సోనియా సక్సెస్ అవుతారా?

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారు. అన్ని పక్షాలను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలన్నది సోనియాగాంధీ ఆలోచన. పదేళ్ల పాటు [more]

Update: 2021-08-26 16:30 GMT

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారు. అన్ని పక్షాలను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలన్నది సోనియాగాంధీ ఆలోచన. పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండటంతో అనేక రాష్ట్రాల్లో పార్టీ ఇబ్బందులు పడుతుంది. కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరికొన్నింటిలో భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ విపక్షాల్లో ఐక్యత తెచ్చే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు.

మమత ప్రయత్నాలను….

మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెసేతర పార్టీలను కలుపుకుని వెళితే ప్రయోజనం ఉండదని తెలిసినా ఆ పార్టీని కట్టడి చేయడానికే మమత బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవాయే ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ ఎక్కువ రాష్ట్రాల్లో నామమాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మమత బెనర్జీ కంటే ముందుగానే విపక్షాలను ఒక తాటిపైకి తేవాలన్న యోచనలో సోనియా గాంధీ ఉన్నారు.

యూపీ పార్టీలు మాత్రం…

అందుకే ఇటీవల విపక్షాలతో సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు పదిహేను రాజకీయ పార్టీలు ఈ సమావేశమై కాంగ్రెస్ కు తాము దన్నుగా ఉన్నాయని ప్రకటించాయి. మమత బెనర్జీ కూడా హాజరయ్యారు. అయితే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోని బలమైన ప్రాంతీయ పార్టీలు సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. అయితే ఆ రాష్ట్ర ఎన్నికల అనంతరం ఇవి కలసి వచ్చే అవకాశముందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భావిస్తున్నారు.

ఎన్నికల అనంతరం…

ఎన్నికలకు ముందే బీజేపీయేతర పార్టీలను ఒక గాడికి తెస్తే ఎన్నికల అనంతరం మరికొన్ని పార్టీలు కాంగ్రెస్ కూటమిలో చేరే అవకాశాలున్నాయి. అందుకోసమే సోనియా గాంధీ బలమైన ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొన్నటి వరకూ అనారోగ్యంతో పార్టీ పరిస్థితులను పెద్దగా పట్టించుకోని సోనియా గాంధీ ఇటీవల యాక్టివ్ అయ్యారు. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి విపక్షాలతో మోదీపై యుద్ధానికి సన్నద్ధమవ్వాలన్నది సోనియా గాంధీ ఆలోచన అని చెబుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ఏ పక్షాన్ని వదులుకోకుండా లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలన్న భావనలో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

త్వరలో మరో సమావేశం…..

సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం నిర్వహించారు. అధికార బిజేపి ని దీటుగా ఎదుర్కుని నిలువరించేందుకు, భావసారూప్యతగల పార్టీ లన్నింటినీ ఏకం చేసి, మరింత బలీయమైన ఉమ్మడి పోరుకు సన్నధ్దమౌతున్నారు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాలలో మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసిన ఉమ్మడి పోరు ను మరింత సమర్ధవంతంగా కొనసాగించేందుకు, ప్రతిపక్షాల ఐక్యతను పటిష్టంచేసేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News