డ్రీమ్ సీట్ లో రేవంత్ గెలుస్తారా..?

దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి హాట్ సీట్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి సులువుగా గెలుస్తుందనుకున్న ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంట్రీతో సీన్ మారుతోంది. [more]

Update: 2019-03-28 14:02 GMT

దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి హాట్ సీట్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి సులువుగా గెలుస్తుందనుకున్న ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంట్రీతో సీన్ మారుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. మల్కాజిగిరి పార్లమెంటు స్థానంపై 2014లోనే కన్నేసిన రేవంత్ రెడ్డి ఈసారైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అయితే, టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి ఇక్కడ గట్టి పోటీ ఎదుర్కోనున్నారు. బీజేపీ తరపున పోటీ చేస్తున్న రామచంద్రారావు కూడా భారీగానే ఓట్లు సాధించే అవకాశం ఉంది. అయితే, ప్రధానంగా పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది.

చాలా ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్

తనకు ఎదురులేదనుకున్న కొడంగల్ నియోజకవర్గంలో ఓటమి తర్వాత ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంటు స్థానంపై కన్నేశారు. 2014లో టీడీపీ నుంచి ఈ టిక్కెట్ ఆశించినా ఆయనకు అప్పుడు దక్కలేదు. మల్కాజిగిరిలో బలమైన అభ్యర్థిని పోటీలో ఉంచాలని భావించిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయితే బెటర్ అని ఆయనను నిలబెట్టింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మాల్కాజిగిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఎల్బీనగర్ లో మాత్రం కాంగ్రెస్ గెలవగా మిగతా అన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఎల్బీనగర్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి సైతం పార్టీ వీడి టీఆర్ఎస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థుల కంటే టీఆర్ఎస్ కు 3 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి కష్టకాలంలో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని చెప్పవచ్చు.

టీఆర్ఎస్ కంటే బలమైన అభ్యర్థిగా రేవంత్

తెలుగుదేశం పార్టీ పోటీలో లేకుండా కాంగ్రెస్ కు పూర్తిగా మద్దతిస్తోంది. సెటిలర్లలో రేవంత్ రెడ్డి పట్ల కొంత ఆధరణ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇక, ప్రభుత్వాన్ని ప్రశ్నించే బలమైన వ్యక్తిగా రేవంత్ రెడ్డికి గుర్తింపు ఉంది. ఇది ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులను బేరీజు వేసుకుంటే టీఆర్ఎస్ అభ్యర్థి కంటే రేవంత్ రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయాలకు కొత్త. మంత్రి అల్లుడు కావడం తప్పించి పార్టీలో పెద్దగా పనిచేయలేదు. ప్రజలకు కొత్త ముఖమే. అయితే, పార్టీ బలమే టీఆర్ఎస్ ను అభ్యర్థి బలం. వలసలు, వరుస ఓటములతో మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తి నైరాశ్యంలో ఉండగా టీఆర్ఎస్ మాత్రం చేరికలు, వరుస విజయాలతో ఉత్సాహంగా ఉంది. ఆ పార్టీ గత ఐదేళ్లుగా ఇక్కడ బాగా బలం పుంజుకుంది. ఇద్దరు అభ్యర్థులూ ధీటుగా ప్రచారం చేస్తున్నా… రేవంత్ ప్రచారం వైవిధ్యంగా సాగుతోంది. యువతను, విద్యావంతులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నకల్లో పోలైన ఓట్ల కంటే కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నా గెలిచే స్థాయిలో ఓట్లు తెచ్చుకోవడం కష్టమే అనే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News