పవర్ కావాలంటే పవార్?

మహరాష్ట్రలో శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కన్పించడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ తనకు ఉన్న బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ లేదు. [more]

Update: 2019-11-03 16:30 GMT

మహరాష్ట్రలో శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కన్పించడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ తనకు ఉన్న బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ శివసేన డిమాండ్లకు తలొగ్గడం లేదు. శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్, ఎన్సీపీ బయట నుంచి కానీ సంకీర్ణ ప్రభుత్వం కానీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ బయట నుంచి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటిక సంకేతాలు పంపింది.

దెబ్బతిన్న పులిలా….

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. తమకు మాట ఇచ్చి మోసం చేసిన బీజేపీని అధికారంలోకి రాకుండా చేయాలని దెబ్బతిన్న పులిలా ఎదురు చూస్తుంది. అందుకోసం ఎన్సీపీ, కాంగ్రెస్ ల మద్దతు కోరుతుంది. మహారాష్ట్రలో ప్రస్తుతమున్న బలాబలాలను చూస్తే మూడు పార్టీలు కలిస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుంది. బీజేపీ వ్యాఖ్యలకు, చేష్టలకు ఇప్పటికే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మనసు గాయపడిందంటున్నారు. ఇక కాషాయ పార్టీతో చెలిమి కుదరదంటున్నారు.

పవార్ వెనకడుగు వేస్తున్నారా?

అయితే కాంగ్రెస్ మద్దతిచ్చినా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మాత్రం మద్దతిచ్చేందుకు కొంత వెనకడుగు వేస్తున్నారన్నది వాస్తవం. నిజానికి శివసేనతో కలిసేందుకు శరద్ పవార్ కు ఎటువంటి శషభిషలు లేవు. మహారాష్ట్రలో ముస్లిం సామాజిక వర్గం కూడా శివసేన కంటే బీజేపీనే తమ శత్రువుగా భావిస్తుంది. కాంగ్రెస్ మద్దతిచ్చినా శరద్ పవార్ శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేరన్నది వాస్తవం.

కాదంటే ఎలా?

శరద్ పవార్ ఆయన కుటుంబ సభ్యులపై ఇప్పటికే కేసులు నమోదయి ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్సీపీ మద్దతిచ్చి శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తే చూస్తూ ఊరుకోదు. ఈ సంగతి పెద్దాయనకు తెలియంది కాదు. అందుకే ఆయన ఆచితూచి అడుగు వేస్తున్నారు. సోనియా గాంధీతో చర్చించిన తర్వాత శివసేనకు మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తారని ఎన్సీపీ పార్టీ నేతలు చెబుతున్నారు. శరద్ పవార్ శివసేనకు మద్దతిచ్చే అవకాశాలు తక్కువనేది విశ్లేషకుల అంచనా. మొత్తం మీద పవార్ నిర్ణయంపైనే శివసేన భవిష్యత్తు ఆధారపడి ఉందన్నది వాస్తవం.

.

Tags:    

Similar News