రేవంత్ రెడ్డి రైజ్ అవుతున్నారా..?

రేవంత్ రెడ్డి ఎంట్రీతో మల్కాజిగిరి పార్లమెంటులో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఛాన్స్ లేదనుకున్న ఈ స్థానానికి రేవంత్ రాకతో క్షేత్రస్థాయిలో పరిస్థితి మారుతోంది. [more]

Update: 2019-04-06 08:00 GMT

రేవంత్ రెడ్డి ఎంట్రీతో మల్కాజిగిరి పార్లమెంటులో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఛాన్స్ లేదనుకున్న ఈ స్థానానికి రేవంత్ రాకతో క్షేత్రస్థాయిలో పరిస్థితి మారుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగు లేదనుకున్న ఇక్కడ రేవంత్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రచారంలో సైతం టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ ముందుంది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా పోటీకి దూరంగా ఉండి మరీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుండటంతో రేవంత్ రెడ్డి బాగానే ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక, సోషల్ మీడియా వేదికగా కూడా టీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక పార్టీపై మరొక పార్టీ వ్యతిరేక ప్రచారం చేస్తోన్నాయి.

తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నించినా చివరకు ఈ టిక్కెట్ మల్లారెడ్డికి దక్కింది. గెలిచాక ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరింట టీఆర్ఎస్ గెలిచింది. అన్నింటా భారీ మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ నుం ఎల్బీనగర్ లో గెలిచిన సుధీర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరారు. దీంతో మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కంటే టీఆర్ఎస్ అభ్యర్థులకు 3.20 లక్షల ఓట్ల భారీ ఆధిక్యం వచ్చింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. టీఆర్ఎస్ నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టిక్కెట్ ఇచ్చారు.

టీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ

అయితే, కొడంగల్ లో ఓటమి తర్వాత ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి రిస్క్ చేశారు. అయితే, రేవంత్ ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. టీడీపీ క్యాడర్ కూడా పూర్తిగా మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తోంది. ప్రశ్నించే గొంతుకకు ఓటేయాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. రేవంత్ ప్రచారానికి కూడా మంచి స్పందనే వస్తోంది. అయితే, సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల విమర్శలు పరిమితికి మించుతున్నాయి. ఫామ్ హౌజ్ కు పోయే ఎంపీ కావాలా, పార్లమెంటుకు పోయే ఎంపీ కావాలా అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. దీనికి కౌంటర్ గా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జైలుకు పోయే ఎంపీ కావాలా, పార్లమెంటుకు పోయే ఎంపీ కావాలా అంటూ టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. రాజశేఖర్ రెడ్డి డబ్బులిచ్చి టిక్కెట్ కొనుక్కున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిఃస్తున్నారు. ఇక, ఈ సోషల్ మీడియా ప్రచారం మరింత దారి తప్పి పాత ఫోటోలు బయటకు తెచ్చే దాకా పోయింది. రాజశేఖర్ రెడ్డి విద్యార్థినులతో కలిసి ఓ కళాశాల కార్యక్రమంలో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తానికి రేవంత్ ఎంట్రీతో అసలు పోటీనే ఉండదనుకున్న మల్కాజిగిరిలో రోజురోజుకూ పోటీ తీవ్రమవుతోంది.

Tags:    

Similar News