ఏమీ చేయలేకపోతున్నారే

దాదాపు దశాబ్దాల పాటు సోనియాగాంధీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నిర్వహించారు. అయితే సోనియాగాంధీ ఎన్నడూ ఇలాంటి పరిణామాలు చూడలేదు. సోనియా గాంధీ మాటే వేదం. [more]

Update: 2019-08-29 18:29 GMT

దాదాపు దశాబ్దాల పాటు సోనియాగాంధీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నిర్వహించారు. అయితే సోనియాగాంధీ ఎన్నడూ ఇలాంటి పరిణామాలు చూడలేదు. సోనియా గాంధీ మాటే వేదం. ఆమె చెప్పిందే శాసనం. మన్మోహన్ సింగ్ ను రెండుసార్లు ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టాలన్నా ఆమె నిర్ణయానికి సాహో అన్నారు కాంగ్రెస్ సీనియర్లు. అలాంటి సీనియర్లు ఇప్పుడు సోనియాగాంధీని లెక్క చేయడం లేదు. ఇక పార్టీ ఇక కోలుకోవడం కష్టమన్న అభిప్రాయంలో ఉన్నారు. అందుకే సోనియా గాంధీ మాటలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

అన్ని రకాలుగా ఇబ్బంది…..

కాంగ్రెస్ ప్రస్తుతం పూర్తి సంక్షోభంలో ఉంది. అధికారానికి పదేళ్లు దూరంగా ఉండాల్సి రావడంతో కాంగ్రెస్ కష్టం వచ్చి పడింది. అసలే ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను మోయడానికి స్వయానా గాంధీ వారసుడు రాహుల్ గాంధీ చేతులెత్తేశారు. దీంతో తిరిగి అనారోగ్యంతో బాధపడుతున్నా సోనియాగాంధీ ఆ బాధ్యతలను స్వీకరించక తప్పలేదు. తాత్కాలికంగానే అని సోనియాగాంధీ చెబుతున్నప్పటికీ రాహుల్ మనసు మారేంత వరకూ సోనియా గాంధీయే కొనసాగుతారన్నది వాస్తవం.

సీనియర్…జూనియర్ అని లేకుండా….

అయితే సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ లో సీనియర్ , జూనియర్ అనే తేడా లేకుండా గళం విప్పుతున్నారు. చిదంబరం సీనియర్ నేతలు అరెస్ట్ అవుతున్నా అనుభవమున్న నేతల నుంచి పెద్దగా స్పందన లేదు. ఇదివరకే జమ్మూ కాశ్మీర్ అంశంపై కాంగ్రెస్ స్టాండ్ ను తప్పుపట్టి మరీ సోనియాగాంధీకి ఝలక్ ఇచ్చారు కొందరు నేతలు. పార్టీ వైఖరిని బహిరంగంగానే విమర్శించారు.

చర్యలు తీసుకోవడానికి….

ఇక తాజాగా మోదీ విషయంలో దూకుడు వద్దంటూ జైరాం రమేష్, శశిథరూర్ వంటి నేతలు సూచిస్తుండటం పార్టీకి ఇబ్బందిగా మారింది. మోదీని వారు పొగుడుతుండటం కూడా కాంగ్రెస్ కు నష్టాన్ని తెచ్చిపెట్టేదే. అయినా ఒకనాడు పార్టీని ఒంటిచేత్తో శాసించిన సోనియాగాంధీ లైన్ దాటుతున్న వారిపై ఎలాంటి చర్యలకు దిగలేకపోతున్నారు. మన్మోహన్ సింగ్ లాంటి మాట్లాడని వారిని రాజ్యసభకు తిరిగి ఎంపిక చేయడాన్ని కూడా సీనియర్లు తప్పుపడుతున్నారు. ఇలా కాంగ్రెస్ లో సోనియాగాంధీ కళ్లముందే కనుబొమ్మలు ఎగరేసే పరిస్థితి తలెత్తింది.

Tags:    

Similar News