అధినేత్రిగా మారనున్నారా?

తమిళనాడు రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కావాలని శశికళ భావిస్తున్నారు. ఈ మేరకు తన అనుచరులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. తాను రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించినా తనపై [more]

Update: 2021-04-19 17:30 GMT

తమిళనాడు రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కావాలని శశికళ భావిస్తున్నారు. ఈ మేరకు తన అనుచరులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. తాను రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించినా తనపై కక్ష సాధింపు చర్యలు ఆగకపోవడంతో శశికళ తిరిగి పాలిటిక్స్ లో యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక శశకళ అకస్మాత్తుగా తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాజకీయాల నుంచి వైదొలిగినా…?

రాజకీయాల నుంచి వైదొలిగినా శశికళ అన్నాడీఎంకే కు ఓటువేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆమె అన్నాడీఎంకేను వదులుకోవడానికి ఇష్టపడటం లేదని అర్ధమయింది. మే 2వ తేదీ తర్వాత శశికళ తన రాజకీయ భవిష్యత్ ను ప్రకటించే అవకాశముందంటున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకే అధికారంలోకి రావడం కష్టమే. పవర్ లోకి రాకపోతే పళనిస్వామి, పన్నీర్ సెల్వంల నాయకత్వంపై క్యాడర్ లోనూ, నేతల్లోనూ అనుమానం బయలుదేరుతుంది.

తనపై కక్ష సాధింపు చర్యలతో….

ఆ అనుమానాలను తనకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించాలని శశికళ డిసైడ్ అయ్యారు. అన్నాడీఎంకే ను తిరిగి తన అధీనంలోకి తెచ్చుకునేందుకు కూడా శశికళ ప్రయత్నాలు మొదలు పెడతారంటున్నారు. బీజేపీ కూడా శశికళకు మద్దతిచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య సయోధ్య కుదర్చిని బీజేపీ శశికళ రాకను కూడా స్వాగతించింది. కానీ పళనిస్వామి అంగీకరించకపోవడంతో బీజేపీ పెద్దల సూచనల మేరకే ఆమె రాజకీయాల నుంచి వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోంది.

బీజేపీ అండతోనే…?

ఇక ఎన్నికల వేళ తన ఓటును తొలగించడం వెనక కూడా పళనిస్వామి హస్తం ఉందని శశికళ వర్గీయులు ఆరోపిస్తున్నారు. కావాలనే తన పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారని శశికళ కసితో రగిలిపోతున్నారు. ఈ పరిణామం తర్వాతనే శశికళ ఆలోచనలో మార్పు వచ్చిందంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ముఖ్యులతో శశికళ సమావేశం కావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. మొత్తం మీద శశికళ అన్నాడీఎంకే అధినేత్రిగా మారేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News