సజ్జనుడు మాత్రం కాదు…..!!!
తప్పు చేసిన వాడు కొంతకాలం తప్పించుకోగలడు. కానీ ఎల్లకాలం తప్పించుకోలేడు. ఏదో ఒక రోజు చట్టం చేతికి చిక్కక తప్పదు. అప్పటి వరకూ ఏ చట్టాన్ని అయితే [more]
తప్పు చేసిన వాడు కొంతకాలం తప్పించుకోగలడు. కానీ ఎల్లకాలం తప్పించుకోలేడు. ఏదో ఒక రోజు చట్టం చేతికి చిక్కక తప్పదు. అప్పటి వరకూ ఏ చట్టాన్ని అయితే [more]
తప్పు చేసిన వాడు కొంతకాలం తప్పించుకోగలడు. కానీ ఎల్లకాలం తప్పించుకోలేడు. ఏదో ఒక రోజు చట్టం చేతికి చిక్కక తప్పదు. అప్పటి వరకూ ఏ చట్టాన్ని అయితే తప్పించుకు తిరుగుతూ, ఏ చట్టంలోని లొసుగులను అయితే సానుకూలంగా మార్చుకుని లబ్దిపొందిన వ్యక్తి, చివరకు అదే చట్టం చేతిలో బందీకాక తప్పదు. సజ్జన్ కుమార్ ఉదంతమే ఇందుకు చక్కటి ఉదాహరణ. సిక్కుల ఊచకోత కేసులో జీవిత ఖైదు శిక్షకు గురైన ఆయన చివరకు కోర్టులో లొంగిపోక తప్పలేదు. ఇప్పటిదాకా తనకు ఆశ్రయమిచ్చిన హస్తం పార్టీకీ రాజీనామా చేయక తప్పలేదు. అంతిమంగా కటకటాల వెనక్కు వెళ్లక తప్పలేదు. ఈ ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించింది.
హత్యానంతరం……
ఒకసారి పూర్వాపరాల్లోకి వెళితే సజ్జన్ కుమార్ బాగోతం బయటపడుతుంది. 1984 అక్టోబరు 31న నాటి ప్రధాని ఇందిరాగాంధీ సిక్కు మతానికి చెందిన సొంత అంగరక్షకుల చేతిలో హత్యకు గురయ్యారు. అంగరక్షకులు సత్యజిత్ సింగ్, బియాంత్ సింగ్ లకు ఆ తర్వాత న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఇందిరాగాంధీ హత్య సందర్భంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సిక్కులపై పెద్దయెత్తున దాడులు జరిగాయి. పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు దాడులకు పురిగొల్పారు. ఈ సందర్భంగా అన్నెంపున్నెం ఎరుగని అమాయక సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఆ దాడులకు, హత్యలకు పాల్పడిన హస్త పార్టీ నాయకుల్లో సజ్జన్ కుమార్ ప్రముఖుడు. అప్పటి నుంచి నత్తనడకన ఆ కేసు విచారణ జరిగింది. చట్టపరమైన లోపాలు, రాజకీయ పలుకుబడి, సరైన సాక్ష్యాలు లేక విచారణ ఏళ్లకు ఏళ్లు కొనసాగింది. నాటి ఘటనలో జగదీష్ కౌర్ అనే వివాహిత తన భర్తను, కుమారుడిని, ముగ్గురు సోదరులను కోల్పోయింది. ఈ హత్యలకు సజ్జన్ కుమార్ కారకుడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. 2013 ప్రత్యేక కోర్టులో వ్యాజ్యం దాఖలయింది. 2013 ఏప్రిల్ లో “కర్కర్ డుమా” జిల్లా కోర్టు సజ్జన్ కుమార్ నిర్దోషి అని తీర్పు చెప్పింది. అదే సమయంలో మరో అయిదుగురికి శిక్ష విధించింది. అదే ఏడాది ఆగస్టు 27న సజ్జన్ కుమార్ విడుదలపై ఢిల్లీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ కేసు విచారణ హైకోర్టులో సుదీర్ఘకాంల సాగింది. 2018 డిసెంబరు 18న సజ్జన్ కుమార్ ను దోషిగా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. ఆయనకు జైలు శిక్ష విధించింది.
లొంగిపోవాలన్న ఆదేశాలతో….
డిసెంబరు 31లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 1993లో ముంబయిలో, 2002లో గుజరాత్ లో, 2013లో ముజఫర్ నగర్ లో అల్లర్లు జరిగాయని, మైనార్టీలు లక్ష్యంగా ఇవి జరిగాయని పేర్కొంది. రాజకీయ నాయకులు, పోలీసుల అండతోనే ఈ అరాచకాలు జరిగాయని వ్యాఖ్యానించింది. ఢిల్లీ పాలం కాలనీలో నిరాజ్ నగర్ ప్రాంతంలో అయిదుగురు సిక్కుల ఊచకోతలకు ఆయనను బాధ్యుడిగా నిర్ధారించింది. లొంగిపోయేందుకు జనవరి 30 వరకూ గడువు ఇవ్వాలన్న సజ్జన్ కుమార్ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం ఉండదన్న ఉద్దేశ్యంతో లొంగిపోయేందుకు తన కక్షిదారుడు సిద్ధంగా ఉన్నారని సజ్జన్ కుమార్ న్యాయవాది అనిల్ కుమార్ శర్మ వెల్లడించారు. 73 ఏళ్ల వయస్సును దృష్టిలో పెట్టుకుని, కుటుంబ, ఆస్తి వ్యవహారాలు చక్కబెట్టేందుకు గడువు కావాలని ఆయన కోరారు. బాధితుల తరుపున సిక్కు న్యాయవాది హెచ్.ఎస్. ఫూల్కే వాదించారు. ఆయన పంజాబ్ లో ఆప్ నేత. ఆరాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. 1984 నుంచి విరామం లేకుండా కేసును వాదిస్తున్నారు. దోషులకు శిక్ష పడేందుకు, బాధితులకు న్యాయం చేసేందుకు గత మూడున్నర దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఎట్టకేలకు విజయం సాధించారు.
ప్రస్థానం ఇలా…..
సజ్జన్ కుమార్ ప్రస్థానం 1977 ఢిల్లీ కాంగ్రెస్ కార్పొరేటర్ గా ప్రారంభమైంది. అనంతరకాలంలో ఢిల్లీ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అనతి కాలంలోనే 1980లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీకి చేరువయ్యారు. అదే ఏడాది ఔటర్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1991లో మళ్లీ ఎన్నికయ్యారు. 2004లో మళ్లీ అదేస్థానం నుంచి పార్లమెంటులోకి ప్రవేశించారు. అప్పట్లో ఆయనకు8.55 లక్షల ఓట్లు లభించాయి. ఇది దేశంలోనే అత్యధికం. ఏ ఎంపీకి ఇన్ని ఓట్లు రాలేదు. సిక్కుల ఊచకోతలో సజ్జన్ కుమార్ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ చాలా కాలం పాటు కేంద్రంలో కాంగ్రెస్ లేదా దాని మద్దతుగల ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆయన మీద ఈగ వాలలేదు. తన చెప్పు చేతల్లోని సీబీఐని ప్రభుత్వంలో నియమిస్తూ వచ్చాయి. ఫలితంగా ఆయన తప్పించుకున్నారు. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో సజ్జన్ జైలుకు వెళ్లక తప్పలేదు. ఢిల్లీ హైకోర్టు శిక్ష విధించిన వెంటనే సజ్జన్ కుమార్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనకు శిక్ష విధింపుపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. చట్టం ముందు ఏదో ఒక రోజు తలొగ్గక తప్పదన్న వాస్తవాన్ని వారు గుర్తిస్తున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్