సోమిరెడ్డి అక్కడి నుంచి బయటకు వస్తున్నారట

టీడీపీలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డిది ఒడిదుడుకుల ప్రస్థానం. ఎప్పుడో రెండున్నర ద‌శాబ్దాల క్రింద‌ట ఓ వెలుగు వెలిగిన సోమిరెడ్డి నాడు చంద్రబాబు హ‌యాంలో మంత్రిగా ఉన్నారు. [more]

Update: 2020-12-10 03:30 GMT

టీడీపీలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డిది ఒడిదుడుకుల ప్రస్థానం. ఎప్పుడో రెండున్నర ద‌శాబ్దాల క్రింద‌ట ఓ వెలుగు వెలిగిన సోమిరెడ్డి నాడు చంద్రబాబు హ‌యాంలో మంత్రిగా ఉన్నారు. సోమిరెడ్డికి 1994, 1999లో గెలిచిన గెలుపులు.. నాడు మంత్రిగా ఉన్నప్పటి మెరుగులు త‌ప్ప ఆ త‌ర్వాత ఆయ‌నకు రాజ‌కీయంగా ఒరిగిందీ లేదు.. ఆయ‌న పార్టీలో ఉన్నా పార్టీకి ఉప‌యోగం కూడా లేద‌న్నట్టుగా ఉంది. ఆయ‌న రాజ‌కీయ వైభ‌వం అంతా రెండున్నర ద‌శాబ్దాల క్రింద‌టే ముగిసిపోయింద‌నుకోవాలి. 2004 ఎన్నిక‌ల నుంచి 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు సోమిరెడ్డి ఐదుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ ఓడిన 2004, 2009 ఎన్నిక‌లే కాకుండా పార్టీ గెలిచిన 2014 ఎన్నిక‌ల్లోనూ ఓడి రాజ‌కీయ రేసులో వెన‌క‌ప‌డిపోయారు. చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి మూట‌క‌ట్టుకున్న ఆయ‌న మ‌ధ్యలో 2012 ఉప ఎన్నిక‌ల్లో కోవూరులో సొంత బావ ప్రస‌న్నకుమార్ చేతిలో ఓడారు.

వరస ఓటములతో……

మంత్రిగా స‌మైక్య రాష్ట్రంలో చ‌క్రం తిప్పిన సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి చివ‌ర‌కు జ‌డ్పీటీసీగా పోటీ చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. 2014 ఎన్నిక‌ల్లో సోమిరెడ్డి ఓడినా బాబు మాత్రం ఎమ్మెల్సీని చేసి మ‌రీ మంత్రిని చేశారు. అయినా నెల్లూరు జిల్లాలో కాదు క‌దా.. క‌నీసం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కూడా పార్టీని బ‌లోపేతం చేయ‌లేక‌పోయారు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో పార్టీ ఖాతా తెర‌వ‌లేదు.. అటు సర్వేప‌ల్లిలో సోమిరెడ్డి వ‌రుస‌గా నాలుగోసారి… ఓవ‌రాల్‌గా ఐదోసారి ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లోనే సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి స‌ర్వేప‌ల్లి నుంచి త‌ప్పుకుని.. కోవూరులో పోటీ చేస్తార‌న్న టాక్ వ‌చ్చింది. ఓ ద‌శ‌లో ఆయ‌న త‌న‌యుడు రాజ్‌గోపాల్‌రెడ్డి కూడా బ‌రిలోకి దిగుతార‌ని అనుకున్నారు. చివ‌ర‌కు చంద్రబాబు ఒత్తిడి మేర‌కు ఆయ‌న పోటీ చేసి ఓడిపోయారు.

సర్వేపల్లిపై ఆశలు లేక….

పైగా త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌రీ సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓడారు. స‌ర్వేప‌ల్లిపై సోమిరెడ్డికి ఆశ‌లు చ‌చ్చిపోయాయేమో గాని ఆయ‌న కొత్త నియోజ‌క‌వ‌ర్గం వైపు దృష్టి సారిస్తున్నార‌న్నది నెల్లూరు తెలుగు త‌మ్ముళ్ల చ‌ర్చ. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌లు స్వీక‌రించే యోచ‌న‌లో సోమిరెడ్డి ఉన్నట్టు స్థానికంగా పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న మాట‌. ప్రస్తుతం నెల్లూరు పార్టీ ఇన్‌చార్జ్‌గా నెల్లూరు పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఉన్నారు. వాస్తవానికి నెల్లూరు న‌గ‌రంలో మైనార్టీలు ఎక్కువ‌. గ‌త ఎన్నిక‌ల్లో చివ‌ర్లో ఆదాల పార్టీకి షాక్ ఇవ్వడంతో రూర‌ల్ లో అజీజ్‌కు చివ‌ర్లో బీ ఫామ్ ఇచ్చారు. బాబు మైనార్టీ అస్త్రం ఏ మాత్రం యూజ్ అవ్వలేదు.

సరైన నాయకత్వం లేక….

ఇప్పుడు అజీజ్‌కు పార్లమెంట‌రీ పార్టీ ప‌గ్గాలు ఇవ్వడంతో నెల్లూరు రూర‌ల్‌పై సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. రూర‌ల్లో రెడ్డి, బీసీ వ‌ర్గాల‌తో పాటు క‌మ్మలు కూడా ప్రభావం చూపే రేంజ్‌లో ఉన్నారు. ఆ మాట‌కు వ‌స్తే గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో రూర‌ల్ లో టీడీపీకి మెజార్టీ కార్పొరేట‌ర్ సీట్లు వ‌చ్చాయి. పార్టీ ఇక్కడ బ‌లంగా ఉన్నా స‌రైన నాయ‌కుడు లేక‌పోవ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఉంది. ఇక్కడ పార్టీ కేడ‌ర్‌ను స‌మ‌న్వయం చేసుకునే స‌త్తా ఉన్న నాయ‌కుడు వ‌స్తే పార్టీ ఖ‌చ్చితంగా గెలిచే సీట్లలో ఒక‌టి కానుంద‌ని స్థానిక అంచ‌నా.

సోమిరెడ్డి నాయకత్వంలోనైనా..?

వాస్తవానికి 2009లో ఏర్పడిన నెల్లూరు రూర‌ల్ లో పార్టీకి కాలం ఎప్పుడూ క‌లిసి రావ‌ట్లేదు. 2009లో టీడీపీ పొత్తులో భాగంగా క‌మ్యూనిస్టుల‌కు వ‌దులుకోగా.. 2014లో బీజేపీకి ఇచ్చింది. అలా రెండు సార్లు పోటీకి దూరంగా ఉన్న పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో స‌రైన క్యాండెట్ లేక చివ‌రిలో అజీజ్‌ను దింపి మూడోసారి చేతులు కాల్చుకుంది. మ‌రి స‌ర్వేప‌ల్లిలో టైం క‌లిసి రాక రెండు ద‌శాబ్దాలుగా ఏటీకి ఎదురీదుతోన్న సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి స‌రైన నాయ‌క‌త్వం లేక క‌కావిక‌లంగా ఉన్న నెల్లూరు రూర‌ర్ లో అయినా గెలిచి నిలుస్తారేమో ? అన్నది కాల‌మే నిర్ణయించాలి.

Tags:    

Similar News