చిక్కుల్లో సోమిరెడ్డి.. పెనం మీద నుంచి పొయ్యిలోకి

ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయం రాజ‌కీయ పెనుకుదుపుల‌కు కార‌ణంగా మారుతోంది. జిల్లాల విభ‌జ‌న లేదా కొత్త జిల్లాల ఏర్పాటు విషయం.. ఇటు వైఎస్సార్ సీపీలోని కొంద‌రు [more]

Update: 2020-08-07 02:00 GMT

ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయం రాజ‌కీయ పెనుకుదుపుల‌కు కార‌ణంగా మారుతోంది. జిల్లాల విభ‌జ‌న లేదా కొత్త జిల్లాల ఏర్పాటు విషయం.. ఇటు వైఎస్సార్ సీపీలోని కొంద‌రు నేత‌లకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంటే.. ప్రతిప‌క్షంలో ఉన్న టీడీపీ నాయ‌కుల‌కు చ‌లి జ్వరం వ‌చ్చేలా చేస్తోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విష‌యం చ‌ర్చనీయాంశంగా మారింది. ఇక జిల్లాల విభ‌జ‌న అంశం తెర‌మీద‌కు రావ‌డంతో అధికార వైఎస్సార్‌సీపీతో పాటు విప‌క్ష టీడీపీ నేత‌ల గుండెళ్లోనూ రైళ్లు ప‌రిగెడుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ జిల్లాల విభ‌జ‌న ఇప్పుడు విప‌క్ష పార్టీకి చెందిన ఓ సీనియ‌ర్ నేత‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంద‌ట‌. విష‌యంలోకి వెళ్తే.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డికి.. జిల్లాల విభ‌జ‌న లేదా కొత్త జిల్లాల ఏర్పాటుతో మ‌రిన్ని రాజ‌కీయ చిక్కులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

జిల్లాల ఏర్పాటుతో….

ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోక‌వ‌ర్గం నుంచి వ‌రుస ఓట‌ముల‌తో కునారిల్లుతున్నార‌నే చెప్పాలి. నిజానికి జిల్లా టీడీపీలో ప‌ట్టు ఉన్నప్పటికీ.. రెడ్డి సా‌మాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న నాయ‌కుడు అయిన‌ప్పటికీ.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌మిబాట‌లో న‌డుస్తున్నారు. వ‌రుస ఓట‌ముల‌తో ఆయ‌న కేడ‌ర్‌లోనూ ప‌ట్టును కోల్పోతున్నారు. ఈ వ‌రుస ఓట‌ములు గ‌త ఎన్నిక‌ల‌తో వ‌రుస‌గా ఐదోసారికి చేరుకున్నాయి. నాలుగు సార్లు స‌ర్వేప‌ల్లి నుంచి.. మ‌ధ్యలో ఓ సారి కోవూరు ఉప ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న మంత్రిగా ఉండి.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌రీ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. సింప‌తీ కోసం చేసిన ప్రయ‌త్నాలు కూడా సోమిరెడ్డికి ఫ‌లించ‌లేదు. అయితే, ఇప్పుడు జిల్లాల ఏర్పాటుతో సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డికి మ‌రిన్నిరాజ‌కీయ క‌ష్టాలు రానున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అక్కడకు వెళితే….

ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న స‌ర్వేప‌ల్లి.. జిల్లాల ఏర్పాటుతో తిరుప‌తి పార్లమెంటు జిల్లాగా ఏర్పడే కొత్త జిల్లాలోకి మారుతుంది. అంటే.. ఇప్పటి వ‌ర‌కు సోమిరెడ్డి చ‌క్రం తిప్పిన నెల్లూరు జిల్లాలో ఆయ‌న హ‌వా పూర్తిగా కోల్పోతారు. పైగా కొత్తగా ఏర్ప‌డే తిరుప‌తి జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి అడుగులు ముందుకు సాగే అవ‌కాశం ఉంటుందా? అనేది ప్రశ్నార్థకం. పైగా ఈ తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వ్‌‌డ్‌ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం.. ఇక్కడ రెడ్డి వ‌ర్గం నేత‌ల‌తో పాటు బ‌లిజ వ‌ర్గం నేత‌లు కూడా ఎక్కువుగా ఉండ‌డంతో సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా కూడా సోమిరెడ్డికి గట్టి పోటీ ఉంటుంది.

పట్టున్న ప్రాంతం నుంచి…..

ఇక తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం అయితే వైసీపీ నుంచి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి లాంటి బ‌ల‌మైన నేత‌ల నుంచి కూడా సోమిరెడ్డికి పోటీ త‌ప్పదు. చెవిరెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే అయినా ఆయ‌న‌కు తిరుప‌తిలో బ‌ల‌మైన వ‌ర్గం ఉంది. పైగా వీరు ఫైర్ బ్రాండ్‌లుగా ముద్ర వేయించుకున్నారు. ఇలాంటి వారి మ‌ధ్యలో త‌న‌ను తాను నిరూపించుకోవ‌డం .. టీడీపీని గాడిలో పెట్టడం వంటివి సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డికి అగ్ని ప‌రీక్షే అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే స‌మ‌యంలో మూడు ద‌శాబ్దాలుగా నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి చేసిన రాజ‌కీయంతో ఆయ‌న‌కు ఇక్కడ మంచి గ్రిప్ ఉంది. ఇప్పుడు నెల్లూరు లోక్‌స‌భ ప‌రిధిలో ఉన్న సెగ్మెంట్లలో ఆయ‌న ప‌ట్టు త‌గ్గుతుంది. జిల్లా మారితే ఇక్కడ టీడీపీ నేత‌లు కూడా సోమిరెడ్డి ఆధిప‌త్యం అంగీక‌రించ‌రు. టీడీపీ నేత‌ల్లోనే సోమిరెడ్డికి చాలా మందితో పొస‌గ‌ని ప‌రిస్థితి ఉంది. ఏదేమైనా అస‌లే క‌ష్టాల్లో ఉన్న సోమిరెడ్డి జ‌గ‌న్ జిల్లాల విభ‌జ‌న నిర్ణ‌యంతో మ‌రింత డిఫెన్స్‌లోకి వెళ్లడం ఖాయం. ఈ స‌వాళ్లను దాటుకుని ఆయ‌న ఎలా ? ముందుకు వెళ‌తారో ? చూడాలి.

Tags:    

Similar News