అప్పటి నుంచే ఆయనకు చిర్రెత్తుకొచ్చి?

టీడీపీకి ద‌క్కిన ముగ్గురు ఎంపీల్లో యువ నాయ‌కుడిగా, చురుగ్గా వ్యవ‌హ‌రించే నేత‌గా పేరు తెచ్చుకున్నారు శ్రీకాకుళం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా రెండోసారి కూడా విజ‌యం సాధించిన [more]

Update: 2020-04-02 06:30 GMT

టీడీపీకి ద‌క్కిన ముగ్గురు ఎంపీల్లో యువ నాయ‌కుడిగా, చురుగ్గా వ్యవ‌హ‌రించే నేత‌గా పేరు తెచ్చుకున్నారు శ్రీకాకుళం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా రెండోసారి కూడా విజ‌యం సాధించిన కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు. 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఆయ‌న శ్రీకాకుళం ప్రజ‌ల నుంచి ఆశీర్వాదం పొందారు. ఎర్రన్నాయుడు వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి ప్రవేశించి త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్యల‌నే కాకుండా రాష్ట్రంలోని స‌మ‌స్యల‌ను కూడా పార్లమెంటు వేదిక‌గా వినిపించి ప‌రిష్కరించుకోవ‌డంలో రామ్మోహ‌న్ గుర్తింపు తెచ్చుకున్నారు.

బాబు ప్రయారిటీ ఇచ్చినా….

బ‌ల‌మైన వాగ్దాటి ఉండ‌డంతో రామ్మోహ‌న్ నాయుడికి తిరుగులేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగానే యువ‌త‌లో ఆయ‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. టీడీపీలోనూ పార్టీ అధినేత చంద్రబాబు ద‌గ్గర మంచి మార్కులే సంపాయించుకున్నారు. ప్రత్యేక హోదా విష‌యంలో పార్లమెంటులో హిందీలో మాట్లాడి మంచి గ‌ళం వినిపించి శ‌భాష్ అనిపించుకున్నారు. అదే సమ‌యంలో టీడీపీ అధికారం కోల్పోయిన త‌ర్వాత వైసీపీ ప్రభుత్వంపై చేప‌ట్టిన అనేక నిర‌స‌న‌ల్లోనూ పాల్గొని గ‌ళం వినిపించారు. అయితే, కొన్నాళ్లుగా మాత్రం ఈ యువ ఎంపీ మౌనం పాటిస్తున్నారు.

మూడు రాజధానుల ప్రకటన తర్వాతే?

ఇటు పార్టీలోను, అటు పార్లమెంటులోనూ కూడా మౌనంగా ఉంటున్నారు త‌ప్ప ఎక్కడా త‌న‌దైన దూకుడు ప్రద‌ర్శించ‌లేక పోతున్నారు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ఇలా జ‌రుగుతోంది? అనే ప్రశ్నలు వ‌స్తున్నాయి. దీనికి ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం మూడు రాజ‌ధానుల నిర్ణయం ప్రక‌టించింది. ఈ విష‌యంపై మూడు నెల‌లుగా రాష్ట్రంలో తీవ్ర పోరు సాగుతోంది. మూడు రాజ‌ధానుల‌కు తాను వ్యతిరేక‌మ‌ని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రక‌టించారు. అయితే, వైసీపీ మాత్రం విశాఖ‌ను రాజ‌ధానిగా ప్రక‌టించాల‌ని నిర్ణయించింది. అంతేకాదు, విశాఖ‌ను రాజ‌ధాని చేస్తే.. వెనుక‌బ‌డిన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ప్రభుత్వంవెల్లడించింది. ఇదే జిల్లాకు చెందిన ఎంపీగా రామ్మోహ‌న్ విశాఖ రాజ‌ధానిని స‌మ‌ర్ధించాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది.

నలిగిపోతూ….

అయితే, పార్టీ ప‌రంగా తీసుకుంటే.. మూడు రాజ‌ధానుల నిర్ణయాన్ని చంద్రబాబు ఆదేశాల మేర‌కు వ్యతిరే కించాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. ఈ రెండు విష‌యాల్లోనూ కూడా రామ్మోహ‌న్ న‌లిగిపోయార‌నేది వాస్తవం. ఇటు రాజ‌ధానిగా విశాఖ‌ను వ‌ద్దంటే.. శ్రీకాకుళం వాసుల‌కు కోపం.. అలాగ‌ని రాజ‌ధానిని స్వాగ‌తిస్తే.. పార్టీ అధినేత చంద్రబాబుకు దూరం. అందుకే ఆయ‌న అప్పటి నుంచి మౌనం పాటిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, ఇటీవ‌ల త‌న బాబాయి, మాజీ మంత్రి టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నపై వ‌చ్చిన ఈఎస్ ఐ కుంభ‌కోణం వార్తల విష‌యంలో మాత్రం రామ్మోహ‌న్ సూటిగా స్పందించారు. ఈ విష‌యంలో ఎంత దూర‌మైనా వెళ్తామ‌న‌డం గ‌మ‌నార్హం. ఇక స్థానిక రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలోనూ ఆయ‌న ఒంట‌రి పోరాటం చేయాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో రామ్మోహ‌న్ నాయుడులో గ‌తంలో ఉన్నంత దూకుడు క‌నిపించ‌డం లేదంటున్నారు.

Tags:    

Similar News