వద్దు మొర్రో అంటున్న వినరు కదా?

వద్దు మొర్రో రైళ్ళు అప్పుడే అని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫెరెన్స్ భేటీలో తేల్చి చెప్పారు. కేంద్రం వీరి మాటలు పెడచెవిన [more]

Update: 2020-05-14 11:00 GMT

వద్దు మొర్రో రైళ్ళు అప్పుడే అని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫెరెన్స్ భేటీలో తేల్చి చెప్పారు. కేంద్రం వీరి మాటలు పెడచెవిన పెట్టింది. శ్రామిక్ రైళ్లతో పాటు దేశంలో పలు ప్రాంతాలకు రైళ్ళను నడిపే నిర్ణయం తీసుకుని 15 రైళ్లతో పని మొదలు పెట్టేసింది. రాజధాని రైళ్లు పేరుతో దేశవ్యాప్తంగా వీటి పరుగు ప్రారంభం అయింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో లాక్ డౌన్ తో చిక్కుకున్న వారంతా విహంగాల్లా తమ సొంత గూటి వైపు పరిగెట్టేశారు. ఇప్పుడు వీరిలో కొందరికి కరోనా పాజిటివ్ ఉండటంతో ఇప్పుడిప్పుడే వైరస్ కష్టాల్లో నుంచి బయటపడుతున్న రాష్ట్రాల్లో మరోసారి కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం మొదలైంది.

ఎపి, తెలంగాణల్లో వారితో తంటా….

నిన్నమొన్నటివరకు ఢిల్లీ జమాతే వారితో కిందా మీదా పడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఆ కేసుల నుంచి బయట పడుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని వర్గాలు పగలు రాత్రి శ్రమించాయి. వైద్య వర్గాలు ప్రాణాలు ఒడ్డి పాజిటివ్ కేసు బాధితులకు ప్రాణం పోస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైళ్లనుంచి వస్తున్న వారిలో కరోనా పాజిటివ్ కేసులు వస్తుండటం అందరిలో దడ పుట్టిస్తుంది. అయితే అదృష్టం కొద్ది వీరందరిని క్వారంటైన్ చేస్తూ పరీక్షలు చేస్తూ ఉండటం గుడ్డిలో మెల్ల మాత్రమే. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు ల నుంచి వచ్చే రైల్వే ప్రయాణికుల తోనే ప్రమాదం పొంచి ఉంటుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో అధికార యంత్రాంగాలు పూర్తిగా అప్రమత్తం అయ్యి వీరిపై ఫోకస్ పెంచి టెస్ట్ లు చేయడంతో పాటు క్వారంటైన్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి.

ఈ కేసులకు వారు తోడు …

వీరితో పాటు తమిళనాడు కోయంబేడు మార్కెట్ కాంటాక్ట్స్ అందరిలో కలవరం పెంచుతున్నాయి. ఈ రెండిటికి తోడు వందే భారత్ పేరిట దేశంలోకి అడుగు పెట్టనున్న విదేశాల్లో చిక్కుకున్న స్వదేశీయులు వైరస్ కేసుల సంఖ్యను మరింత పెంచడం ఖాయం కానుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ మినహాయింపులతో స్వేచ్ఛా విహంగాలు గా రోడ్డెక్కుతున్న వారు తగిన జాగ్రత్తలు నిర్లక్ష్యం వహించకుండా తీసుకోవడం అత్యంత ముఖ్యం. ఇక ఎవరి ప్రాణాలు వారే కాపాడుకుంటూ, వారి కుటుంబాన్ని, సమాజాన్ని రక్షించాలి. తప్పదు మరి.

Tags:    

Similar News