“పవార్” గేమ్ మొదలవుతుందా?

తీవ్ర నైరాశ్యంలో, దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న యూపీఏ పక్షాలకు ప్రస్తుతం శరద్ పవార్ ఆశాద్వీపంగా కనిపిస్తున్నారు. రాజకీయ ఘటనాఘటన సమర్థునిగా పేరు తెచ్చుకున్న పవార్ కు [more]

Update: 2020-12-14 16:30 GMT

తీవ్ర నైరాశ్యంలో, దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న యూపీఏ పక్షాలకు ప్రస్తుతం శరద్ పవార్ ఆశాద్వీపంగా కనిపిస్తున్నారు. రాజకీయ ఘటనాఘటన సమర్థునిగా పేరు తెచ్చుకున్న పవార్ కు యూపీఏ బాధ్యతలు అప్పగిస్తే 2024 ఎన్నికల నాటికి ఈ ప్రతిపక్ష కూటమిని ఎన్డీఏకు దీటుగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని విపక్షాలు భావిస్తున్నాయి. అనారోగ్య కారణాలు, కుటుంబపరంగా సహకారం లేకపోవడంతో ప్రస్తుతం యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ దాదాపు మిత్రపక్షాలతో సమావేశాలకు స్వస్తి చెప్పేశారు. సొంత పార్టీని చక్కదిద్దుకోవడానికే ఆమె ఆరోగ్యం సహకరించడం లేదు. మొండిపట్టుదలతో ఉన్న రాహుల్ గాంధీ నాయకత్వ బాద్యతలు తీసుకునేందుకు అంత సానుకూలంగా కనిపించడం లేదు. దేశంలోని అనేక పార్టీలను కలుపుకుని నిరంతరం మంతనాలతో, రాజకీయ విన్యాసాలతో , విస్తృత ప్రచారంతో ముందుకు వెళితే తప్ప యూపీఏ భవిష్యత్తులో ఏ ఎన్నికలోనూ గట్టెక్కే స్థితి కానరావడం లేదు. ఇప్పటికే అనేక మిత్రపక్షాలను దూరం చేసుకున్న యూపీఏ సమర్థ నాయకత్వం కొరవడితే వచ్చే ఎన్నికల నాటికి అడుగంటిపోయే సూచనలున్నాయి. కాంగ్రెసు కేంద్రంగా ఒకటిరెండు చిన్నపక్షాలతో నామమాత్రావశిష్టంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దీని నుంచి బయటపడాలంటే కచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం ఉన్న నాయకునికి బాధ్యతలు ఇవ్వాలనేది పెద్ద డిమాండ్ గా వినవస్తోంది. ఈ విషయంలో కాంగ్రెసు తీసుకునే నిర్ణయం దేశరాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చేస్తుంది.

పవర్ గేమ్…

శరద్ పవార్ అధికార క్రీడలో ఆరితేరిన ఆటగాడు. అరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశంలోని విభిన్న రాజకీయాలను ఆపోసన పట్టిన మేధావి. అధికారానికి ఎన్నెన్ని ఎత్తులు వేయాలో, ఎలాంటి నిర్ణయాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టవచ్చో తెలిసిన యుక్తి పరుడు. తాను అనుకున్నది సాధించడానికి కొత్త పొత్తులు, ఎత్తులు వేయగల ధీశాలి. మహారాష్ట్ర కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శరద్ పవార్ అంటే దేశంలో తెలియని వారులేరు. రాజకీయ జీవితం ప్రారంభించింది కాంగ్రెసులోనే. అయినా మహారాష్ట్రలో పార్టీని మించి ఎదిగిపోయారు. కేవలం 38 సంవత్సరాల వయసులోనే సొంత పార్టీని కాదని జనతాపార్టీతో చేతులు కలిపి 1978లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. రైతు సంఘాలు, క్రీడా సంఘాలు, రాజకీయాలను పెనవేసి నడుపుతూ రాష్ట్రంలోనూ, దేశంలోనూ పట్టు పెంచుకున్నారు. అదే సమయంలో ప్రధాని పీఠంపై మక్కువ పెంచుకున్నాడు. 1998లో సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షపదవి స్వీకరించే తరుణంలో ప్రధాని పీఠానికి శాశ్వతంగా మార్గం మూసుకుపోతోందని గ్రహించి తిరుగుబాటు బావుటా ఎగరవేశారాయన. తర్వాత నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ స్థాపించి దానిని జాతీయపార్టీగా తీర్చిదిద్ది తన సత్తా నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఎనభై సంవత్సరాల వయసు. రాజకీయ నిష్క్రమణ దశ. ప్రధాని పీఠంపై మక్కువ మాత్రం అలాగే మిగిలి ఉంది. ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్ వంటి వారి మరణం తర్వాత కాంగ్రెసుకు , అధినేత్రికి దిశానిర్దేశం చేసేవారు కరవు అయ్యారు. ఈ స్థితిలో బీజేపీని ఎదుర్కోవాలంటే పవార్ వంటి వారి అవసరం ఎంతైనా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఉత్తర,దక్షిణల వారధి…

నిజానికి శరద్ పవార్ రాజకీయాల్లో పులుగడిగిన ముత్యమేమీ కాదు. అనేక రకాల స్కాముల్లో ఆయన పేరు ప్రముఖంగా వినవస్తుంది. రాజకీయంగా పలుకుబడి రీత్యా ఆయన జోలికి ఎవరూ రారు. అదే విచిత్రం. అత్యంత బలమైన ఈ మరాఠా నాయకుడికి అన్ని పార్టీలతోనూ సంబంధాలున్నాయి. మోడీ ప్రభుత్వమే పద్మవిభూషణ్ అందచేసింది. తాజాగా మహారాష్ట్ర్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా శివసేన, కాంగ్రెసు, ఎన్సీపీల కూటమి అధికారం చేజిక్కించుకోవడంలో పవార్ దే కీలకపాత్ర. రాజకీయాల్లో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల నేతల మధ్య వారధిగా శరద్ పవార్ ను పేర్కొనవచ్చు. ఇటు టీఆర్ఎస్ మొదలు అటు తృణమూల్ వరకూ సన్నిహిత సంబంధాలున్నాయి. అదే సమయంలో వామపక్షాలతోనూ గట్టి బంధమే నడుపుతుంటారు. సంప్రతింపులు జరిపి కూటమిని పటిష్టం చేయాలంటే శరద్ పవార్ యూపీఏకు అవసరమనేది బలమైన వాదన. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు పదవులను అనుభవించిన పార్టీలు అనేకం నేడు కూటమికి దూరమయ్యాయి. వాటిని సమన్వయం చేసి ఏకతాటిపైకి తీసుకు వచ్చే యుక్తి, శక్తి పవార్ కు ఉందనే భావన వ్యక్తమవుతోంది.

మోడీకి చెక్ మేట్…

ప్రధాని నరేంద్రమోడీ దేశంలో తిరుగులేని నేత. మహారాష్ట్ర మరాఠా యోధుడైన శరద్ పవార్ కు మోడీ శక్తియుక్తులు బాగా తెలుసు. సరైన దిశలో పవార్ ను వినియోగించుకోగలిగితే యూపీఏ ప్రబలమైన ప్రత్యర్థిగా నిలవగలుగుతుంది. తాను అందుకు సిద్దంగానే ఉన్నట్లుగా పవార్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారు. ఎన్డీఏ నుంచి వస్తున్న ఆఫర్లకు ఈపాటికే ఆయన స్పందించి ఉండాలి. శివసేన దూరమవుతున్నతరుణంలో తమకు రాష్ట్రంలో పార్టనర్ గా ఉండమంటూ బీజేపీ నుంచి అంతర్గత ఆహ్వానం వచ్చినప్పటికీ దానిని తిరస్కరించారు. ఎన్డీఏలో చేరితే రాజకీయ చరమాంకంలో తనకు లభించే ప్రయోజనాలు శూన్యమని పవార్ కు తెలుసు. ప్రధాని లేదా రాష్ట్రపతి పీఠానికి పోటీ పడాలంటే యూపీఏ ద్వారానే సాధ్యమని ఆయన విశ్వాసం. అందుకే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా నిరోధించి తానెంతటి శక్తిమంతుడో చాటిచెప్పాడు. సంకీర్ణాల యుగంలో తన అవసరం ఏమిటో తెలియపరిచాడు. తన జీవితాశయం నెరవేర్చుకోవడం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెసు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ బాధ్యతలను నిభాయించేందుకు దేశంలోనే సీనియర్ రాజకీయ వేత్త ల్లో ఒకరైన శరద్ పవార్ సిద్ధంగానే ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే యూపీఏ ఛైర్ పర్సన్ సీటుతో పాటు ప్రధాని అభ్యర్థిగానూ పవార్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు కాంగ్రెసు సిద్ధపడుతుందా? అన్నదే ప్రశ్న. అంతవరకూ యూపీఏ మిత్రుల్లో టిక్ టిక్ టిక్ మంటూ ఎన్సీపీ గడియారం చప్పుడు చేస్తూనే ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News