వేలు పెట్టడంలో ఘనా పాఠి… వైసీపీ ఎమ్మెల్యేలే?

వైఎస్సార్ సీపీలో షాడో నేత ఒక‌రు గుంటూరుపై దృష్టి పెట్టార‌ని, ఆయ‌న క‌నుస‌న్నల్లోనే అన్నీ జ‌రుగుతున్నాయ‌ని పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న ఏకంగా జ‌గ‌న్‌కు [more]

Update: 2020-07-26 05:00 GMT

వైఎస్సార్ సీపీలో షాడో నేత ఒక‌రు గుంటూరుపై దృష్టి పెట్టార‌ని, ఆయ‌న క‌నుస‌న్నల్లోనే అన్నీ జ‌రుగుతున్నాయ‌ని పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న ఏకంగా జ‌గ‌న్‌కు బంధువేన‌ని అంటున్నారు. ఆయ‌న వ్యవ‌హార‌శైలితో నేత‌ల మ‌ధ్య వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయ‌ని అంటున్నారు. దీంతో ఈ విష‌యం హాట్‌టాపిక్‌గా మారింది. విష‌యంలోకి వెళ్తే.. వైఎస్సార్ సీపీలో ఆది నుంచి కూడా కొంచెం దూకుడుగా ఉండే నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు వైవీ సుబ్బారెడ్డి. గ‌తంలో ఒంగోలు ఎంపీగా ఉన్న స‌మ‌యంలో జిల్లా రాజ‌కీయాల‌న్నీ త‌న క‌నుస‌న్నల్లోనే సాగాల‌ని ప‌ట్టుబ‌ట్టి వివాదానికి కేంద్రంగా మారారు.

వేలు పెడుతూ….

దీంతో ఏకంగా జ‌గ‌న్ ఆయ‌న‌కు గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టికెట్ కూడా ఇవ్వకుండా ప‌క్కన‌పెట్టి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక టీటీడీ బోర్డు చైర్మన్‌ను చేశారు. దీంతోపాటు ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌ ఇంచార్జ్‌గా బాధ్యత‌లు అప్పగించారు. ఈ రెండింటి వ‌ర‌కే ప‌రిమితం కావాల్సిన ఆయ‌న త‌న‌కు సంబంధం లేని గుంటూరు రాజ‌కీయాల్లోనూ వేలు పెడుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రధానంగా గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో వైవీ సుబ్బారెడ్డి వేలు పెడుతున్నార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. నామినేటెడ్ ప‌ద‌వులు స‌హా రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వుల విష‌యంలో ఆయ‌న ప్రమేయం ఉంటోంద‌నే ప్రచారం ఎక్కువ‌గా వినిపిస్తోంది.

చిన్న పాటి గ్యాప్ రావడంతో…

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల‌తు ఆయ‌న‌తో ఉన్న ప‌రిచ‌యాలు, చ‌నువు నేప‌థ్యంలో ప‌ద‌వుల కోసం వైవీ సుబ్బారెడ్డితోనే లాబీయింగ్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక్కడే మ‌రో చ‌ర్చ కూడా ఉంది. వాస్తవానికి గుంటూరు జిల్లా బాధ్యత‌లు జ‌గ‌న్ స‌జ్జల రామ‌కృష్ణారెడ్డికి అప్పగించారు. నిన్న మొన్నటి వ‌ర‌కు వైవీ సుబ్బారెడ్డి సొంత జిల్లా ప్రకాశం జిల్లా బాధ్యత‌లు కూడా స‌జ్జలే చూసుకునే వారు. రెండు రోజుల క్రిత‌మే ఈ బాధ్యత‌లు జ‌గ‌న్ వేమిరెడ్డి ప్రభాక‌ర్ రెడ్డి చేతిలో పెట్టారు. ఇక ప్రకాశం జిల్లా బాధ్యత‌లు స‌జ్జల చూసిన‌ప్పుడు వైవీ సుబ్బారెడ్డి సూచ‌న‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోలేద‌న్న టాక్ ఉంది. అక్కడ వీరి మ‌ధ్య చిన్నపాటి గ్యాప్‌న‌కు కార‌ణ‌మైంద‌ని అంటున్నారు. ఇక ఇప్పుడు వైవీ త‌న స‌త్తా ఏంటో స‌జ్జల ఇన్‌చార్జ్‌గా ఉన్న గుంటూరు జిల్లాలో చూపించేందుకు రెడీ అయ్యార‌ట‌.

వీసీ నియామకంలో…..

ఇక తాజాగా మ‌రో వివాదంతో ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి గుంటూరు జిల్లా వైసీపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. గుంటూరు జిల్లాకు త‌ల‌మానిక‌మైన నాగార్జున యూనివ‌ర్సిటీ వైస్ చాన్సెల‌ర్ నియామ‌కంలో వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఉంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఇంచార్జ్ వీసీని నియ‌మించారు. ఈయ‌న‌ను నియ‌మించాల‌ని వైవీ సిఫార‌సు చేసిన‌ట్టు అప్పట్లోనే ప్రచారం జరిగింది. దీంతో వీసీ ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి క‌నుస‌న్నల్లోనే న‌డుస్తున్నార‌ట‌. ఆ వీసీ వైవీని త‌ప్ప మ‌రెవ‌రినీ లెక్క చేయ‌డం లేద‌ని అంటున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలే…..

నిజానికి ఈ యూవ‌నిర్శిటీ అటు పొన్నూరు, ఇటు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల‌కు మ‌ధ్యలో ఉంది. దీంతో వ‌ర్సిటీలో ఏ కార్యక్రమం నిర్వహించినా.. ప్రొటోకాల్ ప్రకారం ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల‌ను ఆహ్వానించాలి. కానీ, వీసీ మాత్రం వైవీ సుబ్బారెడ్డిని పిలుస్తున్నార‌ని, అసలు ఆయ‌న‌కు, జిల్లాకే సంబంధం లేన‌ప్పుడు ఆయ‌న‌ను ఎలా పిలుస్తార‌ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశ‌య్య ఈ విష‌యంపై తీవ్రంగా రుస‌రుస లాడుతున్నార‌ట‌. మ‌రి గుంటూరులో వైవీ సుబ్బారెడ్డి రాజ‌కీయానికి జ‌గ‌న్ చెక్ పెడ‌తారా ? లేదా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News