అటూ ఇటూ రెడ్డి రెడీ… ?

ఏపీలో రాజకీయం కరెక్ట్ గానే సాగుతోందా. ఎదుటి పక్షం బలం బలగం ఎరిగి మరీ పావులు కదుపుతున్నారా అంటే అవును అనే సమాధానం వస్తోంది. రెండు జాతీయ [more]

Update: 2021-08-21 00:30 GMT

ఏపీలో రాజకీయం కరెక్ట్ గానే సాగుతోందా. ఎదుటి పక్షం బలం బలగం ఎరిగి మరీ పావులు కదుపుతున్నారా అంటే అవును అనే సమాధానం వస్తోంది. రెండు జాతీయ పార్టీలు కూడా ఈ విషయంలో ఒకే రకంగా ఆలోచించడమే ఇపుడు విశేష పరిణామం. కాంగ్రెస్ పార్టీ గురించి ముందుగా ఆలోచిస్తే ఏపీలో కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే రెడ్డికే పీసీసీ పీఠం ఇవ్వాలని గట్టిగానే ఆలోచిస్తోందిట. అందుకోసం విపరీతంగా అన్వేషించి చివరికి కరెక్ట్ మనిషినే పట్టుకుంది అంటున్నారు. ఆయనకి పగ్గాలు ఇస్తే పార్టీకి అది మేలు చేస్తుంది కానీ కీడు చేయదు అని భావిస్తున్నారు.

లాస్ట్ సీఎం తోనే…?

ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డినే ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా పంపుతారు అంటున్నారు. ఆయన మీద ఏపీ జనాలకు మంచి అభిప్రాయం ఉందని అంటున్నారు. ఆయన సమైక్యవాదిగా ముద్ర వేసుకున్నారు. లాస్ట్ బంతి అంటూ తన ప్రయత్నాలు ఏవో చివరిదాకా చేశాను అనిపించుకున్నారు. దాంతో పాటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమకు చెందిన వారు. బలమైన రెడ్డి సామాజిక వర్గం మనిషి. ఆయనకు ఏపీలోని ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలలోని నేతలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన్ని ముందు పెడితే కాంగ్రెస్ పుంజుకోవడమే కాకుండా ఘర్ కీ వాపస్ వంటి ప్రయోగాలు కూడా సక్సెస్ అవుతాయని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారుట.

బీజేపీకి ఈయన…

ఇక మరో చిత్రం ఏంటి అంటే బీజేపీ కూడా రెడ్లను నమ్ముకోవడం. అది కూడా సీమ ప్రాంతానికి పట్టం కట్టాలనుకోవడం. బీజేపీ ఈసారి గోదావరి జిల్లాల నుంచి సీమ వైపుగా తన రూటు మార్చుకుంటోందిట. సీమ ప్రాంతానికి చెందిన బైరెడ్డి రాజశేఖరరెడ్డికి బీజేపీ చీఫ్ గా బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ పార్టీలో సాగుతోందిట. కర్నూలు జిల్లాకు చెందిన ఈయన జగన్ అంటే ఒంటికాలి మీద లేచి నిలబడతారు. పైగా ఈయన గొంతు కూడా పవర్ ఫుల్. సీమ ప్రయోజనాల కోసం పోరాడిన చరిత్ర ఉంది. బలమైన సామాజికవర్గం దన్ను కూడా ఉంది. దాంతో ఆయనకు సారధ్యం అప్పగిస్తే ఫలితం బాగా ఉంటుందని కమలనాధులు ఆశిస్తున్నారుట.

గురి అటు వైపే ..?

మరి కూడబలుక్కున్నారా లేక వ్యూహంగానే అమలు చేస్తున్నారా అనంది తెలియదు కానీ జగన్ కి బలమైన స్థావరంగా ఉన్న రాయలసీమ కోట మీదనే జాతీయ పార్టీలు రెండూ గురి పెట్టాయని అంటున్నారు. పైగా రెడ్డి సామాజికవర్గాన్ని కూడా చీల్చేందుకు సారధులను కూడా ఎంపిక చేస్తున్నాయని అంటున్నారు. ఇదే కనుక జరిగితే ఏపీలో వైసీపీ ఓట్లకు ఎంతో కొంత తూట్లు పడడం ఖాయమే అంటున్నారు. ఇది టీడీపీకి అంతిమంగా మేలు చేస్తుందా అన్న చర్చను పక్కన పెడితే అటూ ఇటూ రెడ్లు నిలిచి నిలదీస్తే మాత్రం జగన్ కి కొంత రాజకీయంగా రిస్క్ తప్పదనే అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News