పెద్దోళ్లు బంపర్ హిట్.. చిన్నోళ్లు అట్టర్ ప్లాప్

నేటి రాజకీయాల్లో వారసత్వం కంపల్సరీ. రాజకీయం అంటేనే వారసత్వంగా మారిపోయింది. ఎన్నికల వ్యయాన్ని భరించాలన్నా, క్యాడర్ ను మేపాలన్నా ఆర్థిక బలం అవసరం. అది కొందరికే ఉంటుంది. [more]

Update: 2020-03-05 06:30 GMT

నేటి రాజకీయాల్లో వారసత్వం కంపల్సరీ. రాజకీయం అంటేనే వారసత్వంగా మారిపోయింది. ఎన్నికల వ్యయాన్ని భరించాలన్నా, క్యాడర్ ను మేపాలన్నా ఆర్థిక బలం అవసరం. అది కొందరికే ఉంటుంది. నాయకత్వ లక్షణాలు లేకపోయినా ఆర్థిక బలం, వారసత్వం ఉంటే చాలు చాలా మంది లీడర్లయిపోతున్నారు. కానీ విజయనగరం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వారసులు ఎవరూ క్లిక్ కావడం లేదు. తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. తండ్రులను ఆదరించిన ప్రజలు వారసుల విషయానికి వచ్చే సరికి నో అనేస్తున్నారు.

జిల్లాలో సీనియర్ నేతలు….

విజయనగరం జిల్లాలో సీనియర్ నేతలు అన్ని పార్టీల్లో ఉన్నారు. వారు జిల్లాను ఒకప్పుడు శాసించారు. ఎందరికో రాజకీయ ఓనమాలు నేర్పించారు. కానీ తమ పిల్లల విషయానికి వచ్చేసరికి పూర్తిగా చేతులెత్తేశారు. జిల్లాలో అశోక్ గజపతిరాజు, పెనుమత్స సాంబశివరావజు, పతివాడ నారాయణస్వామిలు సీనియర్ నేతలు. వీరికి దాదాపు ఓటమి అనేది ఎరుగరు. అలాంటి వీరి వారసుల విషయంలో మాత్రం జనం రివర్స్ గా ఆలోచిస్తున్నారు.

అశోక్ కుమార్తె….

అశోక్ గజపతి రాజు విషయాన్ని తీసుకుంటే ఆయన జిల్లాను శాసించారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్. ఆయన మాట మీదనే జిల్లా పార్టీ నడిచేది. బంగ్లా నుంచే రాజకీయాలు నడిపేవారు. అలాంటి అశోక్ గజపతిరాజు వారసురాలు ఆదితి తొలి అటెంప్ట్ లోనే ఫెయిలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో విజయనగరం నుంచి తొలిసారి బరిలోకి దిగిన ఆదితి ఓటమి పాలయ్యారు. తండ్రి తర్వాత రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తారా? అన్నది అనుమానంగానే కన్పిస్తుంది. ప్రజలతో పెద్దగా సంబంధాలు లేకపోవడం, యువతరం వారసత్వాన్ని పెద్దగా ఇష్టపడకపోవడంతో ఆదితి ఎలా నెట్టుకొస్తారన్న సందేహాలు పార్టీలోనూ వ్యక్తమవుతున్నాయి.

పెనుమత్స తనయుడు…..

ఇక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ పెనుమత్స సాంబశివరాజు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ చరిత్ర ఈయనది. కాంగ్రెస్ పార్టీలోనూ, తర్వాత వైసీపీలో చేరి పెనుమత్స ఇప్పటికీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 1967 నుంచి 2004 వరకూ వరసగా ఎనిమిదిసార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. బొత్స సత్యనారాయణకు రాజకీయ గురువు. ఎంతోమందికి రాజకీయాలను పరిచయం చేశారు. కానీ తన కుమారుడి విషయంలో ఫెయిలయినట్లే కన్పిస్తుంది. 2014 ఎన్నికల్లో ఈయన కుమారుడు పెనుమత్స సూర్యనారాయణరాజుకు నెలిమర్ల నుంచి టిక్కెట్ ఇచ్చినా గెలవలేకపోయారు. 2019 ఎన్నికల్లో అసలు టిక్కెట్ దక్కకపోవడం విశేషం. ఇప్పటికీ జగన్ పెనుమత్స అంటే గౌరవం. ఆయనకు ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. పెద్దాయన రాజకీయాల్లో సూపర్ హిట్ అయినా ఆయన కొడుకు మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యారు.

పతివాడ పరిస్థితీ…..

ఇక నెలిమర్ల నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత పతివాడ నారాయణ స్వామి నాయుడు. ఈయన మొత్తం ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన వారసులు రాజకీయాల్లో రాణించలేక పోతున్నారు. పతివాడకు ముగ్గురు కుమారులుండగా చిన్న కుమారుడైన తమ్మినాయుడు మాత్రమే రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నారు. గత టీడీపీ హయాంలో తమ్మినాయుడుపై అనేక ఆరోపణలు రావడంతో తండ్రికి మంత్రి పదవి దక్కలేదన్న టాక్ కూడా ఉంది. మొత్తం మీద విజయనగరం జిల్లాలో సీనియర్ నేతల వారసులు ఏ మాత్రం రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు.

Tags:    

Similar News