వారెవ్వా…. క్యా బాత్ గురూ…!!!
కర్ణాటకలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సెంటిమెంట్ తో ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తే రెండు ప్రధాన పార్టీలకూ రాష్ట్రంలోనూ [more]
కర్ణాటకలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సెంటిమెంట్ తో ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తే రెండు ప్రధాన పార్టీలకూ రాష్ట్రంలోనూ [more]
కర్ణాటకలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సెంటిమెంట్ తో ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తే రెండు ప్రధాన పార్టీలకూ రాష్ట్రంలోనూ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బీజేపీకి ఎక్కువ స్థానాలు దక్కించుకుని కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇక్కడ సంకీర్ణ సర్కార్ ను కూలదోసే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించవచ్చన్నది కమలం పార్టీ ఆలోచన. ఇక కాంగ్రెస్ కూడా లోక్ సభ ఎన్నికలపైనే ఆశలుపెట్టుకుంది. దక్షిణాదిన బలం ఉన్న తమ రాష్ట్రంలో అధినేత రాహుల్ కు ప్రధాని అయ్యేందుకు అధిక స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఆశగా ఉంది. ఇక అతి తక్కువ స్థానాలు దక్కించుకున్న ముఖ్యమంత్రి కుమారస్వామి సయితం ఎక్కువ స్థానాలు తమ కూటమికి దక్కితే తన తండ్రి దేవెగౌడ మరోసారి ప్రధాని అయ్యే అవకాశముందని సెంటిమెంట్ ను కన్నడనాట రాజేశారు.
సర్జికల్ స్ట్రయిక్స్ తో…..
మొత్తం 28 పార్లమెంటు స్థానాలున్న కర్ణాటకలో 23కు తక్కువ కాకుండా సీట్లు కైవసం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆరాట పడుతోంది. ఇందుకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రమిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా తానే తీసుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లతో పాటు మరికొన్ని అదనంగా దక్కించుకోవాలన్న ఆశతో యడ్డీ ఉన్నారు. ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ మోదీ ఇమేజ్ ను పెంచాయని, ఈ సర్జికల్ స్ట్రయిక్స్ తమకు లోక్ సభ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని యడ్డీ వ్యాఖ్యానించడం కూడా సెంటిమెంట్ ను రాజేయడానికేనంటున్నారు. పాక్ కు సరైన బుద్ధి చెప్పేది బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని, పాక్ పై కసి తీర్చుకోవడంతో ఇప్పుడు తమ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారంటున్నారు.
రాహుల్ ను ప్రధానిని చేయాలని….
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాహుల్ ను ప్రధాని చేయాలన్న లక్ష్యంతోనే తాము ముందుకు వెళుతున్నామని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెబుతున్నారు. పొత్తులో భాగంగా తాము గెలిచే సీట్లను వదులుకోబోమని ఒకవైపు చెబుతూ క్యాడర్ లో జోష్ ను పెంచుతున్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని ఆయన వర్గం నమ్మకంగా ఉంది. అందుకే లోక్ సభ ఎన్నికల్లో వీలయినన్ని సీట్లను ఎక్కువగా రాహుల్ కు కానుకగా అందించాలని సిద్ధరామయ్య శ్రమిస్తున్నారు.
తండ్రి పీఎం అయ్యేందుకు….
ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి ఆలోచన కూడా తన తండ్రి ప్రధాని అయ్యే ఛాన్సులున్నాయంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లను సాధించలేదన్నది కుమారస్వమి నమ్మకం. కాంగ్రెస్ మిత్రపక్షాలే అధికంగా స్థానాలు సంపాదించి ప్రధాని ఎవరో నిర్ణయించే అవకాశముందంటున్నారు. దీంతో తన తండ్రి ప్రధాని అయ్యేందుకు అవకాశాలున్నాయని ఆయన బాహాటంగానే చెబుతున్నారు. 1996లో తమకు 16 స్థానాలు ఇచ్చి దేవెగౌడను ప్రధానిని చేయగలిగారని, ఈసారి కూటమికి ఎక్కువ స్థానాలు ఇచ్చి తన తండ్రికి పీఎం ఛాన్స్ ఇవ్వాలని, కన్నడిగుడిని ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాలని సెంటిమెంట్ తో ప్రజలకు ముందుకు వెళుతున్నారు.మరి కన్నడిగులు ఎవరిని ఆదరిస్తారో చూడాలి.