రేవంత్ రెడ్డి… వాట్ నెక్స్ట్..?

ఎనుముల రేవంత్ రెడ్డి… తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఏ అంశం పైనైనా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తారు. టీఆర్ఎస్ పై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై ఒంటికాలితో [more]

Update: 2018-12-26 03:30 GMT

ఎనుముల రేవంత్ రెడ్డి… తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఏ అంశం పైనైనా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తారు. టీఆర్ఎస్ పై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై ఒంటికాలితో విరుచుకుపడతారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీంతో మహాసముద్రం వంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంవత్సరంలోనే పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పదవిని దక్కుంచుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లోనూ రేవంత్ కీలక పాత్ర పోషించారు. తన స్వంత నియోజకవర్గాన్ని చూసుకుంటూనే మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. అయితే, టీఆర్ఎస్ కు సానుకూలంగా బలంగా వీచిన గాలిలో కాంగ్రెస్ కి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఈ గాలిలో ఎవరూ ఊహించని విధంగా రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ లో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ వ్యూహాల ముందు రేవంత్ దూకుడు కొడంగల్ లో ప్రభావం చూపలేకపోయింది. రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోనూ రెండు మూడు మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో రేవంత్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

టార్గెట్ చేరేందుకు ఎం చేస్తారు..?

ఎన్నికల ఫలితాల రోజు చివరి ఫలితం రాకముందే రేవంత్ రెడ్డి ఓటమిని అంగీకరించారు. ఆ సమయంలో ‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం’ అంటూ కాస్త హుందాగానే ఓటిమిని ఒప్పుకున్నారు. తర్వాత రేవంత్ బయట కనిపించడం లేదు. తాజాగా స్వంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించడం మినహా గత 15 రోజులుగా ఏమీ మాట్లాడలేదు. దీంతో అసలు రేవంత్ రెడ్డి నెక్ట్స్ స్టెప్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి, కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ ఓ సందర్భంలో సవాల్ విసిరారు. అయితే, ఎన్నికల వేళ నేతల సవాళ్లు ఉత్తవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కచ్చితంగా రేవంత్ రాజకీయాల్లోనే కొనసాగడంలో ఎటువంటి అనుమానమూ లేదు. అయితే, ఆయన భవిష్యత్ వ్యూహం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఆయన తన అంతరంగికులకు, సన్నిహితులకు చెప్పే మాట… ‘నా టార్గెట్ 2024’. అయినా, ఈ ఎన్నికల్లో రేవంత్ తన శక్తిమేర కాంగ్రెస్ కి పనిచేశారు. కానీ, రేవంత్ తో పాటూ పార్టీ కూడా ఫెయిల్ అయ్యింది.

కొడంగల్ లో గెలిచి ఉంటే…

సంవత్సరం క్రితం టీడీపీ నుంచి రేవంత్ భారీగా నాయకులను వెంటేసుకుని కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలో ఇక రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి హవా ఉంటుందనుకున్నారు. అయితే, ఎన్నికల నాటికి పరిస్థితి తారుమారైంది. ఆయనను నమ్మి కాంగ్రెస్ లో చేరిన వారిలో ఇద్దరుముగ్గురు మినహా ఎవరికీ టిక్కెట్ ఇప్పించలేకపోయారు. వారిలో సీతక్క మినహా మిగతా వారు ఓటమి పాలయ్యారు. ఇక, టిక్కెట్ దక్కని కొందరు పార్టీని, రేవంత్ ను కూడా వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఓ వైపు ఓటమి పాలవ్వడం, మరో వైపు తన వర్గం చెల్లాచెదురు కావడం రేవంత్ కు ఇబ్బందికరంగా మారింది. ఇక, కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద రేవంత్ రెడ్డి నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో పార్టీ ఓడినా రేవంత్ గెలిచి ఉంటే… ఈపాటికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని రేవంత్ కి అప్పగించాలన్న డిమాండ్లు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు.

ఎంపీగా పోటీ చేస్తారా..?

ఈ సమయంలో రేవంత్ సైలెంట్ అయ్యారు. కనీసం తన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కూడా బయటపడటం లేదు. మరి, మిగతా అందరు నేతల కంటే దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డే సైలెంట్ అవ్వడాన్ని కాంగ్రెస్ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారనే వార్తలు వచ్చినా ఆయన ఎక్కడా బయటపడలేదు. ఇప్పటికే ఆ సీటు నుంచి పోటీ చేసేందుకు తన బంధువు జైపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ రేవంత్ పోటీ చేసే అవకాశం లేదంటున్నారు. మరి, రేవంత్ ఏం చేస్తారు..? ఇంతకు ముందులానే దూకుడుగా వెళతారా..? లేదా కొన్ని నెలల పాటు సైలెంట్ గా ఉంటారా అనేది చూడాలి.

Tags:    

Similar News