సౌత్ మీద కన్నేసిన మూర్తి గారి మనవడు ?

విశాఖలో టీడీపీకి ఇపుడు నాలుగు దిక్కులూ రెండు అయ్యాయి. విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నా లేనట్లే అయ్యారు. ఇక సౌత్ నుంచి గెలిచిన [more]

Update: 2021-04-28 00:30 GMT

విశాఖలో టీడీపీకి ఇపుడు నాలుగు దిక్కులూ రెండు అయ్యాయి. విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నా లేనట్లే అయ్యారు. ఇక సౌత్ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి జంప్ చేశారు. ఈ నేపధ్యంలో టీడీపీలో ఆశావహులు ఈ రెండు సీట్ల మీద దృష్టి సారించారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన బాలయ్య అల్లుడు, దివంగత ఎంవీవీఎస్ మూర్తి మనవడు అయిన శ్రీభరత్ దక్షిణం వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది.

మొత్తం వదిలేసి ….

విశాఖ ఎంపీగా 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన శ్రీ భరత్ ఏడు నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేశారు. మరి పార్టీ యోగక్షేమాలు మొత్తం అన్ని చోట్లా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అందునా పార్టీ విపక్షంలో ఉన్న వేళ శ్రీభరత్ అయితే కచ్చితంగా అండగా ఉండాలి. కానీ ఆయన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం సౌత్ కి మాత్రమే పరిమితం అయ్యారు. దాంతో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ అయితే బయల్దేరింది.

ఎవరూ లేని చోట ….

దక్షిణ నియోజకవర్గంలో సీన్ చూస్తే టీడీపీకి గట్టి నాయకులు ఎవరూ లేరు. మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ వైసీపీలో ఎపుడో చేరిపోయారు. ఇక వాసుపల్లి కూడా అటే జంప్ చేశారు. దాంతో వచ్చే ఎన్నికల వేళ పోటీకి నేతలను వెతకాల్సిందే అంటున్నారు. దాంతో తానే ఎందుకు పోటీ చేయకూడదు అన్న ఆలోచన శ్రీభరత్ కి వచ్చిందా. లేక తమ్ముళ్ళే కోరారా అన్నది తెలియదు కానీ ఆయన మాత్రం సౌత్ మీద ప్రేమను పెంచుకుంటున్నారు అంటున్నారు. దాంతో ఆయన తన కార్యాచరణను అక్కడ నుంచే ప్రారంభించారని చెబుతున్నారు.

అమ్మ పోటీ చేయాల్సిన చోట …

ఇక విశాఖ దక్షిణం పూర్వం విశాఖ వన్ గా ఉండేది. రెండు దశాబ్దాల క్రితం విశాఖ వన్ నుంచి పోటీకి తన కోడలిని రంగంలోకి దింపాలని మూర్తి మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. ఆమె ఎవరో కాదు శ్రీభరత్ తల్లి. అంతే కాదు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె కూడా. అలా ఆమె రాజకీయ నేపధ్యాన్ని ఉపయోగించుకోవాలని మూర్తి ఆలోచించారని చెబుతారు. అయితే చంద్రబాబు మాత్రం మూర్తి మాటను పడనీయలేదు అంటారు. మళ్ళీ ఇన్నాళ్ళకు మూర్తి మనవడు శ్రీభరత్ ఈ సీటు మీద మక్కువ పెంచుకున్నారు అంటే తమ్ముళ్ళకు ఇపుడు ఆ గతం గుర్తుకు వస్తోందిట. ఏది ఏమైనా ఈసారి అయినా చంద్రబాబు పడనిస్తారా, భరత్ కి సౌత్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అన్నదే ఇపుడు చర్చ.

Tags:    

Similar News