హోదా విషయంలో వైసీపీ నిజం చెప్పేస్తుందా.. ?

ప్రత్యేక హోదా అన్నది కేంద్రం ఇవ్వాల్సింది. రాష్టం పుచ్చుకోవాల్సింది. అక్కడ ఉన్నది మోడీ. ఆయన అవును అంటేనే ఏదైనా జరిగేది. ఇక మోడీ జాతీయ పార్టీ అయిన [more]

Update: 2021-05-14 15:30 GMT

ప్రత్యేక హోదా అన్నది కేంద్రం ఇవ్వాల్సింది. రాష్టం పుచ్చుకోవాల్సింది. అక్కడ ఉన్నది మోడీ. ఆయన అవును అంటేనే ఏదైనా జరిగేది. ఇక మోడీ జాతీయ పార్టీ అయిన బీజేపీకి నాయకుడు, కేంద్రంలో ప్రధానిగా ఉన్నా కూడా ఎందుకో సొంత రాష్ట్రం గుజరాత్ మీద మక్కువ అంటారు. దాంతో ప్రత్యేక హోదా విషయంలో అక్కడే అడ్డుకట్ట పడిపోయింది అని కూడా ప్రచారంలో ఉంది. కానీ హోదా వస్తుంది. తెచ్చి తీరుతాను అని జగన్ భీషణ ప్రతిన చేశారు. ఆయనకు జనాలు పెద్ద సంఖ్యలో ఎంపీలను ఇచ్చినా ఇపుడు మాత్రం ప్రత్యేక హోదా అన్న ఊసే లేదని తెలుగుదేశం విమర్శిస్తోంది.

కెలికిన టీడీపీ …..

తిరుపతి ఉప ఎన్నికల వేళ కోరి ప్రత్యేక హోదాను పార్లమెంట్ లో టీడీపీ కెలికింది. ఆ పార్టీకి చెందిన యువ ఎంపీ రామ్మోహననాయుడు హోదా ఎందుకు ఇవ్వరూ అని గట్టిగా నిలదీస్తే అది ముగిసిన అధ్యాయం అంటూ కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చాలా కూల్ గా చెప్పేశారు. పైగా ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజి ఇచ్చాముగా అంటూ దీర్ఘాలూ తీశారు. దీంతో అలెర్ట్ అయిన వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేశారు మొత్తానికి హోదాని రగిల్చి తిరుపతి రూటుగా బాటలు వేసుకోవడానికి రెండు పార్టీలూ తయారు అయ్యాయన్నది తెలిసిందే.

కుండబద్ధలు కొడతారా …?

ఇక ప్రత్యేక హోదా విషయం మీడియా కూడా మరచిపోయింది. కానీ తమ రాజకీయాల కోసం పార్టీలు బయటకు తీస్తున్నపుడే వారికి గుర్తుకు వచ్చి ప్రశ్నలు వేస్తూంటాయి. అలాగే వైసీపీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డికి కూడా హోదా ప్రశ్న ఎదురవుతోంది. దానికి ఆయన బదులిస్తూ అది సగం చచ్చిన డిమాండ్ అంటూ ఒక విధంగా సంచలనమైన వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడే ప్రత్యేక హోదా డిమాండ్ సగానికి సగం చచ్చిపోయింది అని సజ్జల టీడీపీని టార్గెట్ చేశారు. అంటే హోదా ఇప్పటికి సగం చచ్చింది అని వైసీపీలో కీలక నేత ఇన్నాళ్ళకు ఒప్పుకున్నారు అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

మిగతా సగమో ..?

దీని మీదనే ప్రత్యర్ధి పార్టీల నుంచి హాట్ కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. బాబు సగం చంపేస్తే వైసీపీ మిగిలిన సగం చంపేసింది అని ప్రతిపక్ష పార్టీలూ, మేధావులూ అంటున్నారు. అయితే ప్రత్యేక హోదా సజీవమైన అంశమని, దాన్ని అలా రగిలిస్తూ ఉంటామని ఆ మధ్యదాకా చెప్పిన వైసీపీ హఠాత్తుగా ఇపుడు సగం చచ్చిపోయింది అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి అన్నది కూడా ఒక చర్చగానే ఉంది. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దగ్గర పడుతోంది. మోడీ ఉండగా ప్రత్యేక హోదా రాదు అని తెలిసిపోయింది. మళ్ళీ 2024లో ఆయన వచ్చినా అసలు ఇవ్వరు, వేరెవరు వచ్చినా ఈ డిమాండ్ కి అప్పటికే ప‌దేళ్ళ కాలం తీరిపోతుంది. ఇలా ప్రత్యేక హోదా అన్న బ్రహ్మ పదార్ధాన్ని ఎంతకాలం మోస్తామన్న ఆత్మ జ్ఞానంతోనే వైసీపీ సగం చచ్చిందంటూ హోదా కధను ఇంటర్వెల్ దాకా తెచ్చిందని అంటున్నారు. ఇక ఇపుడు క్లైమాక్స్ కి చేర్చడమే మిగిలి ఉన్న పని అంటున్నారు. అదే జరిగితే మాత్రం ప్రత్యేక హోదా చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోవడం ఖాయమే.

Tags:    

Similar News