వారి ట్రాప్ లో పెద్దాయన పడతారా?

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయనది. ప్రధానమంత్రి పదవి తృటిలో తప్పిపోయింది. మరాఠాయోధుడిగా పేరుంది. అటువంటి శరద్ పవార్ బీజేపీ మాయలో పడతారా? వారిని నమ్మి ముందుకు [more]

Update: 2021-03-04 16:30 GMT

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయనది. ప్రధానమంత్రి పదవి తృటిలో తప్పిపోయింది. మరాఠాయోధుడిగా పేరుంది. అటువంటి శరద్ పవార్ బీజేపీ మాయలో పడతారా? వారిని నమ్మి ముందుకు వెళతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. శరద్ పవార్ తో బీజేపీ అగ్రనేత అమిత్ షా చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్సీపీతో కలసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది అమిత్ షా ఆలోచన.

అనేక ఆఫర్లతో…..

ఇందుకు శరద్ పవార్ కు అమిత్ షా అనేక ఆఫర్లు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎన్సీపీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయితే శరద్ పవార్ సూచించిన నేతకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని షా చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అంటే శరద్ పవార్ కు పడదు. దేవేంద్ర ఫడ్నవిస్ ను పక్కన పెట్టయినా పవార్ చెప్పిన వారినే సీఎం చేస్తామని అమిత్ షా చెప్పినట్లు పెద్దయెత్తున ప్రచారం జరిగింది.

కొట్టి పారేస్తున్నా…?

అయితే ఈ ప్రచారాన్ని ఎన్సీపీ నేతలు కొట్టి పారేశాయి. ప్రస్తుతం మహారాష‌్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుంది. వీరి పాలన ఇటీవలే ఏడాది గడిచిపోయింది. అయితే తమను మోసం చేసి కూటమి నుంచి బయటకు వెళ్లిపోయిన ఉద్ధవ్ థాక్రేను దెబ్బకొట్టాలని బీజేపీ కసి గా ఉంది. అందుకోసమే శరద్ పవార్ ను కలసి అమిత్ షా మంతనాలు జరిపానంటున్నారు. బీహార్ లో తాము హామీ ఇచ్చినట్లుగానే ఎక్కువ స్థానాలు వచ్చినా నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

శివసేనతోనే కంఫర్ట్……

అయితే శరద్ పవార్ వంటి అనుభవం ఉన్న నేత బీజేపీ ట్రాప్ లో పడే అవకాశం లేదు. మహారాష్ట్రలో బీజేపీని బలహీనం చేయగలిగితేనే ఎన్సీపీకి భవిష్యత్ ఉంటుంది. ఆ సంగతి పెద్దాయనకు తెలియంది కాదు. శివసేన కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పార్టీ. అంతే కాకుండా ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమైన నిర్ణయాలన్నీ శరద్ పవార్ తీసుకుంటున్నారు. థాక్రే పవార్ కు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. సో.. పవార్ వారి ట్రాప్ లో పడరన్నది కూటమి నేతల అభిప్రాయంగా ఉంది.

Tags:    

Similar News