మార్కెట్ కు ముడిసరుకు

మానవుడే మహనీయుడు. శక్తియుతుడు.. యుక్తిపరుడు. మంచిని తలపెట్టినచో మనిషికడ్డులేదులే.. ’ అంటాడో సినీ కవి. మామూలు మనిషి మహాత్మునిగా ఎదిగిన తీరు, జాతి నీరాజనాలు అందుకోవడానికి సాగించిన [more]

Update: 2019-10-04 18:29 GMT

మానవుడే మహనీయుడు. శక్తియుతుడు.. యుక్తిపరుడు. మంచిని తలపెట్టినచో మనిషికడ్డులేదులే.. ’ అంటాడో సినీ కవి. మామూలు మనిషి మహాత్మునిగా ఎదిగిన తీరు, జాతి నీరాజనాలు అందుకోవడానికి సాగించిన ప్రస్థానం ఆదర్శప్రాయమే కాదు, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం. తన జీవితాన్నే సందేశం చేసి భారత జాతికే కాదు, ప్రపంచానికే విలువైన సిద్దాంతాన్ని అందించారు మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా మొదలు నేటితరం బరాక్ ఒబామా వరకూ ఎందరిలోనో ప్రేరణనింపిన వ్యక్తి . భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక ఐకానిక్ నాయకుడు. మరణించి ఏడు దశాబ్దాలు గడచినా ఆయనను స్మరించుకోకుండా దేశ రాజకీయాలు ముందుకు నడవడంలేదంటేనే ఆయన వేసిన ముద్ర ఎంతటి ప్రభావవంతమైనదో అర్థమవుతుంది. పాప్యులారిటీ కోణంలో అందరూ ఆయన పేరును వాడుకోవడమే తప్ప ప్రవచించిన సిద్దాంతాలను పాటించేవారే కరవు అయ్యారు. అదే నేటి లోపం. దేశానికి శాపంగా మారింది.

సిద్ధాంతరహిత రాజకీయాలు…

ఈ సమాజాన్ని నడిపేది రాజకీయమే. అది ప్రజాస్వామ్యం కావచ్చు. నియంతృత్వం కావచ్చు. విధానమేదైనా పాలిటిక్స్ తోనే పాలన సాగుతుంది. విలువలతో కూడిన సిద్ధాంతం ప్రాతిపదికగా ఉన్నప్పుడే ప్రజలకు ప్రయోజనదాయకమవుతుంది. లేకపోతే వ్యక్తిస్వార్థానికి తప్ప వ్యవస్థకు మంచి చేకూరదు. సిద్ధాంతం లేని రాజకీయాన్ని సప్తమహాపాతకాల్లో ఒకటిగా తనదైన రీతిలో నిర్వచించారు గాంధీజీ. చీటికీమాటికీ ఆయన పేరు చెబుతూ బ్రతికేసే నేతలు నైతిక విలువలకు నీళ్లొదిలేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు. ఒక పార్టీ తరఫున ఎన్నికై వేరే పార్టీలో చేరిపోవడం, కోట్ల రూపాయలు కుమ్మరించి ఓట్లు కొనుగోలు చేయడం, కాంట్రాక్టులు మొదలు మాఫియాల వరకూ వాటాలు తీసుకోవడం వంటివన్నీ నేటిరాజకీయాల్లో సర్వసాధారణ విషయాలుగా మారిపోయాయి. ఏ పార్టీ కూడా ఇందుకు అతీతంగా లేదు. పాపాలు చేయడంలో పాళ్లు మారతాయి. హెచ్చుతగ్గులే తప్ప అందరు నేతలూ ఆ తాను ముక్కలే. అందుకే నైతికంగా గాంధీ పేరును ఉచ్చరించే అర్హతనే కోల్పోయారు. కానీ మాటకు ముందు వెనక ఆయన నామజపంతోనే నయవంచన చేసేస్తుంటారు. ఈ కపట నాటక విన్యాసాల నుంచి దేశం బయటపడలేకపోతోంది. గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే వారికంటే ఆయనను మార్కెట్ ముడిసరుకుగా వాడుకునే నాయకులే ఎక్కువగా కనిపిస్తారు.

మార్గమూ ముఖ్యమే…

‘ఒక లక్ష్యాన్ని సాధించాలన్నా, గమ్యాన్ని చేరుకోవాలన్నా అందుకు అనుసరించే మార్గమూ ముఖ్యమే’ అంటారు గాంధీజీ. నేటి తరం నేతలకు అస్సలు నచ్చని సూత్రమిది. అధికారంలో కొనసాగడమే అంతిమ లక్ష్యంగా భావిస్తున్నారు. సామదానభేదోపాయాలతో ప్రజాప్రతినిధులనే కొనుగోళ్లు చేసేస్తున్నారు. ప్రజాభిప్రాయం, ఎన్నికల తీర్పు వంటివి పరిహాసాస్పదంగా మారిపోయాయి. అధికారం తెచ్చుకోవడమే పరమావధి. అందుకు ఏ మార్గం అనుసరించినా ఫర్వాలేదనుకునే స్థాయికి దిగజారిపోయింది రాజకీయం. ప్రపంచంలోని అంతమంది ప్రముఖులు గాంధీజీని అనుసరించారంటే కారణం మాటకు, కార్యాచరణకు మధ్య వ్యత్యాసం లేకపోవడమే. ప్రస్తుతం నేతలు చెప్పేదొకటి. చేసేదొకటి. ఒక్కసారి కూడా అధికారాన్ని చేపట్టకపోయినప్పటికీ గాంధీజీకి మాత్రమే దేశంలో అంతటి పేరు ప్రఖ్యాతులు ఎలా సాధ్యమయ్యాయనే కోణంలో ఆలోచిస్తే చాలు అసలు విషయం అర్థమైపోతుంది. నైతిక నిబద్ధతే ఆయనకు ప్రపంచ నాయకత్వాన్ని కట్టబెట్టింది. జాతీయోద్యమంతో ప్రపంచాన్ని ప్రేరేపించగలిగారు. పవర్ తో నిమిత్తం లేని ప్రభావశీలతను చూపగలిగారు.

నైతికత లోపించిన వ్యాపారం….

పర్యావరణాన్ని, ప్రక్రుతిని, ఎదుటి వ్యక్తుల ప్రాణాలను బలి పెడుతూ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తున్నారు. రాజకీయ నాయకుల ఆశ్రిత పెట్టుబడి దారీ విధానాలు విచ్చలవిడితనానికి బాటలు వేస్తున్నాయి. నైతికత లోపించిన వ్యాపారమూ పాపమే అనేది మహాత్ముని మాట . అసలు నేటి కార్పొరేట్ వ్యాపారంలో విలువలు, ప్రజల ప్రాణాలకు భద్రత అన్నది ఉందా? అంటే సందేహమే. ఉపాధి ముసుగులో దోపిడీ సాగుతోంది. భవిష్యత్ తరాలపై నీలిమేఘాలు కమ్ముకునే భయంకరక్రీడ సాగిపోతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, ప్రజల్లో రోగాలు పెరిగిపోవడం కార్పొరేట్ అత్యాశకు నిదర్శనలు. విద్య,వైద్యం వంటి ప్రాథమిక పౌర హక్కుల చుట్టూ భయంకరమైన విషవలయం అలుముకుంది. అటు వ్యాపారమో, ఇటు సేవయో ,జాతికి నిర్దేశించిన ప్రాథమిక హక్కో తెలియని దౌర్భాగ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి కీలకరంగాలు. కల్తీ, అక్రమాలు, అధిక ధరల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. నివాళులర్పించామా? ఆయన పేరిట నాలుగు మంచి మాటలు చెప్పేశామా? చాలు. ఆయన చూపిన మార్గం అనుసరించాల్సిన అవసరం లేదని నేతలు ఫిక్స్ అయిపోయారు. బాపూ, నీబాటను నడిచే బలమివ్వు, అని ఏ ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రార్థించడం లేదు. సర్వకాల, సర్వావస్థలకు వర్తించే ఆయన సూత్రాలను పాటించడం లేదు. అందుకే 150 వ పుట్టిన రోజున మహాత్మా , మన్నించు అంటూ వేడుకోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయత భరత జాతిలో తాండవిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News