు ఆయన పేరు పెట్టి తలచుకుంటారు. దాదాపుగా ప్రతీ రోజూ ఆయన గురించి వల్లె వేస్తారు. మరి తన తాత రాజారెడ్డి మీద ప్రత్యర్ధులు చేసే విమర్శలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా జగన్ మీద ఉంది కదా అన్నది వైసీపీలో మాట. ఇక రాజారెడ్డి విషయంలో ఇప్పటికీ ఏపీ సమాజానికి తెలిసింది అయితే పెద్దగా ఏమీ లేదు. కడపవాసులకు మాత్రమే ఆయన కొద్దిగా పరిచయస్థుడు. అటువంటిది ఆయన రాజ్యాంగం అంటున్నారు. కక్షలు, ఫ్రాక్షనిజమే రాజారెడ్డి ఇజమని చెబుతున్నారు. కేవలం టీడీపీ మాత్రమే కాదు, ఒక వర్గం మీడియా కూడా అదే మాట అంటోంది. మరి బాధ్యత కలిగిన సీఎం గా జగన్ అది తప్పో ఒప్పో చెప్పాల్సిన అవసరం ఉంది కదా అన్నదే అందరి మాట. ఏది ఏమైనా ఆయన చనిపోయి 23 ఏళ్ళు అయింది. తలచుకుంటే వైఎస్సార్ కుటుంబమే తలవాలి. కానీ ఆశ్చర్యకరంగా టీడీపీ నోట్లో ఆయన బాగా నానుతున్నాడు. మరి ఆయన ఎవరికి ఎక్కువ అన్నది ఆ విధంగా బయటకు చెబుతున్నారేమో.

Tags:    

Similar News