ఇంకా ఆశ చావలేదే?

కర్ణాటకలో సీనియర్ నేత సిద్ధరామయ్య. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య ఒక రకంగా రికార్డు సృష్టించారనే చెప్పాలి. జనతాదళ్ ఎస్ లో రాజకీయ ప్రస్థానాన్ని [more]

Update: 2020-11-02 18:29 GMT

కర్ణాటకలో సీనియర్ నేత సిద్ధరామయ్య. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య ఒక రకంగా రికార్డు సృష్టించారనే చెప్పాలి. జనతాదళ్ ఎస్ లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సిద్ధరామయ్య ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఐదేళ్ల పాటు కొనసాగిన ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన కాంగ్రెస్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. కర్ణాటకలో బీజేపీని నిలువరించడంలో సిద్ధరామయ్య సక్సెస్ అయ్యారని కాంగ్రెస్ కూడా భావించి ఆయనను కొనసాగించింది.

బీజేపీని నిలువరించడానికి…..

గత ఎన్నికల సమయంలో కూడా బాధ్యతనంతా సిద్ధరామయ్య పైనే పెట్టారు. అయితే రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించింది. దీంతో తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని, ఇవే తన చివరి ఎన్నికలని సిద్ధరామయ్య గత ఎన్నికల సమయంలో పదే పదే చెప్పారు. సిద్ధరామయ్య రెండు చోట్ల పోటీ చేసి ఒకచోట మాత్రమే గెలిచారు. బీజేపీని నిలువరించడానికి సిద్ధరామయ్యకు ఇష్టం లేకున్నా కుమారస్వామిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది.

తిరిగి కాంగ్రెస్ వస్తుందని….

తాజాగా పీసీసీ అధ్యక్షుడి విషయంలో కూడా సిద్ధరామయ్య సిఫార్సులను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను పీసీసీ చీఫ్ గా నియమించింది. ఈ నియామకం కూడా సిద్ధరామయ్యకు ఇష్టం లేదు. అయినా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిద్ధరామయ్య సర్దుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి యడ్యూరప్ప నాయకత్వం ఉండదు కాబట్టి తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు.

కాంగ్రెస్ లో అలజడి…..

అందుకే ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను ముఖ్యమంత్రిని అయితే పేదలకు పది కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తానని సిద్ధరామయ్య చెప్పడం పార్టీలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వర్గంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనికి డీకే కూడా కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది పక్కన పెట్టి ముందు కాంగ్రెస్ ను గెలిపించడంపైనే దృష్టి పెట్టాలని అన్నారు. మొత్తం మీద సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి పదవి ఆశలు పెట్టుకున్నారన్న విషయంలో ఉప ఎన్నికల ప్రచారంలో స్పష్టమైంది.

Tags:    

Similar News