హరీ హరీ.. టికెట్ కి దారేదీ..!?

విశాఖకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి ఇపుడు రాజకీయంగా అంత ప్రభావవంతంగా లేదు ప్రధాన పార్టీల తలుపులు అన్నీ తట్టినా పిలుపు [more]

Update: 2019-02-11 09:30 GMT

విశాఖకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి ఇపుడు రాజకీయంగా అంత ప్రభావవంతంగా లేదు ప్రధాన పార్టీల తలుపులు అన్నీ తట్టినా పిలుపు రాక అలసిపోయిన ఈ నాయకుడు ఇపుడు టీడీపీ మాత్రమే శరణ్యం అనుకుంటున్నారు. అయితే టీడీపీలో కూడా ఆయన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో రేపటి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది అనుచరులకు సైతం అంతుపట్టడం లేదు. గత ఏడాదిగా తాను చేరబోయే రాజకీయ పార్టీ పేరు చెబుతానంటూ భారీ ప్రకటనలు ఇస్తున్న హరి ఇప్పటికి కూడా తానుండబోయే పార్టీ ఏదో చెప్పలేని స్థితిలో ఉన్నారంటేనే అర్ధం చేసుకోవాలి.

బిల్డప్పులతోనే చెడిందా

నిజానికి హరి విషయంలో ఏ పార్టీ కూడా పెద్దగా ఆలోచించకపోవడానికి సొంత బిల్డప్పులే కారణమని అంటున్నారు. తనను తాను డిల్లీ నాయకున్ని అని ఊహించుకోవడమే కాకుండా, జాతీయ‌ నేతల స్థాయి తనదని ఆయన భావించడమే మిగిలిన పార్టీల నేతలకు కన్నెర్ర అయిందని అంటారు. అదృష్టం తలుపు తట్టి ఓ మారు అనకాపల్లి ఎంపీగా గెలిచిన హరి తన బలాన్ని అతిగా ఊహించుకోవడమే కాకుండా తాను ఎక్కడైనా గెలుస్తానని బీరాలు పలకడం కూడా వివిధ పార్టీలలోని నేతలను దూరం చేసిందని చెబుతారు. ఇప్పటికీ పలుమార్లు టీడీపీ పెద్దలతో రాయబేరాలు జరిగినా పిలుపు రాకపోవడానికి లోకల్ గా ఉన్న టీడీపీ నాయకత్వమే హరి పొక‌డ గిట్టక రానీవడం లేదని అంటున్నారు.

చాయిస్ తానే ఇస్తున్న నేత

సాధారణంగా అధినాయకత్వాలు తాము అభర్ధిని ఎంపిక‌ చేసి ఫలనా చోట పోటీ చేయమంటాయి. కానీ హరి మాత్రం తానే అధినాయకత్వాలకు చాయిస్ ఇస్తారు. తాను ఉత్తరాంధ్రలో ఎక్కడైనా పోటీ చేసి గెలవగలనని, తనకు ఎక్కడ సీటు ఇచ్చిన గెలుపునకు ఢోకా లేదని చెప్పడంతోనే హైకమాండ్ కి గుస్సా వస్తోందట. విశాఖ, అనకాపల్లి ఎంపీ సీటు అయినా, ఉత్తర నియోజకవర్గం అయినా, విజయనగరం జిల్లాలో ఏ సీటు అయినా తనకు ఇస్తే గెలుపు గ్యారంటీ అని చెబుతున్నహరి మాటలను విశ్వసించని టీడీపీ పెద్దలు ఆయనకు భేషరతుగా పార్టీలో చేరితే చేరమంటున్నారు. చంద్రబాబు ఇప్పటికే ఆశావహుల పనితీరు బలాబలాల గురించి సర్వే చేయించారు. దాంట్లో కూడా హరికి మార్కులు రాకపోవడంతోనే ఆయన విషయాన్ని అలా వదిలేసారని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో చేరి ఎకాఎకిన ఎంపీ, ఎమ్మెల్యే అయిపోదామనుకుంటున్న హరికి ఆ పార్టీ అధినాయకత్వం పోకడలు అర్ధం కావడం లేదట. అయినా తనకే టికెట్ ఖాయమని చెప్పుకోవడమే అసలైన వింత.

Tags:    

Similar News