రాయపాటికి లైన్ క్లియర్ అయినట్లేనా?

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు లైన్ క్లియర్ అయినట్లే కన్పిస్తుంది. రాయపాటి సాంబశివరావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా [more]

Update: 2020-08-02 14:30 GMT

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు లైన్ క్లియర్ అయినట్లే కన్పిస్తుంది. రాయపాటి సాంబశివరావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరనున్నట్లు ఎనిమిది నెలల క్రితమే ప్రకటించారు. కానీ ఆయన బీజేపీలో చేరలేకపోయారు. ఇందుకు కారణం కన్నా లక్ష్మీనారాయణ. రాయపాటి సాంబశివరావు చేరికకు కన్నా లక్ష్మీనారాయణ ససేమిరా అనడంతో ఆయన చేరిక సాధ్యం కాలేదు.

ఎప్పటి నుంచో విభేదాలు….

గుంటూరు రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావుకు, కన్నా లక్ష్మీనారాయణకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వీరద్దరి పంచాయతీని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరుండి చక్కబెట్టేవారు. మధ్యే మార్గంగా రాజీ కుదిర్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గుంటూరు మేయర్ సీటు విషయంలో రాయపాటి. కన్నా ల మధ్య పెద్ద వార్ అప్పట్లో జరిగింది. ఇలా ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవు.

బీజేపీలో చేరదామనుకున్నా….

కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన రాయపాటి సాంబశివరావు నర్సరావుపేట పార్లమెంటు నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన టీడీపీలోనే కుదురుకోవాలనుకున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవ్వడంతో రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారు. ఆయనపై ఉన్న సీబీఐ కేసులు కావచ్చు, బ్యాంకు లావాదేవీలు కావచ్చు. రాయపాటిని బీజేపీ వైపు వెళ్లేలా చేశాయి. త్వరలోనే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చిస్తానని రాయపాటి సాంబశివరావు చాలా క్రితం చెప్పినా బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ లభించలేదు.

త్వరలోనే ఢిల్లీకి….

బీజేపీలో సీనియర్ నేత రామ్ మాధవ్ స్వయంగా గుంటూరు వచ్చి రాయపాటి సాంబశివరావును కలవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ కన్నా లక్ష్మీనారాయణ అడ్డుకోవడం వల్లనే రాయపాటి చేరిక సాధ్యం కాలేదు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో రాయపాటి సాంబశివరావుకు మార్గం సుగమం అయిందంటున్నారు. త్వరలోనే ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణను తప్పించడంతో రాయపాటి సాంబశివరావు చేరికకు లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి.

Tags:    

Similar News