వదిలించుకోవాలనేనా?

స్టాలిన్ రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు లేకపోవడం, కేంద్రంలో అధికారంలో రాకపోవడం కాంగ్రెస్ ను డీఎంకే అధినేత స్టాలిన్ పురుగును చూసినట్లు చూస్తున్నారు. ఆపార్టీని [more]

Update: 2019-07-24 18:29 GMT

స్టాలిన్ రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు లేకపోవడం, కేంద్రంలో అధికారంలో రాకపోవడం కాంగ్రెస్ ను డీఎంకే అధినేత స్టాలిన్ పురుగును చూసినట్లు చూస్తున్నారు. ఆపార్టీని డీఎంకే లెక్క చేయలేదనడానికి అనేక ఉదాహరణలు కన్పిస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల వరకూ స్టాలిన్ కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగానే మెలిగారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీని చేర్చుకుని గౌరవప్రదమైన స్థానాలను కేటాయించారు. రాహుల్ గాంధీని కాబోయే ప్రధానిగా ప్రకటించింది కూడా డీఎంకే అధినేత స్టాలిన్ కావడం గమనార్హం.

అప్పటి నుంచే…..

అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కథ తారుమారైనట్లు కన్పిస్తోంది. పార్లమెంటులో డీఎంకే బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడమూ అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలను కూడా స్టాలిన్ వదిలించుకోవాలని చూస్తున్నారు. వేలూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ముసలం మొదలయిందంటున్నారు. ఇక్కడ డీఎంకే తమ అధికార అభ్యర్థిగా కదిరి ఆనంద్ ను ప్రకటించింది. అయితే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ నేత వాలాజా అసేన్ పోటీ చేస్తుండటం స్టాలిన్ ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు.

ఉప ఎన్నిక విషయంలో…..

దీంతో స్టాలిన్ కాంగ్రెస్ ను పక్కనపెట్టేందుకు మరో చర్యకు దిగబోతున్నారు. నాంగునేరి అసెంబ్లీ ఉప ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకుమార్ పార్లమెంటు సభ్యుడిగా ఇటీవల గెలవడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. వాస్తవానికి ఇది కాంగ్రెస్ స్థానమే. అయితే ఇక్కడ తన కుమారుడు ఉదయనిధిని పోటీ చేయించాలని స్టాలిన్ భావిస్తున్నారట. కాంగ్రెస్ ను ఆ విధంగా దెబ్బకొట్టాలని పార్టీ క్యాడర్ ద్వారా ఉదయనిధికి సీటు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారన్న టాక్ విన్పిస్తోంది.

కాంగ్రెస్ కారాలు…మిరియాలు….

అయితే కాంగ్రెస్ దీనిపై కారాలు మిరియాలు నూరుతోంది. ఇప్పటికే మన్మోహన్ సింగ్ కు తమిళనాడు నుంచి రాజ్యసభ పదవి ఇవ్వమంటే ఇవ్వకుండా స్టాలిన్ పార్టీని అవమానపర్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా టీఎన్ సీసీ అధ్యక్షుడు ఆళగిరి డీఎంకేపై బహిరంగ విమర్శలే చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడంతో స్టాలిన్ కూడా కాంగ్రెస్ ను వదిలించుకోవాలని చూస్తున్నారు. మరి స్టాలిన్ ఈ నిర్ణయాలు భవిష్యత్ లో పార్టీపై ప్రభావం చూపుతాయన్న ఆందోళన కూడా డీఎంకే నేతల్లో లేకపోలేదు.

Tags:    

Similar News