తాత సత్తా మనవడికి లేదా ?

విశాఖకు వ్యాపార నిమిత్తం వచ్చి ఆనక రాజకీయాల్లోనూ రాణించి మేటి అనిపించున్న వారు స్వర్గీయ ఎంవీవీఎస్ మూర్తి. ఆయన రెండు సార్లు విశాఖ నుంచి లోక్ సభకు [more]

Update: 2021-05-15 03:30 GMT

విశాఖకు వ్యాపార నిమిత్తం వచ్చి ఆనక రాజకీయాల్లోనూ రాణించి మేటి అనిపించున్న వారు స్వర్గీయ ఎంవీవీఎస్ మూర్తి. ఆయన రెండు సార్లు విశాఖ నుంచి లోక్ సభకు నెగ్గారు. ఒకమారు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. పార్టీకి పెట్టని కోటలా ఉండేవారు. ఆయన్ని కాదని విశాఖ టీడీపీలో ముందుకు సాగే ధైర్యం ఎవరూ చేసేవారు అని కూడా చెబుతారు. అటు అధినాయకత్వానికీ, ఇటు పార్టీకి మధ్య వారధిగా సారధిగా ఎంవీవీఎస్ మూర్తి చక్రం తిప్పేవారు.

బెంగ లేదుగా …..

ఆర్ధికంగా సైతం మూర్తి పార్టీకి అతి పెద్ద అండ. ఆయన ఉంటే చాలు అభ్యర్ధులు దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగానూ చూసుకునేవారు. హై కమాండ్ ప్రసక్తే లేకుండా చాలా విషయాల్లో లోకల్ గానే సెట్ చేసేవారు. అటువంటి మూర్తి దివంగతులయ్యాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ విశాఖలో టీడీపీ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఆర్ధికంగా కూడా దిక్కులేనిది అయింది. నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే నాయకుడే కరవు అయ్యారు. అందరినీ కలిపి ఉంచే మూర్తి లాంటి వారి నాయకత్వం లేకుండా పోయింది.

వారసుడైనా….?

వరసకు మనవడు, రాజకీయ వారసుడు అయినా శ్రీ భరత్ తాతలా పార్టీకి అండగా నిలవలేకపోతున్నారు అంటున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేసి బాగానే ఓట్లు సంపాదించుకున్నారు. కానీ పూర్తి స్థాయి రాజకీయాలను చేయలేకపోతున్నారు. తన విద్యా సంస్థలు తానూ అన్నట్లుగా ఉంటున్నారు. తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ చాలా చోట్ల పరాజయం పాలు కావడం వెనక ఆర్ధిక కోణం కూడా ఉందని అంటారు. మరి శ్రీ భరత్ వంటి యువ నాయకులు, బిగ్ షాట్స్ ఉండీ కూడా టీడీపీకి ఈ దైన్యం కలగడం అంటే ఆలోచించాల్సిందే అన్న మాట కూడా ఉంది.

ఇదే సమయం….

తెలుగుదేశంలో సీనియర్ల శకం ముగుస్తోంది. వారు సైతం అనాసక్తిగా ఉంటున్నారు. ఇక శ్రీ భరత్ లాంటి వారు ముందుకు వస్తేనే విశాఖ లాంటి చోట వైసీపీని ఢీ కొట్టి టీడీపీ నిలుస్తుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీ నుంచి అంతా యువ రక్తమే కనిపిస్తోంది. యువ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి సవాల్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో శ్రీ భరత్ కనుక విశాఖ రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకుని ముందుకు నడిపిస్తే పార్టీకి పూర్వ వైభవం దక్కుతుంది అంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిక్కు ముడి ఉంది. శ్రీ భరత్ దూకుడుగా ముందుకు సాగడానికి హై కమాండ్ ఎంత మేరకు అవకాశం ఇస్తుంది అన్నదే పెద్ద సందేహం. అక్కడ పచ్చ జెండా ఊపేస్తే ఇక్కడ పసుపు జెండా రెపరెపలాడడం ఖాయమే అంటున్నారు తమ్ముళ్ళు.

Tags:    

Similar News