ఇదీ మన ఘనత

ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో చట్టసభలు ఉంటాయి. కొన్ని దేశాల్లో రెండు సభలు ఉంటాయి. మరికొన్ని దేశాల్లో ఒకే ఒక సభ ఉంటుంది. రెండు సభలున్నప్పటికీ ఏదో [more]

Update: 2019-12-02 18:29 GMT

ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో చట్టసభలు ఉంటాయి. కొన్ని దేశాల్లో రెండు సభలు ఉంటాయి. మరికొన్ని దేశాల్లో ఒకే ఒక సభ ఉంటుంది. రెండు సభలున్నప్పటికీ ఏదో ఒక సభకే ప్రాధాన్యం ఉంటుంది. రెండో సభకు పరిమిత ప్రాధాన్యం ఉంటుంది. భారత్ లోనూ రెండు చట్ట సభలున్నాయి. కేంద్రంలో లోక్ సభ, రాజ్యసభ ఉన్నాయి. రాష్ట్రాల్లో శాసనసభ, శాసనమండళ్లు ఉంటాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ శాసనమండలులు లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, యూపీ, జమ్ముకాశ్మీర్ లలోనే మండలిలు ఉన్నాయి. గతంలో కొన్ని రాష్ట్రాలు శాసనమండలిని రద్దు చేశాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు వాటి పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రంలో లోక్ సభ, రాజ్యసభ రాష్ట్రాల్లో శాసనసభ, శాసనమండలి ఉంటాయి. శాసనసభ లోక్ సభను పోలి ఉంటుంది. అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ సభలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జవాబుదారీగా ఉంటాయి. శాసనమండలిని పోలి రాజ్యసభ ఉంటుంది. ఇది శాశ్వత సభ. రద్దయ్యే ప్రసక్తి ఉండదు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడోవంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకుంటారు.

ఇద్దరూ తెలుగువారే….

రాజ్యసభను పెద్దలసభ అని, రాష్ట్రాల మండలిని ఎగువ సభ అని వ్యవహరిస్తారు. ఈ అత్యున్నత సభ గత నెల 18వ తేదీన 250వ సమావేశం నిర్వహించుకుని చరిత్ర సృష్టించింది. 1952 మే 13న ఈ సభ కొలువు దీరింది. 67 ఏళ్ల చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు పెద్దల సభ వేదికగా నిలిచింది. ప్రస్తుత సభ ఛైర్మన్ గా తెలుగువాడైన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉండటం తెలుగువారికి గర్వకారణం. దాదాపు రెండు దశాబ్దాలపాటు వెంకయ్యనాయుడు ఈసభలో సభ్యుడిగా ఉన్నారు. సభ తొలి ఛైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా తెలుగువారు కావడం గర్వించదగిన విషయం. రాధాకృష్ణన్ తిరుత్తరిణి సమీపంలోని నాగిరెడ్డి పల్లెలో జన్మించారు. పూర్వం ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో ఉండేది. 1953లో రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ఈ ప్రాంతం తమిళనాడు పరిధిలోకి వెళ్లింది. దీంతో రాధాకృష్ణన్ ను అటు తమిళులు, ఇటు తెలుగువారు తమ వాడిగా చెప్పుకుంటారు. రాధాకృష్ణన్ కొంతకాలం ప్రస్తుతం ఏపీలోని తిరుపతిలో కొంతకాలం చదువుకున్నారు. హోదా రీత్యా ఉప రాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. అందువల్ల రాజ్యసభ నిర్వహణ బాధ్యత ఆయనదే. ఆయనకు సహాయపడేందుకు డిప్యూటీ ఛైర్మన్ ఉంటారు. ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ బీహార్ కు చెందిన వారు. ఆయన జేడీయూ నాయకుడు. తొలి ఛైర్మన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952 – 62), డాక్టర్ హమీద్ అన్సారీ (2007-2017) మాత్రమే రెండు దఫాలు రాజ్యసభ ఛైర్మన్ గా పనిచేశారు.

రాష్ట్రాలకు ఇంతమంది…..

బీహార్ కు చెందిన మహేంద్ర ప్రసాద్ (జేడీయూ) అత్యధికంగా ఏడోసారి రాజ్యసభలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజ్యసభలో రెండో సీనియర్ సభ్యుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన రాజ్యసభకు ఆరోసారి ఎన్నికయ్యారు. 1991లో పీవీ మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన అప్పట్లో అసోం నుంచి ఎగువ సభకు ఎన్నికయ్యారు. ఇటీవల రాజ్యసభ నుంచి పెద్దల సభలోకి ప్రవేశించారు. డాక్టర్ నజ్మా హెప్తుల్లా రాజ్యసభకు ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఆమె రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా కాంగ్రెస్ హయాంలో పనిచేశారు. తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా ఉన్నారు. రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 250. వీరిలో 12 మంది నామినేటెడ్ సభ్యులు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని కేంద్రం ఎంపిక చేస్తుంది. ఈకోటాలో గతంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ఎంపికయ్యారు. రాజ్యసభను రాష్ట్రాల మండలిగా రాజ్యాంగం పేర్కొంది. అందువల్ల ఆయా రాష్ట్రాల నుంచి వారిని ఎన్నుకుంటారు. ప్రతి రాష్ట్రానికి నిర్దిష్ట సంఖ్యలో రాజ్యసభ స్థానాలు ఉంటాయి. ఉమ్మడి ఏపీకి మొత్తం 18 స్థానాలు ఉండేవి. విభజన అనంతరం ఏపీకి 11, తెలంగాణకు ఏడు స్థానాలను కేటాయించారు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు. దేశంలో యూపీకి అత్యధికంగా 31 రాజ్యసభ స్థానాలున్నాయి.

బిల్లు ఆమోదం పొందకపోయినా…..

లోక్ సభ, రాజ్యసభ సమానస్ధాయి గలవని రాజ్యాంగం చెబుతున్నప్పటికీ ఆచరణలో లోక్ సభదే పైచేయి. రాజ్యసభ ప్రాధాన్యం ద్వితీయ స్థానానికే పరిమితం. ఇతర బిల్లులు ఏ సభలోనైనా ముందుగా ప్రవేశపెట్టవచ్చు. కానీ ద్రవ్యబిల్లును మాత్రమే ముందుగా లోక్ సభలోనే ప్రవేశపెట్టాలి. అదే విధంగా లోక్ సభలో మెజారిటీ లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది. అదే రాజ్యసభలో మెజారిటీ లేనంత మాత్రాన ప్రభుత్వం పడిపోదు. ఇతర పార్టీల మద్దతు ద్వారా బిల్లులను ఆమోదించుకోగలదు. లోక్ సభ ఆమోదించిన బిల్లులను రాజ్యసభ ఆమోదించాలని నిబంధన లేదు. లోక్ సభ ఆమోదించిన బిల్లులను రాజ్యసభ తిరస్కరిస్తే ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఉంది. ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి బిల్లులను ఆమోదించుకునే వెసులుబాటు ఉంది. లోక్ సభలో సభ్యుల సంఖ్య 540 పైచిలుకే. అదే రాజ్యసభలో 250 మాత్రమే. అంటే మొత్తం 790 అవుతుంది. ఓటింగ్ జరిగినప్పుడు సగం మంది ఓటేస్తే సరిపోతుంది. సహజంగా ప్రభుత్వ మాటే నెగ్గుతుంది. ఇప్పటి వరకూ అయిదుసార్లు సంయుక్త సమావేశాలు జరిగాయి. స్థూలంగా చూస్తే లోక్ సభ తర్వాత స్థానమే రాజ్యసభది. అంత మాత్రాన దాని ప్రాధాన్యాన్ని కాదనలేం. తగ్గించి చూడలేం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ రాజ్యసభ కాల పరీక్షలో నిలిచి తన సత్తా చాటుకుంటూనే ఉంది. ముందుకుసాగుతూనే ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News