సిక్కోలును చూసి సిగ్గుతెచ్చుకోవాల్సిందే?

అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా కరోనా వైరస్ నుంచి ఎలా తప్పించుకోగలిగింది? ఇక్కడ కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా రాకపోవడానికి కారణాలేంటి? అన్న చర్చ రాష్ట్రంలో [more]

Update: 2020-04-14 18:29 GMT

అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా కరోనా వైరస్ నుంచి ఎలా తప్పించుకోగలిగింది? ఇక్కడ కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా రాకపోవడానికి కారణాలేంటి? అన్న చర్చ రాష్ట్రంలో విస్తృతంగా జరుగుతోంది. పొరుగునే ఉన్న ఒడిశా రాష్ట్రంలో కూడా తక్కువ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నానికి దగ్గరగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. దీంతో అందరి దృష్టి శ్రీకాకుళం జిల్లాపైనే ఉంది.

వెనకబడిన ప్రాంతమైనా…..

శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇక్కడ నుంచి ఉపాధి కోసం వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు వలస వెళుతుంటారు. ఈ లెక్కన చూసుకుంటే ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరగాల్సి ఉంది. అయితే ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లనే శ్రీకాకుళం జిల్లాలోకి కరోనా వైరస్ ఎంటర్ కాలేదన్నది అధికారులు చెబుతున్నా మాట. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలియగానే కలెక్టర్, ఎస్పీలు సమన్వయంతో చేసిన కృషి ఫలించిందనే చెప్పాలి.

లాక్ డౌన్ ను కఠినంగా…..

వైరస్ ప్రారంభమయిన దగ్గర నుంచి లాక్ డౌన్ ను కఠినంగా అమలు పర్చారు. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లలో కూడా భౌతిక దూరం పాటించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ రైతు బజార్లను విశాల ప్రాంగణంలో పెట్టి ప్రజలుకు ఇబ్బంది లేకుండా, వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. కొందరికి నేరుగా నిత్యావసర వస్తువులను ఇళ్లకే సరఫరా చేశారు. లాక్ డౌన్ కు ముందు శ్రీకాకుళం జిల్లాకు పెద్దయెత్తున విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని వెంటనే గుర్తించారు.

విదేశాల నుంచి వచ్చినా…..

వారిని తక్షణమే క్వారంటైన్ కు తరలించారు. వారు నిబంధనలను ఉల్లంఘించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 1445 మంది విదేశాల నుంచి శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. వీరందరినీ వెంటనే గుర్తించివారిలో 500 మందిని క్వారంటైన్ కు తరలించారు. ఇక మర్కజ్ మసీద్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని కూడా వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అధికారయంత్రాంగం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే దీనికి కారణమని చెప్పక తప్పదు.

Tags:    

Similar News