sachin pilot : సచిన్ ఈసారైనా నెగ్గుతారా?

కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరినీ దూరం చేసుకుంటోంది. పట్టున్న నేతలను పక్కకు వెళ్లేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటున్నాయి. ఇప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న పంజాబ్ లో సిద్ధూను పీసీసీ [more]

Update: 2021-09-25 16:30 GMT

కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరినీ దూరం చేసుకుంటోంది. పట్టున్న నేతలను పక్కకు వెళ్లేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటున్నాయి. ఇప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న పంజాబ్ లో సిద్ధూను పీసీసీ చీఫ్ తెచ్చి తలనొప్పిని తెచ్చుకుంది. చివరకు ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చింది. ఇక రాజస్థాన్ లోనూ నాయకత్వ మార్పిడిపై డిమాండ్ పెరుగుతోంది. ఎప్పటి నుంచో సచిన్ పైలట్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఆ అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు.

ముఖ్యమంత్రితో…

సచిన్ పైలెట్ గత ఏడాదిలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పై యుద్ధం ప్రకటించారు. ఇరవై మంది ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టారు. దీంతో అక్కడ ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆందోళన నెలకొంది. బీజేపీ కూడా జ్యోతిరాదిత్య సింధియా తరహాలోనే సచిన్ పైలెట్ తమ పార్టీలోకి వస్తారని భావించారు. కానీ వసుంధర రాజే కారణంగా సచిన్ పైలెట్ బీజేపీకి చేరువ కాలేకపోయారు. ఈలోపు రాహుల్ గాంధీ, ప్రియాంకలు సర్ది చెప్పడంతో సచిన్ పైలెట్ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు.

తన వర్గం నేతలకు….

సచిన్ పైలెట్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అశోక్ గెహ్లాత్, సచిన్ పైలట్ ల మధ్య సయోధ్య కోసం హైకమాండ్ సమన్వయ కమిటీని కూడా నియమించింది. తన వర్గం నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని సచిన్ పైలెట్ డిమాండ్ పెట్టారు. కానీ అశోక్ గెహ్లాత్ మాత్రం ఇంతవరకూ మంత్రి వర్గ విస్తరణ జోలికి పోలేదు. సచిన్ పైలెట్ వర్గానికి మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే ఆయన వాయిదా వేస్తున్నారంటున్నారు.

రాహుల్ ఎదుట ప్రతిపాదన…

కానీ సచిన్ పైలెట్ మాత్రం మంత్రివర్గ విస్తరణ కోసం పట్టుబడుతున్నారు. రెండు రోజుల క్రితం సచిన్ పైలెట్ రాహుల్ గాంధీని కలసి తన భవిష్యత్ పై చర్చించినట్లు తెలిసింది. మంత్రి వర్గ విస్తరణను వెంటనే చేపట్టాలని రాహుల్ గాంధీని ఆయన కోరారని చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి వర్గ విస్తరణ తప్పనిసరి అయింది. మరి సచిన్ పైలట్ ఈసారైనా తన డిమాండ్ ను నెరవేర్చుకుంటారా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News