శశికళ వచ్చే లోపే….?

శశికళ జైలు నుంచి బయటకు రాకముందే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ రెండుగా చీలిపోయేటట్లు కన్పిస్తుంది. ఇప్పటికే పార్టీలో విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. కొందరు పార్టీకి [more]

Update: 2019-09-19 18:29 GMT

శశికళ జైలు నుంచి బయటకు రాకముందే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ రెండుగా చీలిపోయేటట్లు కన్పిస్తుంది. ఇప్పటికే పార్టీలో విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. కొందరు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతుండగా, మరికొందరు పార్టీలో చీలిక తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టీటీవీ దినకరన్ అప్రమత్తమయ్యారు. శశికళ జైలు కెళ్లిన తర్వాత అన్నాడీఎంకే నుంచి ఆమెను బహిష్కరించడంతో చిన్నమ్మ మేనల్లుడు టీటీవీ దినకరన్ తమిళనాడులో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.

చిన్నమ్మను చూసే…..

అయితే పేరుకు దినకరన్ పార్టీని పెట్టినా చిన్నమ్మ శశికళను చూసే అనేక మంది ఆ పార్టీలో చేరారన్నది వాస్తవం. ఎందుకంటే జైలు నుంచి వచ్చిన తర్వాతైనా శశికళ అన్నాడీఎంకేను తిరిగి తమ చేతుల్లోకి తెచ్చుకుంటారన్న నమ్మకం. పళనిస్వామి, పన్నీర్ సెల్వంపై శశికళ జైలు నుంచి వచ్చిన తర్వాత తిరుగుబాటు తప్పదన్న విశ్వాసం. అందుకే దినకరన్ పార్టీ పెట్టగానే పోలో మంటూ అనేక మంది ముఖ్యనేతలు పార్టీలో చేరిపోయారు. అయితే గతకొంతకాలంగా దినకరన్ అనుసరిస్తున్న వ్యవహారశైలి నేతలకు మింగుడు పడటం లేదు.

దినకరన్ ను భరించలేక….

లోక్ సభ, శాసననసభ ఉప ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోక పోవడం, అత్యధిక స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో తంగ తమిళసెల్వన్ వంటి నేతలు పార్టీని వీడిపోయారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల్లో సయితం అత్యధిక మంది డీఎంకే గూటికి చేరుకున్నారు. మరికొంత మంది పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. వీరిలో కొందరు పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. శశికళకు తాము వ్యతిరేకం కాదని, దినకరన్ ఒంటెత్తు పోకడలను తాము తట్టుకోలేకపోతున్నామని కొందరు నేరుగానే చెబుతున్నారు.

రెండుగా చీలుతుందా?

ఈనేపథ్యంలో దినకరన్ అప్రమత్తమయ్యారు. నాయకత్వంపై తిరుగుబాటు చేసే అవకాశమున్న నేతలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత పుహళేందిని బయటకు పంపించాలని దినకరన్ నిర్ణయించినట్లు సమాచారం. అందుకే తన పార్టీకి సంబంధించిన ఐటీ విభాగం ద్వారా పుహళేందిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది పుహళేంది వర్గీయుల ఆరోపణ. దీంతో పుహళేంది కూడా డీఎంకే వైపు చూస్తున్నట్లుతెలుస్తోంది. మొత్తం మీద శశికళ జైలు నుంచి బయటకు వచ్చేసరికి పార్టీ ముఖ్యనేతలు ఎవరూ మిగలకపోవచ్చు. అలాగే పార్టీ రెండుగా చీలే అవకాశాలనూ కొట్టిపారేయలేం.

Tags:    

Similar News