తేడా కొడుతుందా?

మహారాష్ట్ర ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే ఎన్పీపీ, మిగిలిన చిన్నా చితకా పార్టీలతో పొత్తుల చర్చలు పూర్తి చేసింది. సీట్ల [more]

Update: 2019-09-17 17:30 GMT

మహారాష్ట్ర ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే ఎన్పీపీ, మిగిలిన చిన్నా చితకా పార్టీలతో పొత్తుల చర్చలు పూర్తి చేసింది. సీట్ల పంపిణీ కూడా దాదాపు పూర్తయింది. అయితే మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం పొత్తులపై ఇంకా చర్చలు ప్రారంభించలేదు. పైగా శివసేన శత్రువుగా భావిస్తున్న నారాయణ రాణేను బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాలు చేయడం సేన ఆగ్రహానికి కారణమయింది. దీంతో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఒంటరిగానైనా పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని పిలుపునివ్వడం ఆసక్తిని రేపుతోంది.

లోక్ సభ ఎన్నికల్లో…..

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శివసేన, భారతీయ జనతా పార్టీలు కలసి పోటీ చేశాయి. ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నేరుగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను కలసి చర్చించడంతో పొత్తు కుదిరింది. అంతకు ముందు ఉద్ధవ్ థాక్రే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. అయినా చివరకు వచ్చేసరికి శివసేన, బీజేపీలు పొత్తు కుదుర్చుకున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పొత్తు మెరిసింది. మొత్తం 48 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 23 స్థానాల్లోనూ, శివసేన 18 స్థానాల్లోనూ గెలిచింది.

అనుకూలంగానే కన్పించినా….

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన ఉద్ధవ్ థాక్రే టోన్ మారింది. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేసిన తర్వాత మోదీ ప్రభుత్వాన్ని థాక్రే ప్రశంసలతో ముంచెత్తారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో సయితం సంపాదకీయంలో మోదీ సర్కార్ ను ఆకాశానికెత్తేసింది. లోక్ సభ ఎన్నికల సమయంలో జరిగిన చర్చల్లోనే అసెంబ్లీ ఎన్నికలకు కూడా కలసి వెళదామని నిర్ణయించారు. ఈ మేరకు అమిత్ షా, ఉద్ధవ్ థాక్రే ఒక నిర్ణయానికి వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సయితం శివసేన పొత్తు ఉండాల్సిందేనంటున్నారు.

అడ్డం తిరిగారు…..

ఇటువంటి పరిస్థితుల్లో ఉద్ధవ్ థాక్రే పొత్తులపై అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శివసేన అడిగే సీట్లను ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేదన్న సంకేతాలు ఉద్ధవ్ థాక్రేకు అందాయి. అందుకే ఒంటరి పోరుకు సిద్ధమవ్వాలని పార్టీనేతలకు చెప్పినట్లు సమాచారం. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా శివసేన 140 స్థానాలను కోరుతుంది. అంటే దాదాపు సగం స్థానాలను శివసేనకు ఇవ్వాలన్న మాట. అయితే బీజేపీ మాత్రం 120 సీట్లు ఇస్తామని చెబుతోంది. 140 సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని ఉద్ధవ్ థాక్రే బీజేపీకి హెచ్చరికలు పంపినట్లయింది. మరి బీజేపీ అధిష్టానం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News