సిఫార్సులు ఎక్కువయ్యాయే

యడ్యూరప్ప అధికారాన్ని నిలుపుకున్నారని కేంద్ర నాయకత్వం నుంచి ప్రశంసలే తప్ప అపాయింట్ మెంట్ మాత్రం దొరకడం లేదు. కర్ణాటకలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా [more]

Update: 2019-12-15 18:29 GMT

యడ్యూరప్ప అధికారాన్ని నిలుపుకున్నారని కేంద్ర నాయకత్వం నుంచి ప్రశంసలే తప్ప అపాయింట్ మెంట్ మాత్రం దొరకడం లేదు. కర్ణాటకలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పన్నెండు స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ విజయానికి పూర్తిగా యడ్యూరప్పదే. అందులో ఎటువంటి సందేహం లేదు. తానే ఒంటరిగా అందరినీ గెలిపించుకుని బీజేపీ ప్రభుత్వం పరువు నిలబెట్టారు. మహారాష్ట్రలో అధికారం దక్కకపోయిందన్న ఆవేదనలో ఉన్న కమలం శ్రేణుల్లో యడ్యూరప్ప జోష్ నింపారు.

ప్రశంసలు కురిపించినా….

కన్నడ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు యడ్యూరప్ప పై ప్రశంసలు కురిపించారు. ఇంతవరకూ బాగానే ఉంది. యడ్యూరప్ప తాను మాట ఇచ్చిన విధంగా తనకు అండగా నిలిచిన వారికి మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటున్నారు. అందుకోసం మంత్రి వర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారు. త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి పాలనపై దృష్టిపెట్టలన్నది యడ్యూరప్ప ఆలోచన. అయితే ఇంతవరకూ కేంద్ర నాయకత్వం నుంచి యడ్యూరప్పకు అపాయింట్ మెంట్ లభించలేదు.

వీలయినంత త్వరగా….

వీలయినంత త్వరగా చేపట్టాలన్న యడ్యూరప్ప ఆలోచనలకు అధిష్టానం బ్రేకులు వేస్తున్నట్లు కన్పిస్తుంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరికీ మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని యడ్యూరప్ప హామీ ఇచ్చారు. ఎన్నికల సభల్లో కూడా చెప్పారు. అయితే ఇప్పుడు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు 11 మంది విజయం సాధించారు. వారందరికీ మంత్రివర్గంలో చోటు కల్పిస్తే సీనియర్ నేతలకు అవకాశం లేకుండా పోతోంది.

సీనియర్ల మాటేంటి?

ఎంతో కాలం నుంచి బీజేపీ సీనియర్ నేతలు మంత్రి వర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. వారంతా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేసుకుంటున్నారు. కొందరు మంత్రి పదవి కోసం మఠాధిపతులను కూడా ఆశ్రయిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అగ్రనేతల నుంచి సిఫార్సు చేయించుకుంటున్నారు. మరి కొత్తగా చేరిన వారందరికీ మంత్రి పదవులు ఇచ్చేందుకు కేంద్ర నాయకత్వం అంగీకరిస్తుందా? అదే చేస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళతాయా? అన్నది ఇప్పుడు యడ్యూరప్పను మాత్రమే కాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కూడా వేధిస్తున్న ప్రశ్నలు. అందుకే యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ మరికొంత సమయం పట్టే అవకాశాలున్నట్లు కన్పిస్తుంది.

Tags:    

Similar News