కేజ్రీకి చిక్కులు తెచ్చిపెట్టేందుకేనా?

విపక్ష పాలిత రాష్రాలను ఇరుకున పెట్టడం, చికాకులు కల్పించడం కేంద్రంలోని అధికార పార్టీలకు కొత్తేమీ కాదు. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ నుంచి నేటి ప్రధాని నరేంద్ర [more]

Update: 2021-08-11 16:30 GMT

విపక్ష పాలిత రాష్రాలను ఇరుకున పెట్టడం, చికాకులు కల్పించడం కేంద్రంలోని అధికార పార్టీలకు కొత్తేమీ కాదు. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకూ అందరూ అనుసరిస్తున్న అనుచిత విధానమే ఇది. అయితే అప్పటికీ ఇప్పటికీ తీవ్రతలోనే తేడా ఉంది తప్ప నాయకుల వైఖరిలో మార్పు లేదన్నది చేదు నిజం. అధికార పార్టీకి నమ్మినబంట్లుగా ఉన్న వారిని విపక్ష పాలిత రాష్టాలకు గవర్నర్లుగా పంపడం, నిధులు, ప్రాజెక్టుల మంజూరులో వివక్ష వంటి కేంద్ర ప్రభుత్వ చర్యలు తెలిసినవే. తాజాగా దేశ రాజధాని నగరమైన ఢిల్లీ పోలీసు కమిషనరుగా రాకేశ్ ఆస్థానా ను నియమించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొత్త వివాదానికి తెరలేపింది.

న్యాయస్థానాన్ని ఆశ్రయించి….

ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కారును లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ద్వారా చెడుగుడు ఆడుకుంటున్న కేంద్రంలోని మోదీ సర్కారు ఇప్పుడు ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్థానా ద్వారా పట్టు పెంచుకోవాలని చూస్తోంది. దీన్ని ఆప్ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపింది. మున్ముందు ఈ వివాదం ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి. మరోపక్క రాకేశ్ ఆస్థానా నియామకాన్ని సవాల్ చేస్తూ మనోహర్ లాల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.

గుజరాత్ కు చెందిన…

ఢిల్లీ పోలీసు కమిషనరుగా రాకేశ్ ఆస్థానాను నియమిస్తూ జులై 27న కంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆయన వెనువెంటనే అంటే జులై 28నే బాధ్యతలు చేపట్టారు. గుజరాత్ కేడర్ కు చెందిన రాకేశ్ ఆస్థానా జులై 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఆయన పదవీకాలాన్ని ఏడాదిపాటు పెంచింది. పదవీ విరమణకు ముందు మూడురోజుల క్రితమే రాకేశ్ ఆస్థానా నియామ కంపై ప్రకటన వెలువడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2018 జులైలో ప్రకాశ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఈ నియామకం ఉందని ఆప్ పార్టీ చెబుతోంది. కనీసం ఆరు నెలల పదవీ కాలం ఉన్న వారినే కీలక పోస్టుల్లో నియామకాలకు పరిశీలించాలని అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈఏడాది మే నెలలో సీబీఐ డైరెక్టర్ పదవికి రాకేశ్ ఆస్థానా పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), లోక్ సభలో విపక్షనేతతో కూడిన కమిటీ సీబీఐ డెరెక్టర్ ను ఎంపిక చేస్తుంది.

ఆరు నెలల కంటే..?

రాకేశ్ ఆస్థానాకు పదవీ కాలం ఆరు నెలల కంటే తక్కువ ఉన్నందున, 2018 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆయన పేరును పరిశీలించలేమని అప్పట్లో సీజేఐ స్పష్టం చేశారు. దీంతో రాకేశ్ ఆస్థానా అవకాశం కోల్పోయారు. ఇప్పడు ఈ విషయాన్నే ఆప్ వర్గాలు బలంగా ఎత్తి చూపుతున్నాయి. కేంద్రం తన నిర్ణయం మార్చుకోవాలంటూ ఈ మేరకు ఢిల్లీ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించి పంపింది. సహజంగానే విపక్షమైన బారతీయ జనతా పార్టీ ఈ తీర్మానాన్నితిరస్కరించింది. దేశ రాజధానికి సంబంధించిన వ్యవహారాల్లో కేంద్రానికి విశేష అధికారాలు ఉంటాయని, అందులో భాగంగానే రాకేశ్ ఆస్థానా నియామకం చేసిందని, ఇందులో రాజకీయాలకు తావులేదని ఢిల్లీ భాజపా ఎమ్మెల్యే రాంవీర్ సింగ్ వాదిస్తున్నారు.

మోదీకి నమ్మిన బంటుగా…..

మోదీ హయాంలో గుజరాత్ లో వివిధ హోదాల్లో పనిచేసిన రాకేశ్ ఆస్థానాకు ఆయనకు నమ్మినబంటుగా పేరుంది. ముఖ్యంగా గోద్రా అల్లర్లు తదితర కేసుల్లో మోదీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. 1984 బ్యాచ్ కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి 2018లో సీబీఐ ప్రత్యేక డైరెక్టరుగా అప్పటి సీబీఐ డైరెక్టరు అలోక్ వర్మతో వివాదానికి దిగారు. 2016లో వడోదరలో రాకేశ్ ఆస్థానా కుమార్తె వివాహానికి హాజరైన అతిధులకు ఖరీదైన హటళ్లలో బస సమకూర్చారన్న ఆరోపణలువచ్చాయి. రాకేశ్ ఆస్థానా గతంలో బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) డైరెక్టర్ జనరల్ తదితర కీలక పదవులను నిర్వహించారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News