ప్రియమైన శత్రువు…?
రాజకీయాల్లో ఇతర పార్టీల్లో అంతర్గత మిత్రులతోపాటు ఆపద్ధర్మశత్రువులూ ఉంటారు. ప్రధాన ప్రత్యర్థులను కట్టడి చేయడానికి వీరు ఉపయోగపడుతూ ఉంటారు. తాజాగా టీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి పరోక్ష [more]
రాజకీయాల్లో ఇతర పార్టీల్లో అంతర్గత మిత్రులతోపాటు ఆపద్ధర్మశత్రువులూ ఉంటారు. ప్రధాన ప్రత్యర్థులను కట్టడి చేయడానికి వీరు ఉపయోగపడుతూ ఉంటారు. తాజాగా టీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి పరోక్ష [more]
రాజకీయాల్లో ఇతర పార్టీల్లో అంతర్గత మిత్రులతోపాటు ఆపద్ధర్మశత్రువులూ ఉంటారు. ప్రధాన ప్రత్యర్థులను కట్టడి చేయడానికి వీరు ఉపయోగపడుతూ ఉంటారు. తాజాగా టీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి పరోక్ష మిత్రునిగా, ఆపద్ధర్మ శత్రువుగా మారారు. ఏడాది క్రితం వరకూ ఆయన పేరు చెబితే టీఆర్ఎస్ అగ్రనేతలు నిప్పులు కక్కేవారు. ఇప్పుడు కూడా బహిరంగంగా అదే తరహా ధోరణిని కనబరుస్తున్నారు. కానీ నిజంగా కాదు. ఆపద్ధర్మంగా మాత్రమే. బీజేపీ అత్యంత వేగంగా రాష్ట్రంలో ఎదుగుతోంది. కాంగ్రెసు దాదాపు చేతులెత్తేసే స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టారు. కాంగ్రెసు శ్రేణులను కూడగడుతున్నారు. పోటీ టీఆర్ఎస్, కాంగ్రెసు పార్టీల మధ్య మాత్రమే ఉంటుందనే భావన ప్రజల్లో కలిగేలా ప్రయత్నిస్తున్నారు. నిన్నామొన్నటివరకూ అత్యంత తీవ్రంగా కనిపించిన బీజేపీ నాయకుల వాయిస్ తగ్గుముఖం పట్టింది. మీడియా రేవంత్ కు పెద్దపీట వేస్తోంది. కమలం పార్టీ మళ్లీ పుంజుకోవడానికి తీవ్రంగా కసరత్తు మొదలు పెట్టింది. అది జరగకుండా చూసేందుకు టీఆర్ఎస్ కమలం పార్టీని విస్మరిస్తున్నట్లు నటిస్తూ, రేవంత్ పై వాగ్బాణాల యుద్దం మొదలుపెట్టింది.
నాకు నువ్వు.. నీకు నేను…
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కు శ్రీకారం చుట్టారు. రానున్న హుజూరాబాద్ ఎన్నికలు సైతం టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే కేంద్రీకృతం కాబోతున్నాయి. కాంగ్రెసు పుంజుకునేందుకు రేవంత్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఉప ఎన్నికలో ఓ మోస్తరు ఓటింగును తెచ్చుకోలేకపోతే శాసనసభ ఎన్నికల వరకూ బీజేపీ యే ప్రధాన ప్రత్యర్థిగా కనిపిస్తుంది. బీజేపీ ని ఆ స్థానంలో ఊహించడానికి టీఆర్ఎస్ ఇష్టపడటం లేదు. అలాగని కాంగ్రెసును భుజాలపైకి ఎత్తుకుని పెంచి పోషించదలచుకోలేదు. మధ్యేమార్గంగా తనకు పాత శత్రువైన రేవంత్ రెడ్డిని మళ్లీ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అతనిని ఎంత సీరియస్ గా విమర్శిస్తే అంతగానూ టీఆర్ఎస్ కు ప్రయోజనమే. పీసీసీ నేతగా అతని బలం పెరిగేకొద్దీ రాష్ట్రంలో కొంతమేరకు కాంగ్రెసు పుంజుకుంటుంది. అది బీజేపీకి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్, కాంగ్రెసు పార్టీలు రెంటికీ ఉపయోగమే. కొత్త వ్యూహంతో టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , రేవంత్ నే లక్ష్యంగా చేసుకుంటూ తీవ్రమైన విమర్శలకు తెర తీస్తున్నారు. తద్వారా తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసు పార్టీ మాత్రమే నన్న భావనను ప్రజల్లోకి పంపుతున్నారు.
కమలానికి కలవరం…
బీజేపీ అగ్రనాయకులు తెలంగాణలో పార్టీ పరిస్థితులపై ఒకింత అసంతృప్తికి గురవుతున్నట్లు తాజా సమాచారం. ఏడాది కాలంగా పార్టీ చాలా దూకుడు కనబరిచింది. మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది. దాంతో కిషన్ రెడ్డికి పదోన్నతి కల్పించి కేబినెట్ ర్యాంకును కట్టబెట్టారు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ , ఎంపీ అరవింద్ స్థాయిలో నైనా పార్టీలో కిషన్ కదలిక తేలేకపోతున్నారు. జన ఆశీర్వాద యాత్ర వంటివి మొక్కుబడిగా సాగాయి. మరోవైపు కేంద్రమంత్రికి టీఆర్ఎస్ పరోక్ష సహకారం సంపూర్ణంగా లభిస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకులైన బండి సంజయ్ వంటి వారు కనబరుస్తున్న దూకుడు కారణంగా టీఆర్ఎస్ కొంత ఇబ్బందిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి యాక్టివ్ అయితే రెండు వర్గాలుగా బీజేపీ బలహీనపడుతుందనేది అధికార పార్టీ అంచనా. అందుకే టీఆర్ఎస్ పట్ల సంయమనం పాటించే కేంద్రమంత్రిని టీఆర్ఎస్ తలకెత్తుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ దూకుడు తగ్గింది. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత , కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ హోదాలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కమల వికాసం తగ్గుముఖం పట్టింది. ఇది అధిష్టానానికి కొంత కలవరం కలిగిస్తోంది. పరస్పర శత్రుత్వంతోనే కాంగ్రెసు, టీఆర్ఎస్ లు రెండూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నాయి.
సామాజికంగానూ సానుకూలమే..
రేవంత్ రెడ్డి పీసీసీ నేత కావడంతోనే రెడ్డి సామాజిక వర్గం హస్తం పార్టీని మరోసారి సొంతం చేసుకునే వాతావరణం నెలకొంది. క్రిస్టియన్, రెడ్డి వర్గాల పునాదులపై తెలంగాణ లో రాజకీయాలు తనకు సానుకూలం అవుతాయనుకున్న షర్మిల ప్రస్తుతం డీలా పడిపోయారు. అనుకున్న స్థాయిలో స్పందన కనిపించడం లేదు. రాజశేఖరరెడ్డి వారసత్వం రాజకీయంగా కాంగ్రెసుకే దఖలవుతుందంటూ రేవంత్ చేస్తున్న ప్రచారం ఫలిస్తోంది. దీనిని టీఆర్ఎస్ అనుకూల పరిణామంగానే భావిస్తోంది. బీసీ సామాజిక వర్గాలపై బీజేపీ గురి పెట్టింది. కానీ పూర్తిగా సొంతం చేసుకోలేకపోతోంది. ఎస్సీ సామాజిక వర్గాలు దళిత బంధు వంటి పథకాలతోను, ఎంఐఎం కారణంగా ముస్లింలు, తెలంగాణ వాదంతో ఇతరులు టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉంటారని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది. రేవంత్ రంగప్రవేశంతో రెడ్డి సామాజిక వర్గాన్ని బీజేపీ ఆకర్షించలేకపోతోంది. దీనివల్ల పోటాపోటీ వాతావరణం టీఆర్ఎస్, కాంగ్రెసుల మధ్యనే కేంద్రీక్రుతం అవుతుందని భావిస్తున్నారు. దీనికోసం రేవంత్ ను టార్గెట్ చేస్తూ, అతని ప్రాధాన్యాన్ని పెంచడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.
-ఎడిటోరియల్ డెస్క్