రాపాకను వెలివేసినట్లేనా?

ఆయన పేరుకే జనసేన ఎమ్మెల్యే. కానీ పార్టీ మాత్రం అనధికారికంగా వైసీపీనే. కానీ జనసేన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒక్కగానొక్క జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆడింది [more]

Update: 2020-10-23 06:30 GMT

ఆయన పేరుకే జనసేన ఎమ్మెల్యే. కానీ పార్టీ మాత్రం అనధికారికంగా వైసీపీనే. కానీ జనసేన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒక్కగానొక్క జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆడింది ఆట.. పాడిండి పాటగా మారింది. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరుపున పోటీచేసి గెలుపొందని ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తొలి నుంచి ఆ పార్టీ పట్ల విధేయతగా ఉండటం లేదు. ఒకే ఒక్క సీటు గెలవడం, పవన్ కల్యాణ్ సయితం ఓటమి పాలు కావడంతో ఆయన మానసికంగా ఎప్పుడో అధికార వైసీపీకి దగ్గరయ్యారు.

వైసీపీకి ఏ అవసరమొచ్చినా….

ఇక అధికార పార్టీకి ఏ అవసరమొచ్చినా ఆయన జనసేన తరుపున తన మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇది జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలకు, రాపాక వరప్రసాద్ చేస్తున్న ప్రకటనలకు పొంతన లేకపోతుండటంతో ప్రజల్లో కూడా అయోమయం నెలకొంది. ఈ సందిగ్దతను తొలగించాలంటే రాపాక వరప్రసాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయనపై అనర్హత వేటు వేయాలని జనసేన పార్టీ కోరాలి.

చర్యలు తీసుకోలేక…..

కానీ ఆ రెండు పనులు చేయలేదు. ఎందుకంటే అనర్హత పిటీషన్ వేసినా దానిపై చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినా రాపాక వరప్రసాద్ కు ప్రయోజనమే తప్ప మరేదీ లేదని పవన్ కల్యాణ్ భావించారు. శాసనసభలో పార్టీ ప్రాతినిధ్యం కూడా పోతుందని పవన్ కల్యాణ్ వెనకడుగు వేస్తున్నారు. దీనిని రాపాక వరప్రసాద్ అడ్వాంటేజీగా తీసుకున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. రాజోలు నియోజకవర్గంలోనూ వైసీపీ క్యాడర్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు.

అనధికారికంగా……

దీంతో రాపాక వరప్రసాద్ పై అధికారికంగా చర్యలు తీసుకోకపోయినా ఆయనను సోషల్ మీడియాలో పార్టీకి పూర్తిగా దూరంగా ఉంచుతున్నారు. జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో రాపాక వరప్రసాద్ పై విరుచుకుపడుతున్నారు. రాపాక వరప్రసాద్ కు జనసేనతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆయన అధికారికంగా మాత్రమే ఎమ్మెల్యేనని ఇటీవల రాపాకపై ఎక్కువగా పోస్టింగ్ లు కనపడుతున్నాయి. మూడు రాజధానుల అంశంలో ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడినందుకే రాపాక వరప్రసాద్ ను పార్టీ నుంచి అనధికారికంగా దూరం చేయాలని, ప్రజలు కూడా ఆయన చేసే వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని తెలియాలనే జనసేన సోషల్ మీడియాను వినియోగించుకుంటోంది.

Tags:    

Similar News