పవార్ పని అయిపోయిందా?

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రానున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాదు మహారాష్ట్ర రాజకీయాలు తెలిసిన వారెవరైనా ఈ ఎన్నికల్లో భారతీయ [more]

Update: 2019-10-23 18:29 GMT

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రానున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాదు మహారాష్ట్ర రాజకీయాలు తెలిసిన వారెవరైనా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమికే ఎడ్జ్ ఉంటుందని చెబుతారు. అయితే మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఏమో గాని శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బేనంటున్నారు విశ్లేషకులు. ఈ ప్రాంతీయ పార్టీ మహారాష్ట్రలో కనుమరుగు అవుతుందని జోస్యం చెబుతున్నారు.

బలమైన పార్టీగా…..

కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న శరద్ పవార్ మహారాష్ట్రలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ముఖ్యమంత్రిగా పనిచేసి, తర్వాత కేంద్రమంత్రిగా కూడా ఆయన పనిచేసినా పార్టీని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్లేవారు. అయితే 2014 నుంచి శరద్ పవార్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందంటారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీలను బలహీన పర్చడమే లక్ష్యంగా పనిచేస్తుంది.

అప్పటి నుంచే పతనం….

బీజేపీ ఉచ్చులో శరద్ పవార్ కూడా చిక్కుకున్నారు. 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి శరద్ పవార్ దెబ్బతిన్నారు. తాజాగా జరిగిన ఎన్నికలకు ముందు శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ నుంచి బలమైన నేతలు బీజేపీ, శివసేన గూటికి చేరిపోయారు. కుటుంబ పార్టీగా పెద్దగా ముద్రపడకున్నా ఆయన అనంతరం పార్టీని నడిపేదెవరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. కూతురు, మనవడికి అంత శక్తి సామర్థ్యాలు లేవన్నది పార్టీలోనే విన్పిస్తున్న మాట.

విలీనం చేసేస్తారా?

ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో శరద్ పవార్ పార్టీ దారుణంగా దెబ్బతినే అవకాశాలుండటంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. గతంలోనే శరద్ పవార్ పార్టీని కాంగ్రెస్ లో కలిపే ప్రతిపాదన వచ్చింది. అయితే ఇందుకు శరద్ పవార్ తిరస్కరించారు. రెండోసారి ఓటమి తర్వాత శరద్ పవార్ ఆ పనిచేయక తప్పదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. పైకి మాత్రం శరద్ పవార్ తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇప్పటికే ఆ పార్టీ చేతులెత్తేసిందన్నది వాస్తవం.

Tags:    

Similar News