అందుకే ఒప్పుకోవడం లేదా?

పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళ ఆరు నెలలుగా ఎవరినీ కలవడం లేదు. ములాఖత్ కు కూడా శశికళ అంగీకరించడం లేదు. సొంత పార్టీ నేతలను కూడా [more]

Update: 2020-12-06 18:29 GMT

పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళ ఆరు నెలలుగా ఎవరినీ కలవడం లేదు. ములాఖత్ కు కూడా శశికళ అంగీకరించడం లేదు. సొంత పార్టీ నేతలను కూడా ఆమె కలవకపోవడం చర్చనీయాంశమైంది. దినకరన్, లేదా పార్టీ నేతలు శశికళను కలసిన వెంటనే రాజకీయంగా ఏదో ఒక ప్రచారం జరుగుతోంది. శశికళ అన్నాడీఎంకేను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకోనున్నారని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన శక్తిగా అవతరించనున్నారని చిన్నమ్మ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

అతి ప్రచారం వల్లనే…..

ఈ ప్రచారం కారణంగా తనకు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని శశికళ భావిస్తున్నారు. న్యాయవాదులను కూడా శశికళ కలిసేందుకు ఇష్టపడటం లేదట. ఏదైనా ఉంటే లేఖ ద్వారానే తెలియజేస్తున్నారు. శశికళ నిజానికి నవంబరు నెలలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే పదికోట్లు జరిమానా చెల్లింపు ఆలస్యం కావడంతో అది వాయిదా పడింది. ఇటీవల పది కోట్ల జరిమానాను కూడా శశికళ తరుపున న్యాయవాదులు చెల్లించారు.

విడుదల కావాల్సి ఉన్నా…..

దీంతో శశికళ విడుదలవుతుందని అందరూ భావించారు. శశికళ 2017 ఫిబ్రవరి నుంచి అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఆమెకు పదికోట్ల జరిమానాతో పాటు నాలుగేళ్ల శిక్షను న్యాయస్థానం విధించింది. నాలుగేళ్ల శిక్ష పూర్తికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ సమయం ఉంది. అయితే జైలు జీవితం అనుభవిస్తున్న వారికి కర్ణాటక జైలు మాన్యువల్ ప్రకారం మూడు రోజులు నెలకు సెలవులు ఉంటాయి. వీటిని పెరోల్ ద్వారా అత్యవసర సమయంలో ఉపయోగించుకునే వీలుంది.

కొన్ని శక్తులు……

ఈ సెలవులు శశికళకు 129 రోజుల సెలవులు ఉన్నట్లు ఆమె తరుపున న్యాయవాదులు చెబుతున్నారు. శిక్షాకాలం నుంచి ఈ సెలవులను మినహాయించాలని కోరుతున్నారు. అంటే డిసెంబరులోనే శశికళ విడుదల కావాల్సి ఉంది. కానీ అవినీతి కేసులో జైలుకు వచ్చిన వారు పూర్తి శిక్షాకాలం ఉండాల్సి ఉంటుందని జైలు అధికారులు చెబుతున్నారు. దీంతో శశికళ ఫిబ్రవరి నెల వరకూ బయటకు వచ్చే అవకాశాలు లేవు. తనపై అతి ప్రచారం వల్లనే తనపై కొన్ని శక్తులు కక్ష కడుతున్నాయని శశికళ భావిస్తున్నారు. అందుకే ఆరునెలలుగా ఎవరినీ కలిసేందుకు శశికళ ఇష్టపడటం లేదు.

Tags:    

Similar News