సస్పెన్స్ వీడనుందా…?

వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షులు ఎవరో తేలనుందా? గాంధీ కుటుంబం నుంచే అధ్యక్షులుగా ఉంటారా? లేక ఇతరుల పేర్లు పరిశీలిస్తున్నారా? సోనియాగాంధీ మదిలో [more]

Update: 2019-08-03 17:30 GMT

వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షులు ఎవరో తేలనుందా? గాంధీ కుటుంబం నుంచే అధ్యక్షులుగా ఉంటారా? లేక ఇతరుల పేర్లు పరిశీలిస్తున్నారా? సోనియాగాంధీ మదిలో ఏముంది? ఇదే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మదిలో మెదులుతున్న ప్రశ్నలు. రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రెండు నెలలు గడుస్తుంది. ఇంతవరకూ కొత్త అధ్యక్షుడి నియామకం జరగలేదు. ఈ నెల 8 లేదా పదో తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటి కానుంది. ఈ సమావేశంలో కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతుంది.

రాహుల్ ససేమిరా…..

రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో శూన్యత నెలకొంది. రాహుల్ గాంధీని ఎంత బతిమాలినా ఆయన పార్టీ పదవిని చేపట్టేందుకు అంగీకరించడం లేదు. తాను ఎవరి సారథ్యంలోనైనా పనిచేస్తానని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగానే ఉంటానని రాహుల్ గాంధీ చెబుతున్నారు. రాహుల్ మొండిపట్టు వీడకపోవడంతో సోనియాగాంధీ సయితం ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రియాంక సయితం…..

గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు పదవి చేపడితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారి పోతుందన్న భావన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉంది. నేతలు సయితం ఇదే రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా ప్రియాంక గాంధీ పేరును సూచిస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సయితం ప్రియాంక గాంధీ పగ్గాలు చేపట్టాలని సూచించారు. అనేక మంది నేతల అభిప్రాయం కూడా ప్రియాంక ఆ పదవి చేపడితేనే బాగుంటుందని సూచిస్తున్నారు.

చివరకు సోనియానే…..

కానీ ప్రియాంక గాంధీ సయితం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఆ పదవికి తన పేరును ప్రతిపాదించవద్దని ప్రియాంక గాంధీ సూచించారు. దీంతో ఇప్పుడు అందరి మనసులో సోనియా గాంధీ పేరు ఉంది. సోనియాను ఎలాగైనా ఒప్పించాలని సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రచారం, రాష్ట్ర పర్యటనలు రాహుల్ గాంధీ చూసుకుంటారని, అధ్యక్ష పదవిలో కూర్చుని తమకు ఆదేశాలివ్వాల్సిందిగా అహ్మద్ పటేల్ వంటి సీనియర్ నేతలు సోనియాగాంధీని కోరుతున్నారు. మరి సోనియాగాంధీ దీనికి అంగీకరిస్తారో? లేదో? చూడాలి. సోనియా గాంధీ కూడా కాదంటే మల్లికార్జున ఖర్గే పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. సస్పెన్స్ కు మాత్రం ఈ నెల 8 లేదా పదో తేదీన జరిగే సీడబ్ల్యూసీ మీటింగ్ లో తెరపడనుంది.

Tags:    

Similar News