పవన్ పరువు కాపాడిన రాపాక కరివేపాకా ?

పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి నటుడు, పవర్ స్టార్. ఆయన సినిమాలకు ఈలలు వేసే జనం ఉన్నారు. గోల పెట్టే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ రాజకీయ [more]

Update: 2021-04-04 12:30 GMT

పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి నటుడు, పవర్ స్టార్. ఆయన సినిమాలకు ఈలలు వేసే జనం ఉన్నారు. గోల పెట్టే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ రాజకీయ తెర మీద మాత్రం ఆయన ఇంకా వర్ధమాన నాయకుడే. అయితే పవన్ చరిష్మాతో పాటు సిద్ధాంత బలం కూడా సమకూరితే జనసేన రాజకీయ రూపం బాగుంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి జనసేన నేల విడిచి సాము చేస్తోంది. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో రెండు చోట్లా పవన్ ఘోరమైన ఓటమి.

ఒకే ఒక్కడుగా ….?

జనసేన అధినేత సైతం ఓడినా కూడా ఆయన పరువు, పార్టీ బరువు మోసింది రాపాక వరప్రసాదరావు. రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ రికార్డుల్లోకి జనసేనను ఎక్కించిన ఘనత మాత్రం రాపాక వరప్రసాదరావుదే. ఆయన గొంతు కూడా మొదట్లో పవన్ పార్టీకి అనుకూలంగా ఉండేది. ఆయన అసెంబ్లీ వేదికగా కూడా గతంలో చాలా అంశాలను ప్రస్థావించి పార్టీ ఉనికిని చాటారు. అయితే ఆయనకూ పార్టీకి మధ్య రాను రానూ అంతరం పెరిగింది.

తప్పు అటూ ఇటూ…..

ఇక జనసేన నుంచి రాపాక వరప్రసాదరావు దూరం కావడం వెనక తప్పు ఎవరిది అంటే ఇద్దరిదీ అన్న జవాబు వస్తుంది. రాపాక వరప్రసాదరావుకు పార్టీలో కనీసం విలువ ఇవ్వలేదని, పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని ఏ ఉన్నత కమిటీల్లో నియమించలేని ఆయన అనుచరులు అంటారు. అదే విధంగా ఆయన్ని తక్కువ చేసి చూశారని కూడా వాపోతారు. పవన్ పక్కన ఉన్న నాదెండ్ల మనోహర్ లాంటి వారు అవమానించారని కూడా చెబుతారు. వీటిని తట్టుకోలేకే ఆయన పక్కకు తొలగారు అంటారు. అయితే అదే సమయంలో రాపాక సైలెంట్ గా ఉన్నా బాగుండేది, క్యాడర్ లో సానుభూతి వచ్చేదని, కానీ ఆయన జగన్ ని పొగడడంతోనే తన వైపు నుంచి కూడా తప్పు చేశారు అనిపించుకున్నారు అంటున్నారు.

రేవడిగానే….?

ఇక రాపాక వరప్రసాదరావు పరిస్థితి ఎలా ఉంది అంటే అటు జనసేనకు పూర్తిగా చెడ్డారు, ఇటు వైసీపీకి కూడా కాకుండా పోతున్నారు. ఆయన గెలిచింది కూడా పెద్ద మెజారిటీతో కాదు, దాంతో రాజోలు పార్టీలో ఉన్న అసలైన వైసీపీ నాయకులు ఆయన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇక పవన్ కంటే కూడా జనసైనికులు రాజోలు లో రాపాక మీద గుర్రుమంటున్నారు. వారు ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు జనసేనకు తెచ్చి రాపాక వరప్రసాదరావు మీద అలా రివేంజ్ తీర్చుకున్నారు. ఇపుడు చూస్తే రాపాకను జనసేన సమావేశాలకు అసలు రావద్దు అనేస్తున్నారు. ఈ మేరకు ఫ్లెక్సీలు కట్టి మరీ ఆయన పరువు తీస్తున్నారు. ఒక విధంగా రాపాక వరప్రసాదరావు విషయంలో పవన్ నోరు మెదపకుండా ఉన్నా కూడా పార్టీ పెద్దలు, కార్యకర్తలే ఆయన్ని దూరం పెట్టారని అంటున్నారు. మొత్తానికి రాపాకను కరివేపాకు చేసారని అనుచరులు మధన పడుతున్నారు.

Tags:    

Similar News