స్టాలిన్ విజయానికి అదనపు బలం ఇదే…?

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమి దాదాపుగా గెలిచినట్లే. ఇప్పటివరకూ వచ్చిన సర్వేలన్నీ డీఎంకేదే విజయమని తేల్చాయి. కూటమిలోని పార్టీలకు సీట్లు సర్దుబాటు చేసుకుని స్టాలిన్ తలనొప్పులు లేకుండా [more]

Update: 2021-03-26 18:29 GMT

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమి దాదాపుగా గెలిచినట్లే. ఇప్పటివరకూ వచ్చిన సర్వేలన్నీ డీఎంకేదే విజయమని తేల్చాయి. కూటమిలోని పార్టీలకు సీట్లు సర్దుబాటు చేసుకుని స్టాలిన్ తలనొప్పులు లేకుండా చూసుకోగలిగారు. ఒకవైపు ప్రత్యర్థి అన్నాడీఎంకే కూటమిని చూసుకుంటే డీఎంకే విజయం ఖాయమన్నది దాదాపుగా అందరికీ తెలిసిపోయిందే. సింగిల్ గానే డీఎంకే అధికారానికి కావాల్సిన స్థానాలను సాధిస్తుందన్న అంచనాలు కూడా విన్పిస్తున్నాయి.

విజయానికి మరింత …..

ఈ నేపథ్యంలో స్టాలిన్ హామీలు పార్టీ విజయానికి మరింత ఉపకరిస్తాయని అంటున్నారు. స్టాలిన్ ఇటీవల మ్యానిఫేస్టో విడుదల చేశారు. ఇందులో ప్రజలకు అనేక వాగ్దానాలను ఇచ్చారు. సహజంగా తమిళనాడు అంటేనే ఉచిత హామీలు అనేకం ఉంటాయి. జయలలిత, కరుణానిధి హయాం నుంచే ఈ ఉచిత పథకాలు అమలవుతున్నాయి. స్టాలిన్ కూడా అదే సంప్రదాయన్ని కొనసాగిస్తూ హామీల వర్షం కురిపించారు.

ఆకర్షించే హామీలు…..

ప్రధానంగా ఇప్పుడు పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగాయి. పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో స్టాలిన్ పెట్రోలు లీటర్ పై ఐదు రూపాయలు, డీజిల్ పై నాలుగు రూపాయలు తాను అధికారంలోకి వస్తే తగ్గిస్తానని చెప్పడం ప్రజలను ఆకర్షించే విధంగా ఉంది. ఇక గ్యాస్ సిలిండర్ పైనా వందరూపాయలు సబ్సిడీని స్టాలిన్ ప్రకటించారు. దీంతో ప్రత్యర్థిగా ఉన్న అన్నాడీఎంకే కూటమిని స్టాలిన్ ఇరకాటంలో పెట్టినట్లయింది.

500 వాగ్దానాలతో……

మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కూడా అనేక హామీలు ఇచ్చారు. మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. మహిళా ఉద్యోగులకు ఏడాదిపాటు ప్రసూతి సెలవులు ఇస్తామని చెప్పారు. 75 శాతం ఉద్యోగాలు తమిళులకే వచ్చేలా చట్టం తెస్తామని చెప్పారు. రేషన్ కార్డులున్న వారికి నాలుగువేల రూపాయలు కరోనా సాయం ఇస్తామని స్టాలిన్ చెప్పారు. దాదాపు 500 హామీలను ఇచ్చి స్టాలిన్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరి స్టాలిన్ హామీలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Tags:    

Similar News