సోమిరెడ్డి వార‌సుడి రాజ‌కీయం స్టార్ట్‌… స‌ర్వేప‌ల్లిలో మారిన సీన్ ?

తెలుగుదేశం పార్టీలో ఐదుసార్లు వ‌రుస‌గా ఓడిన ఏ నేత‌కు రాని ల‌క్కీ ఛాన్స్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహ‌న్ రెడ్డికి వ‌చ్చింది. వ‌రుస‌గా నాలుగు సార్లు [more]

Update: 2021-02-13 05:00 GMT

తెలుగుదేశం పార్టీలో ఐదుసార్లు వ‌రుస‌గా ఓడిన ఏ నేత‌కు రాని ల‌క్కీ ఛాన్స్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహ‌న్ రెడ్డికి వ‌చ్చింది. వ‌రుస‌గా నాలుగు సార్లు ఓడిపోయాక చంద్రబాబు సోమిరెడ్డిని ఎమ్మెల్సీని చేసి మ‌రీ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అప్పటికి కూడా సోమిరెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పుంజుకోలేక‌పోయారు. చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి మరీ ఎన్నిక‌ల‌కు వెళ్లి ఐదోసారి ఓడిపోయారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సోమిరెడ్డి గ‌త ట‌ర్మ్‌లో మంత్రిగా ఉన్నప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం సోమిరెడ్డి త‌న‌యుడు రాజ్‌గోపాల్ రెడ్డి పెత్తన‌మే సాగింది. అధికారుల బ‌దిలీల‌ల నుంచి, నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికి ఏ పని కావాల‌న్నా రాజ్‌గోపాల్ రెడ్డిని క‌లిస్తే చాలు ప‌నైపోయేది. నాడు స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవ‌ర్థన్ రెడ్డిని సైతం టార్గెట్ చేసేలా తండ్రిని మించి మ‌రీ రాజ్‌గోపాల్ వ్యూహాలు వేసేవారు.

యాక్టివ్ పాలిటిక్స్ లో….

ఒకానొక ద‌శ‌లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను త‌ప్పుకుని త‌న వార‌సుడినే పోటీ చేయిస్తాడ‌ని కూడా అనుకున్నారు. చంద్ర‌బాబు మాత్రం సోమిరెడ్డి లాంటి వ్యక్తిని వ‌ద‌ల‌డం ఇష్టం లేక స‌ర్వేప‌ల్లి నుంచి నువ్వే పోటీ చేయాల‌ని.. మీ వార‌సుడి భ‌విష్యత్తు నాకు వ‌దిలిపెట్టు అని చెప్పడంతో చివ‌ర‌కు ఆయ‌నే పోటీ చేసి ఐదోసారి ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో ఓడినా నెల్లూరు జిల్లాలో పార్టీ ఇంత ద‌య‌నీయ స్థితిలో ఉన్నా కూడా వాయిస్ వినిపిస్తోన్న ఒక‌టీ అరా లీడ‌ర్లలో సోమిరెడ్డి చంద్ర మోహ‌న్ రెడ్డిదే ప్రథ‌మ‌స్థానం. ఇప్పటికే వ‌య‌స్సు పైబ‌డినా సోమిరెడ్డి రాజ‌కీయంగా క్రియాశీల‌కంగానే ఉంటూ వ‌స్తున్నారు.

ఎంపిక అంతా తనయుడిదే….?

తాజా స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నామినేష‌న్ల ద‌శ‌లోనే టీడీపీ చాప చుట్టేస్తోంది. కొన్ని చోట్ల మాజీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు సైతం పార్టీని వ‌దిలేసి … కాడి కింద‌ప‌డేసినా స‌ర్వేప‌ల్లిలో మాత్రం రాజ్‌గోపాల్ రెడ్డి ముందుండి పార్టీని న‌డిపిస్తున్నారు. ప‌లు చోట్ల టీడీపీ స‌ర్పంచ్ అభ్యర్థుల‌ను ఎంపిక చేయ‌డంతో పాటు నామినేష‌న్లు వేసేలా ఎంక‌రేజ్ చేస్తున్నారు. వాస్తవంగా ఈ స్థానిక పోరులో ముందుగా రాజ్‌గోపాల్ రెడ్డే రంగంలోకి దిగి నియోజ‌క‌వ‌ర్గంలో అభ్యర్థుల‌ను చ‌క్కపెడుతుండ‌గా… ఆ త‌ర్వాత సోమిరెడ్డి చంద్ర మోహ‌న్ రెడ్డి రంగంలోకి వ‌చ్చారు.

కుమారుడు ఎంట్రీతో….

సోమిరెడ్డి చంద్ర మోహ‌న్ రెడ్డి రాజ‌కీయంలో నియోజ‌క‌వ‌ర్గంలో యువ‌త ఆయ‌న‌కు దూరం దూరంగా ఉండేవారు. కుమారుడు ఎంట్రీ ఇచ్చాక పార్టీల‌కు అతీతంగా యువ‌త‌ను ఆక‌ర్షించ‌డంలో ఆయ‌న చాలా స‌క్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ స్థానిక ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తి బాధ్యత‌లు అప్పగించ‌వ‌చ్చని తెలుస్తోంది. తండ్రి సోమిరెడ్డి చంద్ర మోహ‌న్ రెడ్డిలా రాజ్‌గోపాల్ రెడ్డి కూడా మౌనంగానే ఉంటూ వ్యూహం ప‌న్నుతార‌న్న పేరుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకాణి దూకుడుకు చెక్ పెట్టేందుకు త‌న వంతుగా ట్రై చేశారు. ఇప్పటికే వ‌రుస‌గా ఐదు సార్లు ఓడిన సోమిరెడ్డి చంద్ర మోహ‌న్ రెడ్డి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని నియోజ‌క‌వ‌ర్గ పూర్తి బాధ్యత‌లు కుమారుడికి అప్పగించాల‌ని చూస్తున్నారు. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకుంటారా ? అన్నది మాత్రం చిన్న స‌స్పెన్సే ?

Tags:    

Similar News