ఈ వైసీపీ ఎమ్మెల్యేకు అప్పుడే సీటు టెన్షన్‌..?

ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లతో అప్రతిహ‌త విజ‌యం న‌మోదు చేసింది. అయితే వీరిలో చాలా మంది ఎమ్మెల్యేలు రెండేళ్లకే తేలిపోయారు. త‌మ స్థాయికి [more]

Update: 2021-04-13 13:30 GMT

ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లతో అప్రతిహ‌త విజ‌యం న‌మోదు చేసింది. అయితే వీరిలో చాలా మంది ఎమ్మెల్యేలు రెండేళ్లకే తేలిపోయారు. త‌మ స్థాయికి త‌గ్గ ప‌నితీరు క‌న‌ప‌ర్చడం లో ఘోరంగా విఫ‌ల‌మ‌వుతున్నారు. ఈ లిస్టులోనే విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి వెంక‌ట చిన అప్పల‌నాయుడు కూడా చేరిపోయారు. అప్పుడెప్పుడో టీడీపీ ఆవిర్భవించిన‌ప్పుడు ఎన్టీఆర్ సీటు ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యే అయిన చిన అప్పల‌నాయుడు చివ‌రిగా 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ 2019లో జ‌గ‌న్ ద‌య‌తో వైసీపీ సీటు ద‌క్కించుకుని పాతికేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ఈ గాలిలో కూడా చిన అప్పల‌నాయుడు స్వల్ప మెజార్టీతో మాత్రమే బొబ్బిలిలో గెలిచారు.

మంత్రి కాలేక పోయినా….

అప్పల‌నాయుడు మంత్రి కాలేకపోయినా ప్రోటెం స్పీక‌ర్‌గా అరుదైన గౌర‌వం ద‌క్కించుకున్నారు. అయితే ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు అవుతున్నా… నియోజ‌క‌వ‌ర్గానికి ఎంతో సీనియ‌ర్ అయినా కూడా రాజ‌కీయంగా బొబ్బిలిలో వైసీపీ త‌ర‌పున ఏ మాత్రం పట్టు సాధించ‌లేక‌పోతున్నారు. ఇటీవ‌ల బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీ దాదాపుగా 50 శాతం పంచాయ‌తీలు గెల‌వ‌డ‌మే కాదు… కీల‌క పంచాయ‌తీల్లో పాగా వేసింది. దీంతో బొబ్బిలి మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధిష్టానం అక్కడ మంత్రి బొత్సతో పాటు ఎంపీ బెల్లాన చంద్రశేఖ‌ర్‌కు బాధ్యత‌లు అప్పగించింది.

బొబ్బిలిరాజుల ముందు…

అయినా కూడా బొబ్బిలిలో మొత్తం 31 వార్డుల్లో 11 టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా వైసీపీ జెండా ఎగరేసింది. బొబ్బిలి రాజుల‌కు ధీటుగా శంబంగి చిన అప్పల‌నాయుడు దూకుడు ప్రద‌ర్శించ‌లేక‌పోతున్నార‌న్న చ‌ర్చలు జిల్లా రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి. త్వర‌లో జ‌రిగే ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీల ఎన్నిక‌ల్లోనూ ఇదే ఫ‌లితాలు పున‌రావృతం అయితే శంబంగికి ఇవే చివ‌రి ఎన్నిక‌లు అవుతాయ‌ని వైసీపీ వాళ్లే చెపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఇప్పటికే జ‌గ‌న్‌కు వెళ్లిన నివేదిక‌ల్లో శంబంగి అప్పల‌నాయుడుపై బ్యాడ్ రిపోర్టు వెళ్లిందంటున్నారు.

విజయసాయి చెప్పి చూసినా….?

ఉత్తరాంధ్ర పార్టీ వ్యవ‌హారాల ఇన్‌చార్జ్ విజ‌య‌సాయి సైతం శంబంగి అప్పల‌నాయుడుతో మీరు మ‌రింత యాక్టివ్‌గా ఉండాల‌ని సూచించిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పటికే వ‌య‌స్సు పైబ‌డ‌డంతో రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉండ‌లేక‌పోతోన్న ఆయ‌నను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌క్కన పెట్టేయాల‌ని వైసీపీ అధిష్టాన‌మే భావిస్తోంది. శంబంగి అప్పల‌నాయుడు రాజ‌కీయ జీవితం దాదాపు ముగిసిన‌ట్టే అనుకోవాలి.

Tags:    

Similar News