మెరుగైన సమాజానికి ఏమైంది ..?

మెరుగైన సమాజం కోసం అన్న ట్యాగ్ లైన్ తో 2003 లో దూసుకొచ్చింది టివి 9 ఛానెల్. తెలుగు జర్నలిజం లో దృశ్య మాధ్యమంలో సరికొత్త సంచలనానికి [more]

Update: 2019-05-10 05:00 GMT

మెరుగైన సమాజం కోసం అన్న ట్యాగ్ లైన్ తో 2003 లో దూసుకొచ్చింది టివి 9 ఛానెల్. తెలుగు జర్నలిజం లో దృశ్య మాధ్యమంలో సరికొత్త సంచలనానికి టివి 9 నాంది పలికింది. చూస్తూనే వుండండి అంటూ ఆ ఛానెల్ చేసిన ప్రయోగం ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు కన్నడ, మరాఠి, హిందీ తో పాటు అనేక భాషల్లో విజయవంతం అయ్యింది. ఈ సక్సెస్ వెనుక సంస్థ ఛైర్మెన్ శీనిరాజు పెట్టుబడి ఒక ఎత్తయితే సీఈఓ రవిప్రకాష్ సరికొత్త ఆలోచనలు టివి 9 ను నెంబర్ వన్ గా నిలబెట్టడంలో దాగి ఉన్నాయన్నది ఎక్కువ మందికి తెలిసిన విషయమే. అయితే ఈ విజయంలో రవిప్రకాష్ టీం అంకితభావం కూడా మరో వైపు ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు టివి 9 విజయవంతమైన ప్రస్థానంలో ఎన్నో కీలక అంశాలు దాగి వున్నాయి.

కార్పొరేట్ శక్తులతో ఢీ … తరువాత రాజీ …

తొలి రోజుల్లో నారాయణ, చైతన్య వంటి విద్యా సంస్థలు సాగిస్తున్న అరాచకాలపై వార్తలు మలిచింది టివి 9. అందులో సెలవులు ఎందుకు ఇవ్వరంటూ రుబ్బురోలు చదువులపై యుద్ధం చేసింది. కట్ చేస్తే ఏమైందో చైతన్య టివి 9 టాలెంట్ టెస్ట్ అని ప్రకటించింది. అలాగే టి.సుబ్బరామిరెడ్డి వంటి సెలబ్రిటీ తో వివాదం వరుస కథనాలు కట్ చేస్తే టివి 9 సుబ్బిరామి రెడ్డి అవార్డు లు ఇలా ఒకటేమి చాలానే ఆ ఛానెల్ ప్రస్థానం లో ప్రేక్షకుల ప్రశ్నలకు జవాబు దొరకని అంశాలు.

అది ఇజ్రాయిల్ గొప్పతనం ….

మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకసారి ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో పాలస్తీనా తో తీవ్ర యుద్ధం నడుస్తున్న రోజులు. రాత్రంతా బాంబుల మోత. ఉదయం పత్రికలు టీవిలనిండా శవాలు, హింసాత్మక సంఘటనలే వుంటాయని కలాం భావించారు. చిత్రంగా తరువాతి రోజు ఉదయం పేపర్లు చూసిన ఆయన షాక్ అయ్యారు. టివి ఛానెల్స్ పెట్టి మరింత షాక్ అయ్యారు. ఎందుకంటే రాత్రి జరిగిన సంఘటనలు ఏవి హెడ్ లైన్స్ గా బ్రేకింగ్ న్యూస్ లుగా మీడియా లో లేవు. ఆ దేశంలో అత్యధిక సాగు చేసిన రైతు కథనం, హెడ్ లైన్స్ గా పెట్టారు. ఒక శాస్త్రవేత్త పరిశోధన బ్రేకింగ్ గా చూశారు. అతి చిన్న దేశమైన ఇజ్రాయిల్ అత్యంత వేగవంతంగా ఎలా అభివృద్హి చెందింది ప్రజలను చైతన్య పరచడానికి మీడియా నిర్వహించే పాత్రను ప్రశంసించలేకుండా ఉండలేక పోయారు. ఇదే అంశాన్ని కలాం తరువాత పలు వేదికలపై భారత్ లో పంచుకున్నా మన జర్నలిజం మాత్రం నెగిటివ్ వార్తలకు ఇచ్చే ప్రాధాన్యం పాజిటివ్ కవరేజ్ లో కానీ, డెవలె ప్ మెంట్ వైపు కన్నెత్తి చూడటం లేదు పన్నెత్తి రాయడం లేదు, మాట్లాడటం లేదు. ఇక టివి 9 రాకముందు. వచ్చాక అనే రీతిలో దృశ్య మాధ్యమం లో దిగజారుడుకు నిర్వచనాలు ఇప్పుడు నెట్టింట అల్లరి చేస్తున్నాయి అంటే ఆ ఛానెల్ ను మార్గదర్శకంగా ఎంచుకుని పలు ఛానెల్స్ చేస్తున్న నిర్వాకం కానీ పార్టీ ఛానెల్స్ గా ఊదుతున్న బాకాలు తెలుగు వారి చెవుల్లో తుప్పు వదిలేలా చేస్తున్నాయి. చివరికి సోషల్ మీడియా వచ్చినా టివి 9 తరహానే అనుసరించి సంచలనం కోసం నెటిజెన్స్ సైతం విలువల వలువలు వలిచేస్తున్నారు.

మానవ బలహీనతలే పెట్టుబడిగా ….

ప్రజలలో విశ్వసనీయత కోసం తొలినాళ్లలో అందరి కోసం మేమున్నాం అనేభావన పాదుకొల్పినా. డబ్బు, వ్యక్తిగత జీవితాలు, హింస, సెక్స్ ఇలా అనేక అంశాలే మానవ బలహీనతలనే వార్తంశాలుగా ప్రధానంగా వండి వార్చింది టివి 9. మెరుగైన సమాజం కోసం ఇలా చేయకండి, ఇవి చూడకండి అంటూ రోజుల తరబడి చూడకూడనివి, చేయకండి అంటూ చేయకూడనివి చూపించడమే ఛానెల్ సక్సెస్ కి మంత్రంగా మారింది. ఇంకేముంది రేటింగ్ వేట లో తనదైన శైలిలో దూసుకుపోయింది టివి 9. ఎప్పుడైతే టివి 9 సక్సెస్ బాటలో దూసుకువెళుతుందో అదే బాటలో ఒక్కటొక్కటిగా ఛానెల్స్ పుట్టుకొచ్చాయి. ఎంటర్ టైన్మెంట్ ఛానెల్స్ లాభాల బాటలో వెళ్లడం చుసిన వారంతా 24 గంటల న్యూస్ ఛానెల్స్ పెడితే పేరుకు పేరు డబ్బుకు డబ్బు దక్కుతుందని దూసుకొచ్చారు. అప్పటివరకు ఈటివి ని మాత్రమే న్యూస్ ఛానెల్ గా చూసిన ప్రేక్షకులకు కొత్త న్యూస్ ఛానెల్స్ కొత్త రుచులు చూపించాయి. దాంతో తెలుగు ఛానెల్స్ లో పోటీ ప్రపంచం మొదలైపోయింది. టిఆర్పీ రేటింగ్స్ ను కొనుగోలు చేయడం మొదలు ఎంఎస్ఓ లకు ఛానెల్స్ కు ప్లేస్ మెంట్ కోసం డబ్బులు ఇచ్చే వరకు వ్యవహారం నడిచింది. విచ్చలవిడిగా కొత్త న్యూస్ ఛానెల్స్ నుంచి వచ్చే పోటీ ని తట్టుకునేందుకు అప్పటి హత్ వే ఛానెల్ అధినేత తో టివి 9 రవి ప్రకాష్ చేతులు కలిపారు. కొత్తగా వచ్చే వారి నుంచి భారీ సుంకం ముక్కుపిండి వసూలు ఎలా చేయాలో చెప్పి మరిన్ని ఛానెల్స్ మార్కెట్ ను షేర్ చేసుకోకుండా లాభాల బాట పట్టకుండా మూత పడే వ్యాపార సూత్రాలను మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్ ల ద్వారా విజయవంతంగా అమలు చేయడంలో రవి ప్రకాష్ డైరెక్షన్ వుందంటాయి కొన్ని ఛానెల్స్ .తన గుత్తాధిపత్యానికి గండి పడకుండా ఇలా ఎప్పటికప్పుడు ఇంటా బయట కొత్త ఎత్తుగడలతో దూసుకుపోయింది టివి 9.

కొంప ముంచిన ఆర్ధిక వ్యవహారాలు …?

కోట్ల రూపాయల లావాదేవీలు పడగలెత్తడంతో సహజంగానే ఛైర్మన్ శ్రీనిరాజు, రవి ప్రకాష్ నడుమ కొన్నేళ్లుగా కోల్డ్ వార్ నడుస్తున్నట్లు మీడియా వర్గాల కథనం. దాంతో 90 శాతం షేర్ లు వున్న శ్రీని రాజు టివి 9 ను అమ్మకానికి పెట్టడం కొత్త యాజమాన్యం రవి ప్రకాష్ కి కొరుకుడు పడకపోవడంతో గత ఏడాది నుంచి సంస్థలో ఆధిపత్య పోరుకు తెరలేచిందంటున్నారు. కంపెనీగా ఎబిసిఎల్ ఉన్నప్పటికీ అన్ని తానై వ్యవహరించిన రవి ప్రకాష్ తన ఉనికి ప్రశ్నార్ధకం కావడంతో సంస్థ విక్రయాన్ని లిటిగేషన్ లో పెట్టాలని వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టి అభాసుపాలు కావలిసి వచ్చింది. ఫోర్జరీ కేసుతోను సీఈవో గా ఆయన డిస్మిస్ కావడంతో ఇది ఆగుతుందా…? లేక ఇంకా ఎంత దూరం వెళుతుంది …?అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. నిజం చెప్పులు వేసుకునేలోగా ప్రపంచాన్ని అబద్ధం చుట్టి వచ్చింది. నాపై వార్తలు వేసిన వారికి ధన్యవాదాలు… ఇది రవి ప్రకాష్ తాజా ఉదంతంపై ఏమి చెప్పాలో తెలియక చేసిన ప్రకటన. ఏది నిజమో ఏది అబద్ధమో నిర్ధారించకుండా తమ ఛానెల్ గతంలో సంచలనం కోసం ప్రసారం చేసిన వార్తల బాధితుల జాబితాలోకి బహుశా ఆయన కూడా చేరతారని ఊహించి ఉండరు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News