సిద్ధూ గుగ్లీ వేశారుగా

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను అనుకున్నది చేస్తారు. తనను వ్యతిరేకించే వారిని అవకాశమొచ్చినప్పుడు అణిచివేయడానికే ప్రయత్నిస్తారు. గత పధ్నాలుగు నెలల్లో తనను ఇబ్బంది పెట్టిన డీకే శివకుమార్ [more]

Update: 2020-01-15 18:29 GMT

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను అనుకున్నది చేస్తారు. తనను వ్యతిరేకించే వారిని అవకాశమొచ్చినప్పుడు అణిచివేయడానికే ప్రయత్నిస్తారు. గత పధ్నాలుగు నెలల్లో తనను ఇబ్బంది పెట్టిన డీకే శివకుమార్ కు పీసీసీ పగ్గాలు అందకుండా సిద్ధరామయ్య గట్టిగానే పావులు కదిపారు. ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య అధిష్టానంతో మంతనాలు జరిపారు. డీకే శివకుమార్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ మరింత ఇబ్బందులపాలవుతుందని తన అభిప్రాయాన్ని చెప్పేసి వచ్చారు.

ట్రబుల్ షూటర్ గా…

డీకే శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయన ఎన్నో సంక్షోభాల సమయంలో పార్టీని ఆదుకున్నారు. పార్టీ శాసనసభ్యులను ప్రత్యర్థి పార్టీల వలలో చిక్కుకోకుండా తెగించి మరీ పోరాడారు. తనపై ఈడీ కేసులు నమోదవుతాయని తెలిసినప్పటికీ డీకే శివకుమార్ పార్టీ కోసం పనిచేశారు. అందుకే డీకే శివకుమార్ ఈడీ కేసులో జైలులో ఉన్నప్పుడు స్వయంగా సోనియాగాంధీ వెళ్లి పరామర్శించి వచ్చారు. కానీ అదే రాష్ట్రానికి చెందిన సిద్ధరామయ్య పలకరించనే లేదు.

పథ్నాలుగు నెలల్లో….

జేడీఎస్, కాంగ్రెస్ పథ్నాలుగు నెలల పాలనలో సిద్ధరామయ్యను ఇబ్బంది పెట్టింది డీకే శివకుమార్ అంటారు. తన మాట చెల్లుబాటు కాకుండా డీకే శివకుమార్, పరమేశ్వర కలసి అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామితో నడిచి తనను ఇబ్బందుల పాలు చేశారని సిద్ధరామయ్య ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత పీసీసీ చీఫ్ గా దినేష్ గుండూరావు రాజీనామా చేయడంతో ఆ పదవి కోసం డీకే శివకుమార్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. స్వయంగా డీకే వెళ్లి సిద్ధరామయ్యను కలసి మద్దతును కూడా కోరారు. సిద్ధరామయ్య నవ్వుతూనే డీకేతో చర్చించినా తన అభిప్రాయాన్ని మాత్రం అధిష్టానం వద్ద కుండబద్దలు కొట్టేశారు.

చెక్ పెట్టేందుకు…..

సిద్ధరామయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఎంబీ పాటిల్ కు ఇవ్వాలని గట్టిగా హైకమాండ్ కు చెప్పినట్లు తెలిసింది. యడ్యూరప్ప లింగాయత్ వర్గానికి చెందిన వాడు కావడంతో అదే వర్గానికి చెందిన ఎంబీ పాటిల్ ను ముందుంచి పోరాడాలని సిద్ధరామయ్య తన వ్యూహాన్ని అధిష్టానం ముందుంచినట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో లింగాయత్ వర్గాన్ని ఆకట్టుకోవాలన్నా, పార్టీ పటిష్టంగా ఉండాలన్నా ఎంబీ పాటిల్ కే పీసీసీ పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య చెప్పిరావడంతో డీకే శివకుమార్ కు చెక్ పడినట్లేనని అంటున్నారు. మొత్తం మీద సిద్ధూ గుగ్లీకి డీకే శివకుమార్ అవుట్ అవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News