ఎర్రన్న కు అసలైన వారసుడు..నిరూపించాడుగా

దివంగత ఎర్రన్నాయుడు మంచి వాగ్దాటి ఉన్న నేత. ఎపుడు ఎలా మాట్లాడాలో తెలిసిన నాయకుడు. ఆయన మృదు స్వభావి. ఎపుడూ మాట తూలడం ఆయన హిస్టరీలో లేదు. [more]

Update: 2020-06-30 00:30 GMT

దివంగత ఎర్రన్నాయుడు మంచి వాగ్దాటి ఉన్న నేత. ఎపుడు ఎలా మాట్లాడాలో తెలిసిన నాయకుడు. ఆయన మృదు స్వభావి. ఎపుడూ మాట తూలడం ఆయన హిస్టరీలో లేదు. ఆవేశకావేశాలకు ఆయన వద్ద తావు లేదు. ఇక సబ్జెక్ట్ మీద పట్టు ఎర్రన్న సొంతం. ఈ లక్షణాలు అన్నీ ఇపుడు ఆయన కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడుకి వచ్చాయని అంటున్నారు. ఎర్రన్న తమ్ముడిగా అచ్చెన్నాయుడు పాతికేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా కూడా దుడుకుతనంతో వ్యవహరిస్తూ అన్న వైఖరికి భిన్నంగానే ఉన్నారని పేరు తెచ్చుకున్నారు. అచ్చెన్న విజయాలు కూడా ఎర్రన్నను చూసేనని చెబుతారు. ఇదిలా ఉండగా ఈ ఎస్ ఐ స్కాం లో అరెస్ట్ అయి ఏసీబీ కస్టడీలో ఉన్న అచ్చెన్న ఇపుడు మరో మచ్చను తగిలించుకున్నారు. ఈ స్కాం లో ఆయన పాత్ర ఎంత అన్నది పక్కన పెడితే కింజరాపు కుటుంబానికి ఇది అప్రదిష్టగానే చూస్తున్నారు.

సంసద్ రత్నగా….

ఇక తమ్ముడు తీరు ఇలా ఉంటే కొడుకు రామ్మొహననాయుడు మాత్రం సంసద్ రత్న అవార్డు ని సాధించి దేశం చేత శభాష్ అనిపించుకుంటున్నారు. సరిగ్గా అచ్చెన్న అరెస్ట్ అయి కింజరాపు ఫ్యామిలీ విషాదంలో ఉన్న వేళ రామ్మోహన్ ఇలా అవార్డుతో అయిన వారికి, నమ్ముకున్న ఊరికీ కళాకాంతులు తెచ్చిపెట్టారని అంటున్నారు. కేవలం 32 ఏళ్ల వయసు. పార్లమెంట్ సభ్యునిగా ఆరేళ్ల అనుభవంతో రామ్మోహన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డ్ సాధించారంటే ముందు ముందు మరిన్ని విజయాలు కూడా ఆయన దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తండ్రి ఎర్రన్న మాదిరిలాగానే చెరగని చిరునవ్వుతో పాటు సబ్జెక్ట్ మీద పట్టు సాధించడం రామ్మోహన్ నాయుడి కి ఉన్న మేలి లక్షణాలు అంటున్నారు.

వివాద రహితంగా ….

మరో వైపు చూసుకుంటే తన ప్రజలు, తన పార్టీ కార్యకర్తలు తన పనేంటో చూసుకునే రామ్మోహన్నాయుడు వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. మహా మహా మంత్రుల వారసులు అంతా ఫెయిల్ అయిన చోట తండ్రి లేకుండానే రామ్మోహన్ ఇంతటి పేరు తెచ్చుకుని రాజకీయంగా రాణించడం గొప్ప విషయం అంటున్నారు. అలాగే తెలుగుదేశంలో మిగిలిన తమ్ముళ్ళ మాదిరిగా ఊరికే వైసీపీ మీద విమర్శలు చేయడం, మీడియాకు ఎక్కి ఫోజులు కొట్టడం రామ్మోహన్నాయుడు కి ఇష్టం ఉండవని అంటారు. ఇక ఆయన ఉంటే పార్లమెంట్ లేకపోతే తన సొంత లోక్ సభ ప్రాంతంలోనే ఉంటారని చెబుతారు. ఇక ఆయన పార్లమెంట్ కి వెళ్ళేటపుడు తన నియోజకవర్గంలోని ప్రతీ సమస్యను రికార్డు చేసుకుని మరీ ప్రస్తావిస్తారు, వాటిని పరిష్కారం కనుగొంటారు. ఇలా చేయబట్టే ఆయనకు సంసద్ అవార్డ్ వరించింది అంటున్నారు.

అసలైన వారసుడుగా….

ఎర్రన్నాయుడు నాలుగు సార్లు మొత్తం పదమూడేళ్ళ పాటు లోక్ సభలో ఉన్నారు. ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, కేంద్ర మంత్రిగా కూడా ఉంటూ వచ్చారు. అనేక స్టాండింగ్ కమిటీలకు చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన వారసుడిగా రామ్మోహన్నాయుడు సైతం పార్లమెంట్ లో తన సత్తా చాటుతున్నారు. పార్టీలకు అతీతంగా కూడా మన్ననలు అందుకుంటున్నారు. మొత్తం మీద ఎర్రన్నాయుడు అసలైన రాజకీయ వారసుడు ఎవరు అంటే కుమారుడేనని చెప్పాలి అంటున్నారు. రాబోయే రోజులు కూడా ఈ యువ ఎంపీవేనని విశ్లేషిస్తున్నారు. సంసద్ రత్న అవార్డుతో మళ్ళీ కింజరాపు కుటుంబానికి పార్టీలో పెద్ద పదవులు ఇవ్వాలన్న ఆలోచనకు కూడా అధినేత చంద్రబాబు వచ్చేలా చేశారని అంటున్నారు.

Tags:    

Similar News